తెలంగాణ బాటలో దేశం నడుస్తుంది: రేవంత్
x

తెలంగాణ బాటలో దేశం నడుస్తుంది: రేవంత్

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల నుంచి శాలరీ కట్ చేస్తామన్న రేవంత్.


కుల గణన అంశంలో తెలంగాణ బాటలోనే భారతదేశం నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే అంగవైకల్యం ఉన్న వారికి కూడా తమ సర్కార్ చేదోడుగా నిలువనుందని పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పని చేస్తోందని తెలిపారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం రూ.50 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.

దివ్యాంగులకు కుటుంబ సభ్యుల్లా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం చెప్పారు. విద్యా రంగంలో ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల కోటాను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

క్రీడల రంగంలో దివ్యాంగులకు ప్రోత్సాహం ఇస్తున్నామని పేర్కొన్న సీఎం, పారాలింపిక్స్‌లో విజయం సాధించిన యువతికి ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పోటీ ప్రపంచంలో వెనుకబడ్డామన్న భావన రాకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచారని సీఎం కొనియాడారు. వైకల్యం అనే భావనకు లోనుకాకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు.

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ట్రాన్స్‌జెండర్‌ను కో-ఆప్షన్ సభ్యుడిగా కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని సీఎం సూచించారు. తద్వారా వారి సమస్యలను వారు స్వయంగా ప్రస్తావించే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


తల్లి దండ్రుల కోసం ప్రణామ్


‘‘వృద్ధ తల్లిదండ్రులు వారి రక్తాన్ని చమటగా మార్చి పిల్లలకు ఆస్తులు, విద్యను అందిస్తే, వయసు మీద పడినప్పుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా మారి ప్రణామ్ పేరుతో డే-కేర్ సెంటర్లను ప్రారంభిస్తోంది’’ అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, దానిపై ఫిర్యాదు అందితే ఉద్యోగస్తుల జీతాల్లోంచి 10 నుంచి 15 శాతం మేరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టంలో మార్పు తేవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హెల్త్ పాలసీ తీసుకురానున్నట్టు తెలిపారు.

తెలంగాణ సమాజం సామాజిక న్యాయం సమాన అవకాశాలు కోరుకుంటోందని పేర్కొన్న సీఎం, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించామని చెప్పారు. తెలంగాణ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు అంగీకరించిందని వెల్లడించారు. తెలంగాణ కులగణన మోడల్‌ను దేశం అనుసరిస్తోందని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం అన్నారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్‌లో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రవేశం కల్పించామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందని ఎవరైనా సమస్యలు చెప్పితే విని పరిష్కరించే విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా పేదల సంక్షేమానికి ప్రతీకగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read More
Next Story