
యుద్ధం దెబ్బకు గ్యాస్ సిలిండర్ల ధర మోత మొదలైందా ?
పోయిన నెలలో రు. 900 ఉన్న సిలిండర్ ధర ఇపుడు రు.965కి పెరిగిపోయింది.
గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధందెబ్బకు మనదగ్గర అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ ధరల మోత మొదలైపోయింది. పోయిన నెలలో రు. 900 ఉన్న సిలిండర్ ధర ఇపుడు రు.965కి పెరిగిపోయింది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ధరలు కూడా ఆకాశంపైకి ఎగబాకుతునే ఉంటాయనే ఆందోళన జనాల్లో పెరిగిపోతోంది. ఎందుకంటే నిత్యావసరాల ధరలు పెరిగిపోయినంత వేగంగా ఉద్యోగుల జీతాలు, ప్రజల ఆదాయాలు పెరగవు కదా.
గల్ఫ్ యుద్ధ ప్రభావం మొదటగా గ్యాస్ సిలిండర్ల మీద పడింది. ఎలాపడిందంటే గ్యాస్ సరఫరాలో రెండు సిలిండర్ల మధ్య గ్యాప్ కచ్చితంగా 30 రోజులుండాలనే నిబంధనను రాష్ట్రంలోని గ్యాస్ డీలర్లు అమలుచేస్తున్నారు. ఇది పూర్తిగా అనధికారికమే అయినా ఆచరణలో మాత్రం ఇదే జరుగుతోంది. డబుల్ సిలిండర్ల బుకింగ్ గ్యాప్ 30 రోజులుండాలని, సింగిల్ సిలిండర్ల వినియోగదారులకు 21 రోజులనే నిబంధనను డీలర్లు అమలుచేస్తున్నారు. తెలంగాణలో సుమారు 1.3 కోట్ల గ్యాస్ వినియోగదారులున్నారు. వీరిలో అత్యధికంగా ఇండేన్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులే. రాష్ట్రంలో ఇండేన్, భారత్, హెచ్పీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు గ్యాస్ డీలర్లున్నా వారి సంఖ్య బాగా తక్కువ.
ఇండేన్ వినియోగదారులే ఎక్కువ
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సుమారు 60 లక్షలుండగా, భారత్ గ్యాస్ 38 లక్షలు, హెచ్పీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య సుమారు 27 లక్షలు. వీళ్ళు కాకుండా ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకంలో మరో 15వేలమంది వినియోగదారులున్నారు. వీరిలో అత్యధికులు సింగిల్ సిలిండర్ వినియోగదారులనే చెప్పాలి. సప్లై-డిమాండ్ సూత్రం ఆధారంగా మిగిలిన వస్తువుల ధరలు పెరిగినట్లుగానే గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. మనదేశానికి వచ్చే ఎల్పీజీ గ్యాస్ లో ఎక్కువభాగం గల్ఫ్ దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, దుబాయ్, ఒమన్ దేశాల నుండే వస్తాయి. యుద్ధం కారణంగా పై దేశాల్లో ఎక్కడినుండి కూడా మనదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి.
అందుకనే గ్యాస్ కొరత కారణంగా ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజల్ దిగుమతిలో ఎక్కువభాగం గల్ఫ్ దేశాల నుండే వస్తోంది. ప్రస్తుతానికి సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి కాబట్టి త్వరలోనే పెట్రోల్, డీజల్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినియోగదారుల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరల మీదే రవాణా ఖర్చలు ఆధారపడున్నాయి. రవాణాఖర్చుల మీదే వివిధ వస్తువులతో పాటు నిత్యావసరాల ధరలు నిర్ణయమవుతాయి. అందుకనే పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతే దాని ప్రభావం ఇతర వస్తువులు, నిత్యావసరాల ధరల పైన ప్రభావం చూపటం తప్పదు.
యుద్ధం ఇలాగే మరికొద్దిరోజులు సాగితే పెట్రోల్, డీజల్ ధరలు పెరగటం కన్నా ముందు రేషన్ మొదలవుతుంది. ఇపుడు పెట్రోల్, డీజల్ ఎంతకావాలంటే అంత పోయించుకుంటున్నారు వినియోగదారులు. కొద్దిరోజులు ఇలాగే సాగితే ముందు పెట్రోల్, డీజల్ ఇచ్చే విషయంలో నిబంధనలు అమలవుతాయి. అంటే వాహనానికి కచ్చితంగా ఇన్నే లీటర్ల పెట్రోల్ లేదా డీజల్ ఇవ్వాలనే నిబంధన కూడా అమల్లోకి వచ్చే అవకాశముంది. దీనివల్ల అవసరమైనంత ఆయిల్ దొరక్క, ధరలు కూడా పెరిగిపోవటంతో జనాల్లో అలజడి మొదలవుతుంది.
గ్రేటర్లోనే ఎక్కువ
రాష్ట్రం మొత్తంమీద సుమారు 1.3 కోట్లమంది గ్యాస్ సిలిండర్ల వినియోగదారులుంటే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 25 లక్షలమంది వినియోగదారులున్నారు. హైదరాబాద్ పరిధిలో 18 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 12 లక్షలు, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 10 లక్షలు, నల్గొండ జిల్లాలో 6 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 5 లక్షలమంది వినియోగదారులున్నారు. హైదరాబాద్ మహానగరంలో హైరైజ్ అపార్ట్ మెంట్లు, అర్బన్ హౌసింగ్, రో హౌసెస్, స్లమ్స్, గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీలు ఉన్న కారణంగా నగరంలో అత్యధికంగా గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటి ధరల పెరుగుదల ప్రభావం డైరెక్టుగా జనాల జేబుల మీదపడుతుంది. కాబట్టే ధరల పెరుగుదల ప్రభావం జనాల దైనందిన జీవితాల మీద చూపుతాయి. అందుకనే జనాల్లో అలజడి పెరగకుండా కేంద్ర్రప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
యుద్ధం వల్లే సరఫరా తగ్గింది: కృష్ణవేణి
హైదరాబాద్, రామ్ నగర్ లో ఉండే హెచ్పీ గ్యాస్ డీలర్ కృష్ణవేణి తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘యుద్ధ ప్రభావం వల్ల సిలిండర్ల బుకింగులో గ్యాప్ అమలుచేస్తున్నాము’’ అని చెప్పారు. ‘‘డబుల్ సిలిండర్ల బుకింగ్ గ్యాప్ కచ్చితంగా 30 రోజులు, సింగిల్ సిలిండర్ల గ్యాప్ 21 రోజులు ఉండాలి’’ అని తెలిపారు. ‘‘యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గిపోయింది కాబట్టే తాము ఈ నిబంధన అమలుచేస్తున్నాము’’ అన్నారు. ఈ నిబంధన కేంద్రప్రభుత్వం పెట్టిందా అన్న ప్రశ్నకు ఏమీ సమాధానం ఇవ్వలేదు. ‘‘నగరంలోని పై మూడు కంపెనీల డీలర్లంతా ఇలాంటి నిబంధనను అమలుచేస్తున్నారు’’ అని కృష్ణవేణి తెలిపారు.

