విచారణకు రావాలని ఆప్ హోం మంత్రికి ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోట్‌ను ఈడీ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానం వున్న వ్యక్తులందరికీ సమన్లు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరుతోంది. ఈ క్రమంలోనే కేసుతో సంబంధాన్ని ముడిపెడుతూ విచారణకు హాజరు కావాలని ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోట్‌ను ఈడీ కోరింది.
నజాఫ్‌గఢ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అయిన గహ్లోట్ ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహిస్తున్నారు.
2021-22 మద్యపాన పాలసీ రూపకల్పనలో పాలుపంచుకున్న మంత్రుల బృందంలో ఈయన కూడా ఉన్నందున గహ్లోట్‌ను ఈడీ ప్రశ్నించాలని భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు గహ్లాట్‌ను కోరినట్లు సమాచారం.
గతంలో ఈడీ తన ఛార్జిషీట్‌లో గహ్లోట్ పేరును ప్రస్తావించింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టయిన ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌తో గహ్లెట్‌కు సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
కాగా ఈ కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు పదేపదే తాము ఏ తప్పు చేయలేదని ఖండిస్తున్నారు. ఆప్ అవినీతి పార్టీ అనే ముద్ర వేయడానికి మోదీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో ఆప్ నేతలు మాజీ మంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌లను ఈడీ గతంలో అరెస్టు చేయగా వారిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
వాస్తవానికి ఈ కేసుతో సంబంధం ఉన్న మద్యం డీలర్లు ఇప్పుడు రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారతీయ జనతా పార్టీకి డబ్బు చెల్లించారని ఆప్ ఆరోపిస్తోంది.