
నల్లమల గుండెల్లో ఎగిరే రహదారి: హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కథ
దాదాపు 45కిలోమీటర్లు ఎలివేటెడ్ క్యారిడార్ ఉండేలా ప్రణాళిక సిద్ధమైంది
హైదరాబాద్ నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విషయం ఏమిటంటే(Hyderabad) హైదరాబాద్ నుంచి (SriSailam) శ్రీశైలం వెళ్లే రహదారి పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది ఘాట్ రోడ్డు మలుపులు, నల్లమల అడవులు, అడవిలో ప్రయాణం. ఒకవైపు భక్తి యాత్ర, మరోవైపు ప్రమాదాల భయం. ఈ నేపథ్యంతోనే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే నల్లమల అటవీ ప్రాంతం మీదుగా(Elevated Corridor) ‘ఎలివేటెడ్ క్యారిడా ర్’ నిర్మాణం చేస్తే నిరంతర ప్రయాణం సాధ్యమవుతుంది కదాని. ఎందుకంటే, ఇపుడు సాయంత్రం చీకటిపడితే నల్లమల్ల అడవుల్లో(Nallamala Forest) ప్రయాణం నిషిధం కాబట్టి. అడవిలో రాత్రిపూట ప్రయాణంపై అటవీశాఖ నిషేధం విధించింది. ప్రయాణీకులైనా, భక్తులైనా పొద్దుపోయాక చెక్ పోస్ట్ దగ్గరే ఆగిపోయి ఉదయం బయలుదేరాల్సిందే. రాత్రిపూట ప్రయాణం చేయాలని అనుకునేవారికి అటవీశాఖ ఉత్తర్వులు బాగా ఇబ్బందిగా ఉంది.
అందుకనే పై ఇబ్బందులను గమనించిన కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు ఎలివేటెడ్ క్యారిడార్ ను నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఎలివేటెడ్ క్యారిడార్ అంటేనే భూమిపైన కాకుండా భూమికి నిర్దిష్ట ఎత్తులో చేసే ప్రయాణం అని అర్ధం. దీనివల్ల భూసేకరణ అవసరం ఉండదు. అటవీప్రాంతాన్ని ధ్వంసంచేయాల్సిన అవసరం రాదు. హైదరాబాద్ నుండి నంద్యాలవరకు వయా శ్రీశైలం అవసరమైన ప్రాంతంలో ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంవల్ల అనేకసమస్యలు తొలగిపోతాయని ప్రభుత్వాలు భావించాయి. భూమికి 40అడుగుల ఎత్తులో దట్టమైన అడవులమధ్య సుమారు 45కిలోమీటర్లు ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణం జరిగే అవకాశాలున్నాయని సమాచారం.
తెలంగాణ, నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ప్రాంతంలోని బ్రాహ్మణపల్లి గ్రామంనుండి నల్లమల అడవుల్లోని అమ్రామాబాద్ టైగర్ ప్రాజెక్టును దాటుకుని శ్రీశైలంకు చేరుకుంటుంది.
ఎలివేటెడ్ క్యారిడార్ నిడివి ఎంత ?
జాతీయరహదారి 765 కిందవచ్చే హైదరాబాద్–శ్రీశైలం మార్గాన్ని నాలుగులేన్ల ఎలివేటెడ్ క్యారిడార్ గా మార్చే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకరించింది. సుమారు 62.5కిలోమీటర్ల పొడవుతో ఈప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. అందులో దాదాపు 45కిలోమీటర్లు ఎలివేటెడ్ భాగంగా ఉండేలా ప్రణాళిక సిద్ధమైంది. మిగతా భాగం నాలుగు లేదా ఆరులైన్ల రోడ్డుతోనే ఉంటుంది. 45కిలోమీటర్లు ఎలివేటెడ్ క్యారిడార్ ఎందుకంటే ఈ నిడివి దట్టమైన అడవులు ముఖ్యంగా ‘టైగర్ రిజర్వ్ ఫారెస్టు’లో నుండి వెళుతుంది కాబట్టే.
ఈ మార్గం ‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్’, నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. అందుకే ఇది సాధారణ రహదారి ప్రాజెక్ట్ కాదు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ ప్రభావం, అటవీ చట్టాల అనుమతులు అన్నీ కలిపి ఇది సున్నితమైన అంశంగా మారిపోయింది. వన్యప్రాణులను సంరక్షిస్తూనే, భక్తులు, ప్రయాణీకుల రాకపోకలకు ఎలాంటి అంతరాయాలు కలగకూడదు అనుకుంటే ఎలివేటెడ్ క్యారిడార్ ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. పనిలోపనిగా వన్యప్రాణులు సులభంగా ఎలివేటెడ్ క్యారిడార్ ప్రాంతాన్ని దాటేందుకు ప్రత్యేకంగా 300 మీటర్ల పొడవు ‘వైడ్ డక్ట్’ లు(భూగృహంలాంటిది),‘అండర్‌పాస్’లు ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా ఉంది.
మొత్తం వ్యయం
వ్యయం విషయంచూస్తే మొత్తం ఖర్చు సుమారుగా రు. 8 వేల కోట్లు అవుతుందని అంచనా. ఇందులో 33 శాతం నిధులను భరించటంతో పాటు సీనరేజ్, జీఎస్టీని కూడా భరిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. మిగతా మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్ధపడితే వెంటనే ప్రాజెక్టను అమలుకు శ్రీకారం చుట్టువచ్చు. సూత్రప్రాయంగా నిర్ణయమైతే జరిగింది కాని ఇప్పటివరకు క్షేత్రస్ధాయిలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అటవీ అనుమతులు, పర్యావరణ క్లియరెన్సులు, నిధుల కేటాయింపు లాంటి అంశాలు పూర్తవ్వాలి. ప్రతిపాది ఎలివేటెడ్ క్యారిడార్ రహదారి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయానికి దగ్గరలో ఉండేట్లు చూడాలని కేంద్ర ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటి రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణ, ఏపీకి చెందిన డీపీఆర్ కన్సల్టెంట్లు ఎలివేటెడ్ తో పాట ప్రత్యామ్నయ ఎలైన్మెంట్లు, ఆదాయ మార్గాలతో కూడిన నివేదికలు సిద్ధంచేశాయి. తొందరలోనే రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీల సమావేశంలో డీపీఆర్ నివేదికలపై చర్చించబోతున్నాయి. ప్రాజెక్టు ఆపరేషనల్ సామర్ధ్యం మెరుగుపడేలా ఎలైన్ మెంట్ ను పున:పరిశీలించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖలోని ఎలైన్ మెంట్ అప్రూవల్ కమిటి డీపీఆర్ తయారీ కన్సల్టెంట్లను కోరింది.
దూరం ఎంత తగ్గుతుంది ?
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణం వర్షాల సీజన్ లో కష్టమే. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు, రాత్రివేళ ప్రయాణంలో నిషేధాలు ప్రయాణికులను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం సుమారుగా గంటవరకు తగ్గే అవకాశముంది. భక్తులు, పర్యాటకులకు ఇది పెద్ద ఊరటనే చెప్పాలి. శ్రీశైలం నుంచి నంద్యాల వైపు వెళ్ళే రహదారి కూడా నేషనల్ హైవే 765 పరిధిలోకే వస్తుంది. అయితే ఆ విభాగంలో ప్రత్యేక ఎలివేటెడ్ ప్రాజెక్ట్ ప్రకటన ఇప్పటివరకు లేదు. నాలుగు లేన్ల విస్తరణపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నల్లమల గుండెల్లో ఎగిరే రహదారి నిర్మాణం ఎప్పుడు మొదలవుతుంది? సూత్రప్రాయ అనుమతి దశను దాటి, నేలమీద పనులు ఎప్పుడు మొదలవుతాయి? రాజకీయసంకల్పం, పర్యావరణ సమతుల్యత, ఆర్థిక వనరులు ఈ మూడింటి సమన్వయంతోనే ఈ కల నిజమవ్వాలి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ప్రయాణం ఉత్త భక్తి మార్గంగానే కాకుండా అభివృద్ధి చర్చల కేంద్రంగా కూడా మారబోతోంది. ప్రయాణీకులు, భక్తులు సంతోషించే రోజు ఎంతదూరంలో ఉందో చూడాల్సిందే.

