‘రాజ్యాంగాన్ని పరిరక్షించే యుద్ధమే ఎన్నికలు’
x

‘రాజ్యాంగాన్ని పరిరక్షించే యుద్ధమే ఎన్నికలు’

‘భారతదేశ రాజ్యాంగాన్ని కాలరాయడానికి బీజేపీ పన్నాగాలు పన్నుతోంది’ కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచే చేస్తున్న ఆరోపణ ఇది. తాజాగా ఇటువంటి ఆరోపణే రాహుల్ గాంధీ చేశారు.


‘భారతదేశ రాజ్యాంగాన్ని కాలరాయడానికి బీజేపీ పన్నాగాలు పన్నుతోంది’ కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచే చేస్తున్న ఆరోపణ ఇది. తాజాగా ఇటువంటి ఆరోపణే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా చేశారు. ‘‘మన రాజ్యాంగాన్ని చించి చెత్తబుట్టలో పడేయడానికి బీజేపీ సరైన అదునుకోసం రాత్రింబవళ్లు ఎదురుచూస్తోంది’’ అని ఢిల్లీలోని దిల్‌షద్ గార్డెన్‌ పార్టీ నేత కన్హయ్య కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికలను మన దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించే కీలకమైన యుద్ధంగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని మార్చడం, తమకు అనువుగా చేసుకోవడం అనేది బీజేపీ చిరకాల కోరిక అని ఆయన విమర్శలు గుప్పించారు. అది జరగకూడదంటే ఇండియా కూటమి గెలిపించాలని, ఢిల్లీ నార్త్‌ఈస్ట్‌లో కన్హయ్యను గెలిపించాలని రాహుల్ కోరారు.

ఎట్టకేలకు ఒప్పుకున్న బీజేపీ

‘‘బీజేపీ వాళ్లు ఎప్పుడూ మన రాజ్యాంగాన్ని చింపేయాలి, పక్కన పడేయాలనే కోరుకున్నారు. వాళ్లు భారతదేశ రాజ్యాంగాన్ని కానీ, జాతీయ జెండాను కానీ ఎన్నడూ అంగీకరించలేదు. ఈ ఎన్నికల రణరంగంలో ఎట్టకేలకు వాళ్లు తమ అసలు ఉద్దేశాన్ని బహిర్గతం చేశారు. దేశ రాజ్యాంగాన్ని, పతాకాన్ని మారుస్తామని ఒప్పుకున్నారు. ఈ ఎన్నికలు ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి చేస్తున్న యుద్ధం. రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. మన రాజ్యాంగం.. గాంధీ, అంబేద్కర్, నెహ్రూల వేల సంవత్సరాల సిద్ధాంతాల వారసత్వ సమాహారం’’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదని, ఒకవేళ వాళ్లు అందుకు ప్రయత్నం చేస్తే బీజేపీ.. దేశంలోని కోట్ల మంది ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటై హెచ్చరించారు.

ఈసీ వార్నింగ్

రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేయాలని, మార్చాలని ప్రయత్నిస్తుందంటూ కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శలు, ఆరోపణలు చేయడంపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ఎక్కడా కూడా రాజ్యంగాన్ని అమ్మేయడానికి, ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అసత్య ప్రచారం చేసేలా ప్రసంగాలు, స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదు. వారిని కట్టడి చేసే బాధ్యత పూర్తిగా పార్టీపైనే ఉంటుంది’’ అని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈరోజుతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మే 25న అక్కడ పోలింగ్ జరగనుంది.

Read More
Next Story