పోలింగ్ డేటాపై ఖర్గే ఆరోపణలకు ఖండించిన ఈసీ
ఈసీ విడుదల చేసిన పోలింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు ఇటీవల లేఖ రాశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు ఇటీవల లేఖ రాశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు గళమెత్తాలని లేఖలో ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘంపై విశ్వసనీయత తగ్గుతోందని, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా పరిగణించింది.
‘‘పోలింగ్ డేటాపై కాంగ్రెస్ బాధ్యతారహిత ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఓటర్లలో అయోమయం నెలకొని, సజావుగా సాగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఈ ఆరోపణలన్నీ అపోహలే. ఓటింగ్ డేటా సేకరణ, పోలింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి లోపాలు జరగలేదు’’ అని ఎన్నికల సంఘం వెల్లడించింది.
పోలింగ్ డేటా వెల్లడిలో ఎలాంటి ఆలస్యం జరగలేదని పేర్కొంది. పోలింగ్ రోజున చెప్పిన దానికంటే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన డేటా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. గత ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేసింది. ఇలాంటి దురుద్దేశ ఆరోపణలతో ప్రజలు, రాజకీయ పార్టీల్లో అనేక సందేహాలు నెలకొంటాయని, అది దారుణమైన పరిస్థితికి దారితీస్తుందని తెలిపింది.