సైబర్ ఉచ్చులో విద్యావంతులు… తెలంగాణలో వరుస మోసాలు
x

సైబర్ ఉచ్చులో విద్యావంతులు… తెలంగాణలో వరుస మోసాలు

వరంగల్, హైదరాబాద్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో మోసాలకు గురైన పలువురు కీలక వివరాలు బయటకు వచ్చాయి.


తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు హద్దుమీరిపోతున్నాయి. సైబర్ మోసానికి సంబంధించి రోజుకు ఒక కేసు కనిపిస్తోంది. అందులోనూ ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నవారిలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఈ ట్రెండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా వరంగల్‌లో నిట్ మాజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ సైబర్ ఉచ్చులో పడి రూ.కోటి పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ రిటర్న్‌తో కాసుల వర్షం కురుస్తుందన్నట్లు సైబర్ మోసగాడు నమ్మబలికి మోసం చేశాడు.

బాధితుడు సుధాకర్.. జనవరి 2026లో వరంగల్‌లో మాజీ ప్రొఫెసర్ సుధాకర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసపోయారు. గూగుల్‌లో వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయిన నేరగాళ్లు వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి నమ్మకం కల్పించారు. కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌గా పరిచయం చేసిన వ్యక్తిని విశ్వసించి జనవరి నుంచి మార్చి మధ్య విడతల వారీగా మొత్తం రూ.1 కోటి ట్రాన్స్‌ఫర్ చేశారు. మార్చి చివర్లో మోసం గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 2026లో హైదరాబాద్‌లో రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసపోయిన ఘటన నమోదైంది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి నేరగాళ్లు పలుమార్లు డబ్బులు జమ చేయించుకున్నారు. చివరకు భారీ మొత్తం కోల్పోయినట్లు తెలిసింది. మార్చి 2026లో ఐటీ రంగానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మోసంలో చిక్కుకున్నారు. ఫేక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లాభాలు చూపించి నమ్మించిన నేరగాళ్లు లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.

ఇంకో ఘటనలో జనవరి చివరిలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన వ్యక్తి ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రారంభంలో చిన్న లాభాలు చూపించి, తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టినట్లు వెల్లడించారు. ఈ కేసులన్నింటిలో ఒకే విధానం కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదట పరిచయం, తర్వాత నమ్మకం, ఆపై చిన్న లాభాల ప్రదర్శన, చివరికి భారీ మోసం.

పోలీసుల వివరాల ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై అవగాహన ఉన్నవారినే నేరగాళ్లు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టో రంగాలపై ఆసక్తిని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అపరిచిత లింకులు, వాట్సాప్ గ్రూపులు, అధిక లాభాల హామీలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడులకు ముందు అధికారిక వనరులను పరిశీలించడం అవసరమని పేర్కొన్నారు.

Read More
Next Story