ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులతో పాటు బెంగాల్ డీజీపీపై వేటు వేసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులతో పాటు పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శలను కూడా తొలగించింది. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని (డీజీపీ) తొలగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు తీసుకుందని ఈసీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌తో పాటు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా మూడేళ్లు పూర్తి చేసుకున్న, సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
Next Story