
వేటగాళ్ల ఇంటిని గుర్తించిన అటవీశాఖ జాగిలం ‘హంటర్’
కొత్త సంవత్సరం,సంక్రాంతి వేళ వన్యప్రాణుల వేట విజృంభణ
వేటగాళ్ల ఆట కట్టించిన అటవీ జాగిలం హంటర్
కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగల వేళ తెలంగాణ అడవుల్లో వన్యప్రాణుల వేట పెచ్చుమీరింది. జింకలు, సాంబార్లు, దుప్పులు లక్ష్యంగా వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తుండగా… అటవీశాఖ జాగిలం సహాయంతో పలుచోట్ల వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకుంటున్నారు.అడవులు, వన్యప్రాణులు సంరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ… తెలంగాణలోని పలు జిల్లాల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగల వేళ ఈ వేట మరింత పెరిగి, అటవీశాఖకు సవాలుగా మారింది.
- అడవిలో చిందిన రక్తపు వాసనే వేటగాళ్లకు సంకెళ్లు వేసేందుకు ఉపయోగపడింది. కొత్త సంవత్సరం వేళ వన్యప్రాణుల వేటకు పాల్పడిన వారిని అటవీశాఖ జాగిలం ‘హంటర్’ పట్టుకొని అడవుల్లో జరుగుతున్న అక్రమ వేటను వెలుగులోకి తీసుకొచ్చింది.
వరుసగా వన్యప్రాణుల వేట ఘటనలు....
2026 జనవరి 6 : కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అటవీ గ్రామాల్లో వన్యప్రాణుల వేట ఘటనలు పెచ్చు పెరిగాయి. మంచిర్యాల జిల్లా లక్కెట్టిపేట పరిధిలోని చల్లంపేట బీట్ లోని అడవిలో సాంబారును వేటగాళ్లు వేటాడారు. సాంబారును చంపి దాని మాంసాన్ని వేటగాళ్లు ఇంటికి తీసుకు వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ జాగిలం హంటర్ సాంబారు రక్తం వాసన చూసి నేరుగా వేటగాళ్లను పట్టించింది. సాంబారును చంపిన ఏడుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకొని వారిపై వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.
2026, జనవరి 4 : మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ రేంజి పరిధిలోని అడవిలో మచ్చల జింకను వేటగాళ్లు చంపారు. దీంతో రంగంలోకి దిగి అటవీ శాఖ జాగిలం ఏడుగురు వేటగాళ్లను పట్టించింది. అటవీగ్రామాల్లో కందికాయలు తినేందుకు వచ్చిన జింకలను వేటగాళ్లు ఉచ్చులు బిగించి వేటాడుతున్నారు.
2026, జనవరి 5 : చెన్నూరు రేంజిలోని కిష్టంపేట భావరావుపేట అటవీ గ్రామంలో జింకను నలుగురు వేటగాళ్లు చంపారు. జింక రక్తం వాసన చూసిన హంటర్ వేటగాళ్లు అయిన ఉప్పరి చిన రాజన్నతోపాటు నలుగురిని పట్టించింది. వేటగాళ్ల నుంచి జింకను కోసేందుకు వినియోగించిన కత్తి, బరిసెను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2026 జనవరి 9 : ఖమ్మం జిల్లా తల్లాడ అటవీ రేంజ్ కల్లూరు మండలంలో లక్ష్మీపురం బీట్ అడవుల్లో పంగిడి చెరువు వద్ద వన్యప్రాణులను వేటాడేందుకు సర్వీసు వైర్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులను తాము తొలగించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమా చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు.
2025,నవంబరు 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వేటగాళ్లు దుప్పిని వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
2025,నవంబరు 26 : జగిత్యాల జిల్లా రాయికల్ రేంజ్ పరిధిలోని బోర్నపల్లి సౌత్ బీట్ లోని చింతలూరు సెక్షన్ లో కలప స్మగ్లర్లు నాలుగు టేకు చెట్లను అక్రమంగా నరికారు. టేకు కలపను స్మగ్లర్లు అడవి నుంచి తరలించారు. దీంతో జన్నారం అటవీశాఖ జాగిలమైన హంటరును అటవీశాఖ అధికారులు రంగంలోకి దించారు. అడవిలో చెట్లు నరికిన ప్రాంతంలో స్మగ్లర్ల టోపీని హంటర్ వాసన చూసి బోర్నపల్లి గ్రామంలోని కలప స్మగ్లర్లు జంగిలి గంగారం, మోడీ ఆంజనేయులును పట్టించింది. రూ.90వేల విలువైన టేకు కలపను నరికారని కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశామని రాయికల్ రేంజ్ అధికారి టి భూమేష్ చెప్పారు.
యథేచ్ఛగా వన్యప్రాణుల వేట
వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళ బ్యాటరీ లైట్లతో కుందేళ్లను వేటాడుతున్నారు. భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, పాల్వంచ, ఇల్లెందు, ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, బూర్గంపాడు అడవుల్లో వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. దమ్మపేటలో దుప్పిని వేటాడిన నలుగురు వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టారు. పాల్వంచ మండలం సోముల గూడెంలో దుప్పిని వేటాడిని ఇద్దరిని అరెస్టు చేశారు. ములకలపల్లి మండలం రామాంజనేయపురంలో విద్యుత్ వైర్లతో అడవి పందిని చంపారు.
వరంగల్ జిల్లాలో ఆగని వేట
వరంగల్ జిల్లాలోని అడవుల్లో విద్యుత్ వైర్లు, ఉచ్చులు అమర్చి వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతుంది. కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం అటవీ ప్రాంతాల్లో పెరిగిన వన్యప్రాణులు అటవీ గ్రామాల్లోకి వస్తుండటంతో వేటగాళ్లు వాటిని చంపేస్తున్నారు. గంగారం మండలం బావురుగొండ ప్రాంతంలో ఇటీవల 11 కేవీ విద్యుత్ తీగలను వన్యప్రాణుల వేట కోసం అమర్చారు. కొత్తగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ముగ్గురు స్మగ్లర్లు వన్యప్రాణులను వేటాడిన కేసులో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
పండుగల వేళ వన్యప్రాణుల వేట పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ గస్తీని మరింత కఠినతరం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం–1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా గ్రామస్థుల సహకారం లేకపోతే వేటను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని అటవీశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వన్యప్రాణుల వేట కేవలం చట్టవిరుద్ధమే కాదు… ప్రకృతికి తీరని నష్టం. ఉచ్చులు, విద్యుత్ వైర్లతో జరిగే వేటను అరికట్టాలంటే అటవీశాఖతో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
Next Story

