
ఊర్లలో వసతుల కోసం ఆస్తిపన్నులు పెంచాల్సిందే...
ఇంటిపన్నులు పెంచటం, వ్యవసాయంపై పన్ను వేయటం ద్వారా రాష్ట్రాలు ఆదాయం పెంచుకోవచ్చని అహ్లువాలియా సూచించారు
నియంత్రణ లేకుండా కేంద్రం వసూలు చేస్తున్న సెస్సుల మీద 16వ ఆర్థిక సంఘం దృష్టి పెట్టాల్సి ఉండిందని, అలాగే కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో ఉన్న అంశాల పంపిణీని మళ్లీ సమీక్షించాల్సి ఉండిందని ఆర్థిక శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు డా. మాంటెక్ సింగ్ అహ్లువాలియా అన్నారు.
16వ ఆర్థిక సంఘం నివేదిక సిఫార్సుల మీద నిన్న హైదరాబాద్ లో సెస్ (CESS) ఏర్పాటు చేసి ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. 16వ ఆర్థిక సంఘం తనకు విధించిన పరిధిలోనే పనిచేసినట్టు కనిపిస్తోందని చెబుతూ రాజ్యాంగం ప్రకారం కేంద్ర–రాష్ట్రాల మధ్య కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పంపిణీపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రమే సంఘంపై ఉందని, కానీ అవసరమైతే దాని పరిధిని దాటి సూచనలు చేయవచ్చని ఆయన అన్నారు.
“కేంద్రం సెస్సులు విధించడం ద్వారా సమకూరిన ఆదాయాన్ని తన దగ్గరే ఉంచుకుంటోంది. పరస్పర సహకారం మన సమాఖ్య విధానం కావాలి, ఘర్షణ కాదు. సమాఖ్యలో సహకారం, పోటీ రెండు ఉండొచ్చు. అయితే ఆ ఘర్షణను ఎలా తగ్గించాలనేదే ఒక సవాలే,” అని అహ్లూవాలియా వ్యాఖ్యానించారు.
సమాఖ్య జాబితాలో ఉన్న అంశాల సంఖ్య తగ్గాలని చెబుతూ రాష్ట్ర జాబితాలోని కొన్ని అంశాలను సమాఖ్య జాబితాకు మార్చడంతో కేంద్రానికి జోక్యం చేసుకునే అవకాశం కలిగిందని ఆయన అన్నారు. అయితే, దీని వల్ల విద్య వంటి రంగాలకు అదనపు నిధులు అందుతాయని ద సమర్థిస్తూనే ఆ నిధులు వస్తాయనే భరోసా లేదని కూడా ఆయన చెప్పారు. కేంద్రం విద్యను తన లక్ష్యాలకు అనుగుణంగా అందించాలనుకుంటే, తన ఆర్థిక సహాయాన్ని పెంచి వాటిని అటు వైపు నెట్టచ్చుఅని అన్నారు.
చిన్న రాష్ట్రాల అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 25 కోట్ల జనాభా ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో జనాభా మరీ తక్కువగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. పెద్ద రాష్ట్రాల్లో వద్ద అధికార కేంద్రీకరణ మంచిది కాదని, అది కూటమి ప్రభుత్వం అయినా అనర్థకమేనన్నారు.
దేశ జిడిపిలో రాష్ట్రాల వాటాను పరిగణలోకి తీసుకుని దానికి మరో 10 శాతం ప్రాధాన్యాన్ని ఇవ్వటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరుగుతోందని విస్తృతంగా ఉన్న భావనను ఆర్థిక సంఘం పరిగణన లోకి తీసుకున్నట్టయ్యింది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతం తగ్గి నందు వలన దాని ప్రభావం నిధుల పంపిణీలో పై పడకుండా చూడడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలు వాటి చేతిలో ఉన్న పన్నులను విధించే అధికారాలను సరైన విధంగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఆస్తి పన్ను విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. నగర స్థానిక సంస్థలు ఆర్థికంగా బలహీనంగా ఉండటంవలన అవి మౌలిక వసతులు కల్పించడంలో వెనుకబడుతున్నాయి. వ్యవసాయంపై పన్ను విధించడం రాష్ట్రాలు తమ స్వంత ఆదాయాన్ని పెంచుకోవచ్చు. దాన్ని కేంద్రంతో పంచుకోవాల్సిన అవసరం లేదు.
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లపై పన్నులు పెంచాలని ఆయన సూచించారు. ఆస్తి విలువలో 1/100 వంతు మాత్రమే పన్నుగా వసూలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సరిపడ నిధులు లేకుండా నగర సంస్థలు మెరుగైన మౌలిక వసతులు ఎలా అందిస్తాయని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లపై పన్నులు పెంచాలని ఆయన సూచించారు. సరిపడ నిధులు లేకుండా నగర సంస్థలు మెరుగైన మౌలిక వసతులు ఎలా అందిస్తాయని ప్రశ్నించారు. కేంద్రం పెత్తనం చేస్తోందని రాష్ట్రాలు విమర్శిస్తున్నప్పటికీ, స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, తమ ప్రజాదరణ కోల్పోతామనే భయంతో అలా చేస్తున్నారని అహ్లూవాలియా అన్నారు. ఈ విషయాలపై ఆర్థిక సంఘం ఏ వైఖరి తీసుకోవాల్సిన పని లేదు. ఏకాభిప్రాయం ఎలా సాధించాలన్నదే ముఖ్యమని చెప్పారు.
హైదరాబాద్‌లో సెస్ చేపట్టిన చర్చ స్వాగతించిన ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డి. సుబ్బారావు మాట్లాడుతూ, చర్చలు ఢిల్లీ, ముంబై కేంద్రంగా ఉన్నాయన్నారు. చర్చ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరగాలి. దేశ సమాఖ్య వ్యవస్థ అసాధారణ స్థిరత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రాధాన్యానికి తగిన గుర్తింపు రాలేదన్నారు. విశ్లేషకులు 4.4 శాతం ఆర్థిక లోటుపై మాత్రమే దృష్టి పెడుతున్నారని, దానితో పాటు కేంద్ర ఆర్థిక వ్యవహారాల నిర్వహణ సరిగ్గా ఉండటం అంతే ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.
పన్నుల విషయానికి వస్తే, రాష్ట్రాలు దేశ ఆర్థిక వనరులుగా కేంద్రంగా మారుతున్నాయన్నారు. రాష్ట్రాలు చేసే ఖర్చులు తగిన ప్రమాణాలతో జరగాలని అన్నారు. కేంద్ర–రాష్ట్రాల మొత్తం ఆదాయంలో 60 శాతాన్ని వసూలు చేసినా 40 శాతం మాత్రమే తన వద్ద ఉంచుకోగలదు.
భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్య ” గా పేర్కొంటూ, ఇది బలమైన సమాఖ్య కు నమూనా అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలే ప్రస్తుతం ప్రధానంగా నిధులు ఖర్చు చేస్తున్నాయని అవే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నాయని అన్నారు. ఖర్చులు పెట్టడంలో స్వేచ్ఛ, రుణాలు, వనరుల సమీకరణలో కేంద్ర–రాష్ట్రాల మధ్య పెరుగుతున్న విభేదాలను తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. 16వ ఆర్థిక సంఘాన్ని రాజ్యాంగ పరిమితుల్లోనే మాత్రమే పనిచేసిందని అన్నారు. అయితే రాష్ట్రాలకు నిధులు ఇవ్వటంలో జీడీపీ పెరుగుదలలో వాటి వాటాను పరిగణనలోకి తీసుకోవడంలో సారికొత్త ఆలోచన చేసిందన్నారు.
సభకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు అధ్యక్షత వహించారు. తన ప్రసంగంలో ఆర్థిక సంఘం నివేదిక ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్‌కు బయట రుణాలు, రాష్ట్రాల్లో పెరుగుతున్న సబ్సిడీల భారంపై కీలక ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. రాష్ట్రాలపై పెరుగుతున్న సబ్సిడీ భారాన్ని, బడ్జెట్ లో చూపకుండా అవి చేస్తున్న అప్పులను పరిగణనలోకి తీసుకుంటారన్నారు.
రాష్ట్రాలు, రంగాల వారీగా ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లను తొలగించడం, సూత్రాల ఆధారంగా నిధుల పంపిణీ చేయడం స్వాగతించదగిన విషయమని అన్నారు. సూత్రాల ప్రకారం పంపిణీ జరిగితే, కేంద్రం ఆదాయం పెరిగితే రాష్ట్రాలకు కూడా ఎక్కువ వాటా దక్కుతుందని చెప్పారు. అయితే విపత్తు సహాయం, స్థానిక సంస్థల గ్రాంట్లు మాత్రం సూత్రం ఆధారంగా ఇచ్చే వనరులు కావని పేర్కొన్నారు.
16వ ఆర్థిక సంఘం తన నివేదిక సమర్పించిన తర్వాత ఈ చర్చ ప్రాముఖ్యత ఏమిటని అడగగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని చర్యల నివేదికలను పూర్తిగా అమలు చేశామని చెప్పలేదని అన్నారు. కొత్త ఆర్థిక సంఘం ఏర్పడినప్పుడు ఈ చర్చ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

