ఏనుగు దంతాల బ్లాక్ మార్కెట్..!
x

ఏనుగు దంతాల బ్లాక్ మార్కెట్..!

17 కిలోల Ivoryతో బయటపడిన లింక్ ఏంటి?


1) ఏనుగు దంతాల బ్లాక్ మార్కెట్..! 17 కిలోల Ivoryతో బయటపడిన లింక్ ఏంటి?

2) రూ.8,500కే నెలంతా RTC + మెట్రో ప్రయాణం!

1) ఏనుగు దంతాల బ్లాక్ మార్కెట్..! 17 కిలోల Ivoryతో బయటపడిన లింక్ ఏంటి?

ఒక ఏనుగు ప్రాణం పోతే, దాని దంతాలకు మాత్రం కోట్ల విలువ వస్తుందా..? అసలు ఏనుగు దంతాల వెనుక ఎంత పెద్ద అక్రమ మార్కెట్ ఉంది..? ఇప్పుడు హైదరాబాద్‌లో డీఆర్‌ఐ పట్టుకున్న 17 కిలోల దంతాలు చెబుతున్న కథ ఏంటి..?

జూబ్లీహిల్స్‌లో ఏనుగు దంతాల విక్రయానికి డీల్ జరుగుతోంది.. సరిగ్గా అదే సమయంలో Directorate of Revenue Intelligence. (డీఆర్‌ఐ) అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు ఏనుగు దంతాలు.. మొత్తం సుమారు 17 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. దంతాలతో తయారు చేసిన చెక్కిన ఐవరీ వస్తువులు, ట్రోఫీలు కూడా పట్టుబడ్డాయి. అంటే ఇది కేవలం దంతాల అమ్మకం మాత్రమే కాదు.. ఏనుగు శరీర భాగాలను విలువైన వస్తువులుగా మార్చి అమ్మే అక్రమ మార్కెట్‌కు సంబంధించిన వ్యవహారం.

ఈ దంతాలు హైదరాబాద్‌కు ఎక్కడి నుంచి వచ్చాయి..? వీటి వెనుక ఇంకా ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉంది..? డీఆర్‌ఐ ఇప్పుడు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తోంది. దంతాల మూలం ఏంటి? ఎక్కడ ఏనుగులను వేటాడారు? ఎవరు సేకరించారు? ఎవరి ద్వారా హైదరాబాద్‌కు చేరాయి? ఎవరికి అమ్మాలని చూశారు? అన్నదే కీలకం.

ప్రపంచవ్యాప్తంగా అక్రమ వన్యప్రాణుల వ్యాపారం చిన్నపాటి బిజినెస్ కాదు. UNODC అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ వన్యప్రాణుల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి సుమారు 7 నుంచి 23 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని గత అధ్యయనాలు అంచనా వేశాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు లక్షల కోట్ల రూపాయల స్థాయి.ఇది ఏనుగు దంతాల వ్యాపారం మాత్రమే కాదు..ఏనుగు దంతాలు, పులి, చిరుత చర్మాలు, పాంగోలిన్ పొలుసులు, అరుదైన పక్షులు, సరీసృపాలు, అడవి జంతువుల అవయవాలు. వాటితో తయారు చేసిన ట్రోఫీలు, అలంకరణ వస్తువులు.

ఇలా భారీ అక్రమ మార్కెట్ నడుస్తోంది. UNODC 2024 నివేదిక ప్రకారం.. 2015 నుంచి 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా నమోదైన స్వాధీనం కేసుల్లోనే సుమారు 4,000 జాతులకు చెందిన వన్యప్రాణులు, వృక్షజాతులు కనిపించాయి. నమోదైన సీజ్‌ల పరిమాణం 13 మిలియన్ వస్తువులు, 16 వేల టన్నులకు పైగా ఉంది. అయితే ఇవి పట్టుబడిన కేసులు మాత్రమే.. అసలు అక్రమ రవాణా పరిమాణం దీనికంటే ఎక్కువగా ఉండొచ్చని United Nations Office on Drugs and Crime. (UNODC) చెబుతోంది.

భారత్‌లో ఏనుగు దంతాల వాణిజ్యానికి చట్టబద్ధమైన సాధారణ మార్కెట్ లేదు. ఏనుగు Schedule-I రక్షిత జంతువు. ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన వస్తువుల అక్రమ వ్యాపారం నిషేధితం. అంతర్జాతీయంగా కూడా భారతదేశం ivory trade‌ను నిషేధించే విధానాన్ని అనుసరిస్తోంది. అంటే, హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఈ 17 కిలోల దంతాలకు అసలు మార్కెట్ “లీగల్ మార్కెట్” కాదు.. బ్లాక్ మార్కెట్.

2026 జూలైలోనే దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ నిర్వహించిన పలు ఆపరేషన్లలో సుమారు 15 కిలోల ivory articles, elephant ivoryతో పాటు 440కు పైగా రక్షిత/అంతరించిపోతున్న వన్యప్రాణులు స్వాధీనం చేసుకుని 33 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అదే ఏడాది ఆగస్టులో లక్నోలో మరో ఆపరేషన్‌లో 54 ivory artefacts కూడా డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. అంటే, హైదరాబాద్ ఘటన ఒక్కటే కాదు. దేశవ్యాప్తంగా ఒక నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దృష్టి పెడుతున్నాయి.

తెలంగాణలో కూడా ఇలాంటి కేసులు గతంలో నమోదయ్యాయి. 2022లో హైదరాబాద్‌లో WCCB, తెలంగాణ అటవీశాఖ సంయుక్త ఆపరేషన్‌లో 26 ivory artefacts స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన రికార్డు ఉంది.

17 కిలోల దంతాలు ఎవరి కోసం? ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే, హైదరాబాద్‌లో పట్టుబడిన ఈ 17 కిలోల దంతాలు ఒక చిన్న డీల్ కాదు. వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌కు ఒక కీలక లింక్‌గా మారే అవకాశం.

ఒక్క ఏనుగు దంతాల దగ్గర మొదలైన కథ కాదు ఇది.. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం అంటే.. జంతువుల్ని చంపడం మాత్రమే కాదు.. వాటి శరీరంలోని ప్రతి భాగానికీ మార్కెట్‌లో డిమాండ్ ఉంది! ఏనుగు విషయానికొస్తే.. దంతాలు, వాటితో తయారు చేసే ఐవరీ వస్తువులకు డిమాండ్ ఉంటుంది. అలంకరణ వస్తువుల నుంచి విలాసవంతమైన డెకార్‌ వరకు.. ఐవరీకి అక్రమ మార్కెట్ ఉంది.

ఇక ఖడ్గమృగం.. దాని కొమ్ము కోసం వేట జరుగుతోంది. కొన్ని సంప్రదాయ ఔషధాలపై ఉన్న నమ్మకాలు, స్టేటస్ సింబల్‌గా భావించే డిమాండ్.. అక్రమ వ్యాపారానికి కారణమవుతున్నాయి. పాంగోలిన్‌ విషయానికొస్తే.. దాని శరీరంపై ఉండే స్కేల్స్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. సంప్రదాయ ఔషధాల కోసం వీటిని అక్రమంగా తరలిస్తున్న కేసులు నమోదవుతున్నాయి. పులి విషయానికొస్తే.. ఎముకలు, చర్మం, పళ్లు, గోర్లు.. ఇలా అనేక భాగాలకు అక్రమ మార్కెట్ ఉంది. చిరుత విషయంలోనూ చర్మం, ఎముకలు, పళ్లు, గోర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఎలుగుబంటి కూడా ఈ అక్రమ వ్యాపారం నుంచి తప్పించుకోలేదు. బైల్‌, గాల్ బ్లాడర్‌, పాదాల కోసం అక్రమ వేట జరుగుతోంది. మొసళ్ల చర్మం.. లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్‌లో విలువైనదిగా పరిగణించబడుతుంది. పాముల చర్మం కూడా లెదర్ ఉత్పత్తుల్లోకి వెళ్తోంది. ఇక అరుదైన పక్షులు, తాబేళ్లు, కొన్ని లిజార్డ్స్‌.. వీటికి మరో రకమైన డిమాండ్ ఉంది. జీవంగానే పట్టుకుని అక్రమంగా విక్రయించే ఎగ్జాటిక్ పెట్ మార్కెట్ కూడా ఉంది. జింకల విషయంలో కొమ్ములు, మాంసం, చర్మం..షార్క్‌ల విషయంలో ఫిన్స్, మాంసం..సీహార్స్ వంటి సముద్ర జీవుల విషయంలో ఎండబెట్టిన శరీర భాగాలకు కూడా మార్కెట్ ఉంది.

అంటే..జంతువు ఒక్కటే కాదు.. దాని దంతాలు, కొమ్ములు, చర్మం, ఎముకలు, స్కేల్స్, పళ్లు, గోర్లు.. చివరికి జీవంగానే ఉన్న జంతువుకూ మార్కెట్ ఉంది!అందుకే హైదరాబాద్‌లో 17 కిలోల ఏనుగు దంతాలు పట్టుబడిన ఘటనను కేవలం ఒక ivory కేసుగా చూడాలా?లేక.. నగరానికి చేరుతున్న అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌పై మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా?ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న!


2) రూ.8,500కే నెలంతా RTC + మెట్రో ప్రయాణం!

ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాలి. ముందు బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి మెట్రో ఎక్కాలి..మళ్లీ సాయంత్రం మెట్రోలో వచ్చి, బస్సులో ఇంటికి చేరాలి. ఇలా రోజూ బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగించే వాళ్లకు ఇక టికెట్ల టెన్షన్ తగ్గనుంది. ఎందుకంటే, హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది.

ఒక్క పాస్. రెండు రవాణా వ్యవస్థలు. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుకు ఒక టికెట్. మెట్రోకు మరో టికెట్. కానీ ఇప్పుడు ఒకే కామన్ పాస్‌తో TGSRTC సిటీ బస్సులు, హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం ముఖ్యంగా రోజూ బస్సు నుంచి మెట్రోకు మారే ఉద్యోగులు, విద్యార్థులు, రెగ్యులర్ కమ్యూటర్లకు ఉపయోగపడేలా రూపొందించారు.

రోజువారీ కామన్ పాస్ రూ.400. ఇందులో మెట్రో భాగం రూ.300, ఆర్టీసీ భాగం రూ.100. అంటే ఒకే పాస్‌తో ఆ రోజు రెండు రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవచ్చు. ఇక నెలంతా రోజూ ప్రయాణించే వాళ్ల కోసం, నెలవారీ కామన్ పాస్ రూ.8,500. ఇందులో మెట్రో ఛార్జీ రూ.7,000,ఆర్టీసీ ఛార్జీ రూ.1,500.ఎక్కడెక్కడ ప్రయాణించొచ్చు?

ఈ కామన్ పాస్‌తో ORR పరిధిలో నడిచే సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం. Pushpak బస్సులు ఈ కామన్ పాస్ పరిధిలో ఉండవు. అంటే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే Pushpak కోసం ఈ పాస్‌ను ఉపయోగించలేరు.

పాస్ ఎక్కడ దొరుకుతుంది? కామన్ పాస్‌ను హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో తీసుకోవచ్చు. మొదటిసారి కార్డు తీసుకునేటప్పుడు రూ.100 వసూలు చేస్తారు. కార్డును తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఇక టికెట్ల విషయంలో కూడా డిజిటల్ దిశగా అడుగులు పడుతున్నాయి. TGSRTC ‘మీ టికెట్’ యాప్ ద్వారా డిజిటల్ బస్ టికెట్లు, డే, వీక్లీ, నెలవారీ పాస్‌లను అందిస్తోంది.

ప్రతిరోజూ బస్సులో టికెట్ కోసం డబ్బులు వెతకడం, మెట్రోలో మళ్లీ టికెట్ తీసుకోవడం, ప్రతి ప్రయాణానికి వేర్వేరు టికెట్లను నిర్వహించడం. ఇలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా బస్సు + మెట్రో కాంబినేషన్‌లో ప్రయాణించే వాళ్లకు ప్రయాణం మరింత సులభం అవుతుంది.

హైదరాబాద్‌లో మెట్రోకు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్యాసింజర్ ట్రిప్స్ ఉన్నాయని HMRL పేర్కొంది. ఈ మెట్రో వ్యవస్థకు బస్సులను అనుసంధానం చేయడం ద్వారా ప్రజా రవాణా వినియోగాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ సమీకృత విధానం తీసుకొచ్చారు. కానీ.. రూ.8,500 పాస్ అందరికీ ఉపయోగకరమేనా? ఇదే ఇప్పుడు ప్రయాణికుల ముందున్న ప్రశ్న.

రోజూ మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సు కూడా ఉపయోగించే వాళ్లకు ఈ పాస్ సౌకర్యంగా ఉండొచ్చు. కానీ కేవలం అప్పుడప్పుడు మెట్రో లేదా బస్సు ఉపయోగించే ప్రయాణికులకు మాత్రం నెలవారీ పాస్ తీసుకోవడం అవసరమా అన్నది వారి ప్రయాణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

అంటే, ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకు ఒకే పాస్‌తో సౌకర్యం. తక్కువ ప్రయాణం చేసేవాళ్లకు సాధారణ టికెట్/ఇతర పాస్‌లు సరిపోవచ్చు.ఇది కేవలం ఒక కామన్ పాస్ మాత్రమే కాదు. మెట్రో + ఆర్టీసీని ఒకే ప్రజా రవాణా వ్యవస్థలా ఉపయోగించే దిశలో ఇది ఒక అడుగు. ఇప్పటికే హైదరాబాద్‌లో డైలీ, వీక్లీ, నెలవారీ పాస్‌లతో పాటు కామన్ మొబిలిటీ టికెటింగ్ సిస్టమ్ తీసుకురావాలని HMRL అధికారులు చర్చించారు.

Read More
Next Story