
సందేహాల మధ్యే ఈహెచ్ఎస్ పథకాన్ని స్వాగతిస్తున్న ఉద్యోగులు
అపరిమిత ఆరోగ్య పథకాన్ని ఉద్యోగుల కోరిక మేరకే ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఉద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరికొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ సంఘాలు పథకాన్ని స్వాగతిస్తుండగా సాధారణ ఉద్యోగులు అనేక సందేహాలను సామాజిక మధ్యమాలలో వ్యక్తం చేస్తున్నారు.
వీటిని పరిగణలోకి తీసుకున్న నాయకులు ప్రభుత్వంతో చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని ట్రస్ట్ ఏర్పడి విధివిధానాలను ఖరారు చేసే దశలో పరిష్కారం అడుగుతామని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతంలోని బేసిక్ పేలో 1.5 శాతం తీసుకుని దానికి సరిసమానంగా తన వాటా కూడా చేర్చి ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని ముందుకు వచ్చింది. ఉద్యోగుల నుంచి సేకరించిన మొత్తం ఏడాదికి రు. 528 కోట్లకు ప్రభుత్వం తన వాటాగా మరో రు. 528 కోట్లను చేర్చి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల లోపు పథకాన్ని ప్రవేశపెట్టాలని అది యోచిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేయటానికి పూనుకుంటోంది. ట్రస్ట్ లో ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. హెల్త్ కార్డులు జారీచేసి ట్రస్ట్ ద్వారా జమ అయిన మొత్తంలో నుండి ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాల కోరిక ప్రకారం నగదు రహిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ వంటి ప్రయోజనాల కోసం జీతం నుండి కట్ చేస్తున్నా సకాలంలో అవసరానికి రుణాలు ఇవ్వటం లేదు. తమకు ఇవ్వాల్సిన బకాయిలనే ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం హెల్త్ కార్డు ద్వారా సేకరించిన మొత్తాన్ని వేరే పనులకు మళ్ళించదని హామీ ఏమిటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగస్థులకు రావలసిన బకాయీలు రు. 11,000 కోట్లకు చేరినట్టు వారి సంఘాలు చెప్పాయి. ఈ నేపధ్యంలోనే 61 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయీలు అందుకోకుండానే చనిపోయారని రిటైర్డ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ కే. లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. “2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇంత వరకు రాలేదు. జబ్బులకు సరయిన ట్రీట్మెంట్ తీసుకోలేక చనిపోయిన వాళ్ళు, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఇళ్ళు వదిలి వెళ్ళిన వాళ్ళు వీరిలో ఉన్నారు. కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని కలిశారు. 2024-25 లో రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ లకు చెల్లించాల్సిన డబ్బు వంటి బకాయిలే రు. 1,500 కోట్ల వరకు ఉంటాయి. పథక ప్రారంభానికి ముందే ప్రతి ఉద్యోగి అంగీకారాన్ని తీసుకోమని ప్రభుత్వానికి చెప్తున్నాము,” అని చెప్పారు.
కొంత మంది ఉద్యోగులు ఇప్పటికే వివిధ ఇన్షూరెన్స్ పథకాలలో చేరి ఉండటం వలన వాళ్ళు పథకంలో చేరటానికి వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన వివరించారు.
“అమలులో ఉన్న ఈహెచ్ఎస్ పథకంలో రెండు లక్షల పరిమితికి ఉంది. అంతకుమించి అవసరం అయిన పేషెంట్ లకు 10 లక్షల వరకు లబ్ధి పొందేందుకు వీలున్నా ప్రయోజనం అందటం లేదు. ఒక ఉద్యోగి రెండు లక్షలకు మించి సహాయం పొందటానికి అసోసియేషన్ తరపున రాసి మూడు సంవత్సరాలైనా పైసా రాలేదు. ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ పథకం జబ్బు పడ్డ మనిషి హాస్పిటల్ లో చేరితేనే అమలులోకి వస్తుంది. జబ్బు నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఖర్చులు ఈహెచ్ఎస్ కవర్ చేయడం లేదు,” అని లక్ష్మయ్య వివరించారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల పట్ల సదభిప్రాయం లేకపోవటానికి ఆరోగ్యశ్రీ క్రింద హాస్పిటల్ లకు దీర్ఘకాలం బకాయి చెల్లించకపోవటం కూడా కారణమే.
ప్రస్తుతం ఈహెచ్ఎస్ కార్డును ఏ ఆసుపత్రి అంగీకరించటం లేదని ‘ఫెడరల్’ తో మాట్లాడిన అనేక మంది ఉద్యోగులు చెప్పారు.
ప్రభుత్వంతో చర్చలు జరిగిన తీరుని వివరిస్తూ, “బేసిక్ లో 1.5 శాతం ప్రీమియం అంటే చాలా ఎక్కువ కాబట్టి తగ్గించమని అడిగాము. నా బేసిక్ పే రు. 1,10,000 కాబట్టి నెలకు రు. 1,600 సంవత్సరానికి రు. 19,200 చెల్లించాలి. కేంద్ర పథకంలో ఉన్నట్టు రు. 250 నుంచి రు. 1,000 రేంజ్ లోనే శ్లాబ్ లు పెట్టమని అడిగాము. ప్రభుత్వం స్కీమ్ అమలులోకి రానివ్వండి, అన్ని సలహాలు తీసుకుని ప్రీమియంలో మార్పులు చేద్దాం అన్నది. అందుకే అంగీకరించాం,” అని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అన్నారు.
ప్రభుత్వం ఉద్యోగుల బకాయీలు సకాలంలో చెల్లించటంలేదు. మెడికల్ రీయంబర్స్మెంట్ క్రింద రెండు లక్షల బిల్లులను పూర్తిగా ఇవ్వటం లేదు. ఈ పరిస్థితిలో పరిమితి లేకుండా మొత్తం ఖర్చులను భరిస్తాం అంటే నమ్మకం కుదరటం లేదు, అని రవి అన్నారు. ఇప్పటి వరకు అమలైన అన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాలు ఉచితంగానే అమలయ్యాయి. మొదటి సారిగా ఉద్యోగులు తమ వాటా చెల్లించబోతున్నారు అని రవి చెప్పారు. ఇలాంటి పథకాలు కేరళ, తమిళనాడులలో ఇప్పటికే అమలులో ఉన్నాయి.
ఈ కొత్త పథకం కుటుంబంలోని ఉద్యోగి, తన సహచరి, తల్లి దండ్రులు, ఇద్దరు పిల్లలు మొత్తం అరుగురికి వర్తిస్తుంది. కచ్చితంగా మంచి పథకమే అని ఉద్యోగ, గజెటెడ్ అధికారుల, టీచర్, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు ఆషాభావంతో ఉన్నారు. “ప్రభుత్వ పథకంలో చేరటం ఇష్టం లేని వాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. 1.5 శాతం ప్రీమియం ఎక్కువ అనుకుంటే మళ్ళీ చర్చల్లో తగ్గించమని చెప్పచ్చు. కొత్తగా ఏ పథకం ప్రారంభించినా సమస్యలు ఉంటాయి. ఇంకా విధి విధానాలు తయారు చేయక ముందే వ్యతిరేకించటం తప్పు. ఈహెచ్ఎస్ 17/12/2016 లో మొదలైనా అది సరిగా అమలు కాలేదు. ఉద్యోగుల కోరిక మేరకే ప్రభుత్వం ఈ పథకం తెస్తోంది,” అని అన్నారు.
పథకం గురించి సీపీఎస్ ఉద్యోగులలో ఉన్న సందేహాలను తీరుస్తామని ట్రస్ట్ లో సభ్యులైన సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గిరి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. “ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా పరిశీలిస్తాము. ఉద్యోగులు, ప్రభుత్వం తమ వాటాగా పథకం కోసం కట్టిన సొమ్ము సంవత్సరానికి రు. 1,056 కోట్లు జమ అవుతాయి. డబ్బు మిగిలితే మరో ఏడు ప్రీమియం తగ్గించవచ్చు,” అని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో రిటైర్ అయిన 2,316 మంది సీపీఎస్ ఉద్యోగుల ప్రస్తావన రాలేదని, సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాల ప్రభావం తగ్గింది:
“ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న డబ్బు వారికి సకాలంలో ఇవ్వకపోవటంతో దాని మాటలకు విశ్వసనీయత లేకుండా పోయింది. గతంలో జీపీఎఫ్ నుంచి డబ్బులు రెండు రోజుల్లో తీసుకుని వాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు నెలలు పడుతోంది. ఉద్యోగులు సంఘాల నాయకులను విశ్వసించే పరిస్థితి పోయింది. ఉద్యోగ సంఘాలు చేవ చచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండా అయిపోయాయి. అవి గత 20 ఏళ్లుగా అనుసరించిన విధానాలే దీనికి కారణం. రిటైర్ అయ్యాక ఏదైనా పోస్ట్ వస్తుందేమో అని నాయకులు ఎదురు చూస్తున్నారు,” అని విశ్రాంత రాష్ట్ర గజెటెడ్ ఆఫీసర్ ల సంఘం ప్రెసిడెంట్ జె. రామచంద్రా రెడ్డి చెప్పారు.
“ఉద్యోగులు అన్ని రకాలుగా విడిపోయారు. పెన్షన్ సౌకర్యం లేని ఉద్యోగుల సమస్యలను పట్టించుకొకపోవటంతో వాళ్ళు దూరం అయ్యారు. గతంలో పాత పెన్షన్ పథకం ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండేవాళ్లు. ఇప్పుడు 2004 నుంచి వచ్చిన కొత్త పథకం (CPS) ఉద్యోగులు ఎక్కువయ్యారు. వాళ్ళు పాత పెన్షన్ పథక పునరుద్ధరణను ప్రాధాన్యత ఉన్న డిమాండ్ గా చూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లను ఇప్పించుకునే పరిస్థితి లేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టే వాళ్ళు సంఘాలను పట్టించుకోవటం లేదు,” అని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలోనే రాష్ట్రం ఈహెచ్ఎస్ పథకం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. “కేంద్ర ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) బాగా ఉపయోగపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డును ఏ హాస్పిటల్ అంగీకరించటం లేదు. ప్రభుత్వమే ఉచితంగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా అమలు కాలేదు. కాగితాలకే పరిమితం అయ్యింది. చికిత్స చేయించుకుని రీయంబర్స్మెంట్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉద్యోగులు పథకం కోసం తమ వాటా కూడా కడితే ఒక హక్కుగా అడిగే వీలుంటుంది,” అని అభిప్రాయపడ్డారు.
“కొంత మంది చిన్న వయసు ఉద్యోగులు జబ్బులు లేని వాళ్ళు ఈ పథకాన్ని అనవసర భారంగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఈహెచ్ఎస్ పథకం సరిగ్గా అమలైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు,” అని తెలుపుతూ ప్రైవేట్ ఇన్షూరెన్స్ కంపెనీలు లబ్దిదారులకు డబ్బులు ఎలా ఎగ్గోట్టాలని చూస్తుంటాయి. కొన్ని లోపాలతో మొదలైనా ప్రభుత్వం పై ఒత్తిడి చేసి పథకాన్ని అమలు చేసేటట్టు చేసుకోవడం ప్రస్తుతం అవసరం అన్నారు.

