
ఈసీ కీలక నిర్ణయం.. ఓటర్-ఆధార్ అనుసంధానం..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని పలు సెక్షన్లు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అనుసంధానం చేయాలని డిసైడ్ అయ్యారు.
భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ తొలుత వినిపించేవి విమర్శలే. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ఈవీఎంలను హ్యాక్ చేశారని, ఇలా మరెన్నో విమర్శలు, ఆరోపణలు వినిపిస్తుంటాయి. వీటితో ఎన్నికల సంఘం కూడా విసుగెత్తినట్లు ఉంది. అందుకే ఓటర్ల సంఖ్యపై వస్తున్న ఆరోపణలను చెక్ పెట్టాలని, భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా చూడాలని నిశ్చయించుకుంది. అందులో భాగంగానే ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ అనుసంధానం దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాజ్యంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిద్య చట్టం-1950, సుప్రీంకోర్టుు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధానం జరపనున్నట్లు తెలిపింది ఈసీ. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య అతిత్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞనేష్ కుమార్, కమిషనర్ల సుఖ్‌బిర్ సింగ్ సందు, వివేక్ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూడీఏఐతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ ప్రకటనలో చెప్పిన రాజ్యాంగంలోని ఆర్టికల్-326 ప్రకారం భారత పౌరులు ఓటు హక్కును పొందుతారు. ఈ ఆర్టికల్ ప్రకారమే.. 18ఏళ్లు నిండిన భారతీయ పౌరులు ఓటు వేయడానికి అర్హులుగా గుర్తిస్తూ వారికి ఓటర్ కార్డును భారతదేశ జాతీయ ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. అదే విధంగా ఆధార్ అనేది.. భారతీయ పౌరులుగా ఇచ్చే గుర్తింపు కార్డు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ అనధికారికంగా నివసించే వారికి ఆధార్ కార్డును జారీ చేయరు. ఈ రెండింటిని అనుసంధానం చేయడం ద్వారా ఓటర్ కార్డుల్లో ఉన్న నకిలీ ఓటర్లను గుర్తించడం సులభతరం కావడమే కాకుండా, రానున్న కాలంలో నకిలీ కార్డులు పుట్టుకురాకుండా నియంత్రిస్తుందని ఈసీ భావిస్తోంది.
అందుకే ఈ రెండు కార్డులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబందనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో మరిన్ని అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇప్పటికే ఆధార్, ఓటర్ కార్డులు పొందిన అనధికారిక వలసదారులను గుర్తించి, వారిని ఇచ్చిన కార్డులను తొలగించాలా? వద్దా? అన్న అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.