ఈసీ తీరులో మార్పు.. పోలింగ్ శాతం కాకుండా..
x

ఈసీ తీరులో మార్పు.. పోలింగ్ శాతం కాకుండా..

ఎన్నికల సంఘం తీరులో మార్పు వచ్చింది. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పోలైన ఓట్ల సమాచారన్ని శాతాల్లో ప్రకటించే సంప్రదాయానికి ఈసీ టాటా చెప్పేసింది.


ఎన్నికల సంఘం తీరులో మార్పు వచ్చింది. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పోలైన ఓట్ల సమాచారన్ని శాతాల్లో ప్రకటించే సంప్రదాయానికి ఈసీ టాటా చెప్పేసింది. ఓట్లు ఎన్ని పోల్ అయ్యాయన్న సమాచారాన్ని పక్కాగా అంకెల్లో చెప్పాలని, పర్సంటేజీలలో ఎందుకు చెప్తున్నారని ఒక ఎన్‌జీఓ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సమయంలో ఈసీ పారదర్శకంగా పనిచేయడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు గుప్పించాయి. అయినప్పటికీ ఆ విషయంలో తాము ఎన్నికల సంఘానికి ఎటువంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు ఇవ్వలేమని సుప్రీకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈసీ చర్యల్లో మార్పులు వచ్చాయి. ఈరోజు సార్వత్రిక ఎన్నికల ఐదో దఫా పోలింగ్ పూర్తయింది.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఎప్పటిలా పోలైన ఓట్లకు సంబంధించి పర్సంటేజీలను ప్రకటించలేదు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఓట్లు వేశారు అన్న విషయాన్ని అంకెలతో సహా ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి ఒక పద్దతిని పాటించడం జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరు ఎన్ని అబద్దాలు చెప్పినా సరే.. ఒక్కసారి పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం సాధ్యం కాదు’’ అని ఎన్నికల సంఘం అధికారులు వ్యాఖ్యానించారు.

‘‘ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని సంపూర్ణ ఓటర్ల సంఖ్యను కూడా మా రిపోర్ట్‌లో చేర్చేలా డేటా ఫార్మాట్‌ను విస్తరించాలని నిర్ణయించుకున్నాం’’ ఎన్నికల సంఘం వివరించింది. మొత్తం ఓటర్లకు పోలింగ్ శాతాన్ని వర్పింపజేయడం ద్వారా పౌరులందరికీ నియోజకవర్గాల వారీగా సంపూర్ణ సంఖ్యలు గుర్తించబడతాయని తెలిపింది. ఈ రెండు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఈసీ వివరించారు. ప్రతి దశలో కూడా వాస్తవ ఓటర్ల సంఖ్యను బహిర్గతం చేయాలని అనేక మంది నుంచి డిమాండ్‌లు చేశారని, అందుకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు.

అసలేంటి వివాదం

ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలు ఎన్నికున్న పార్టీని అధికారంలోకి తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఈసీది. కానీ ఇప్పుడు ఆ ఈసీనే కోర్టు ముందు వివరణ ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది. అందుకు ఈసీ ప్రకటించిన పోలింగ్ పర్సంటేజ్‌లే కారణం. గతంలో ఎప్పుడు పోలింగ్ జరిగినా పోలింగ్ పూర్తయిన తర్వాత 48 గంటల లోపు ఎన్నికల సంఘం ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి అనే సమచారాన్ని ప్రకటిస్తుంది. తద్వారా కౌంటింగ్ సమయంలో అన్ని ఓట్లే లెక్క వేశామా లేదంటే అందులో ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యాయా అని సరిచూసుకుంటుంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఎప్పుడూ లేని విధంగా కాస్తంత విచిత్రంగా ప్రవర్తించింది. ఏడు దఫాల్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దఫాలు పూర్తయ్యాయి.

వీటిలో తొలి దఫా నుంచి కూడా పోలింగ్ పర్సంటేజ్‌ను ప్రకటిస్తూ వస్తున్న ఎన్నికల సంఘం. ప్రకటన చేసిన ఒక వారం రోజులకల్లా అప్‌డేటెడ్ పర్సంటేజ్‌ను ప్రకటించనున్నామని, తమకు అదనపు సమాచారం అందిందంటూ ఆ నెంబర్లలో పెరుగుదలను చూపిస్తూ వచ్చింది. ఇది ఇప్పటివరకు జరిగిన నాలుగు దఫాలకు జరిగింది. ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి త్వరలో వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. తొలిదఫాలో మొదట 60శాతం ఓటింగ్ జరిగిందని, రెండో దఫాలో 60.9శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పదకొండు రోజుల తర్వాత విచిత్రంగా ఈ పర్సంటేజ్‌లను అప్‌డేట్ చేస్తున్నామంటూ చెప్తూ.. తొలి దఫాలో 66.14 శాతం అంటే 6శాతం ఎక్కువ, రెండో దఫాలో 66.71 శాతం అంటే 6.1శాతం ఎక్కువగా ప్రకటించింది. మిగిలిన మూడు, నాలుగు దఫాల్లో కూడా ఇలానే జరిగింది. ఈ క్రమంలోనే ఈసీ పాదర్శకంగా లేదంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఓ బహిరంగ లేఖ రాశారు. అదే విధంగా ఈసీ.. ఓటింగ్ పర్సంటేజ్ కాకుండా ఓటర్ల సంఖ్యను వెల్లడించేలా ఆదేశాలివ్వాలంటూ ఓ ఎన్‌జీఓ.. సుప్రీంకోర్టును కోరింది.

Read More
Next Story