తెలంగాణలో రైల్వే అభివృద్ధి గాడిలో పడాల్సిన వేళ, ప్రాజెక్టులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినా నిధుల విడుదలలో జాప్యం కారణంగా కీలక రైల్వే లైన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా పనులు ఆలస్యమవుతూ వ్యయం పెరుగుతుండగా, రాష్ట్ర ప్రజల ఆశలు కూడా రోజురోజుకీ మసకబారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. బడ్జెట్ లో పలు కొత్త రైల్వే లైన్లకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపినా నిధుల మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. పనుల జాప్యం వల్ల రైల్వే ప్రాజెక్టుల వ్యయం పెరిగి తడిసి మోపెడవుతుంది.
నత్తనడకన రైల్వే లైన్ నిర్మాణ పనులు
మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వేలైన్, ఆర్మూర్-ఆదిలాబాద్, రామగుండం- మణుగూరు, కాజీపేట-కరీంనగర్, మహబూబ్ నగర్-నల్గొండ రైల్వే లైన్ల నిర్మాణ పనులు నిధులు విడుదల కాక సజావుగా సాగడం లేదు.తెలంగాణ రాష్ట్రంలో 20 రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. బీబీనగర్- గుంటూరు డబ్లింగ్ పనులు పూర్తి కాలేదు. వికారాబాద్- కృష్ణా, కల్వకుర్తి- మాచర్ల, కాచిగూడ -జగ్గయ్యపేట, పటాన్ చెరు-ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
డీపీఆర్ సిద్ధం చేసినా నిధుల మంజూరేది?
మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ అసంపూర్తిగానే ఉంది. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా పూర్తి అయ్యింది. దీనికి నిధులు మంజూరు చేయలేదు.రామగుండం, భూపాలపల్లి, మణుగూరు కోల్ మైన్ ఏరియాలో ఉన్నాయి. కోట్లమంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తుంటారు. రామగుండం నుంచి మణుగూరు కొత్త రైల్వే లైన్ వయా భూపాలపల్లి, సమ్మక్క సారక్క కోల్ బెల్టు రైల్వే లైన్ నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కాజీపేట- కరీంనగర్ న్యూ రైల్వే లైన్ కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలనే ప్రతిపాదనలు ఆచరణ రూపం దాల్చలేదు.మహబూబ్ నగర్- నల్లగొండ కొత్త రైలు మార్గం నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసినా, దీనికి నిధులు కేటాయించలేదు.
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయండి : ఎంపీ ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయించిన కొత్త రైల్వేలైన్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి, కొత్త రైలుసర్వీసులను నడపాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పార్లమెంటులో ఈటెల రైల్వే బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని విన్నవించారు. ‘‘గత 20 నెలలుగా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి’’ అని కోరాను. ‘‘హైదరాబాద్, కోల్ కత్తా పెద్ద నగరాల్లో రైళ్ల స్పీడ్ పెరగడంతో తో ట్రాక్ క్రాస్ చేస్తూ అనేక మంది మరణిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్ లను దాటుతూ ప్రమాదాల్లో వన్యప్రాణులు మరణిస్తున్నాయి దీనికోసం తగిన వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించాలనికోరుతున్నాను’’అని ఈటెల పార్లమెంటులో రైల్వేశాఖ మంత్రిని కోరారు.
అత్యంత పురాతనమైన బొల్లారం రైల్వేస్టేషన్ నుంచి కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త రైళ్లను నడపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంటులో కోరారు.
తెలంగాణలో 20 రైల్వేప్రాజెక్టులు పూర్తి చేయండి : డాక్టర్ మల్లు రవి
తెలంగాణ రాష్ట్రంలో పెండింగులో ఉన్న 20 రైల్వేప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. రైల్వేకొత్త లైన్ల నిర్మాణంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రైల్వే పద్దుపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రస్థావించారు. డోర్నకల్-గద్వాల కొత్త రైలుమార్గం నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇంకా తయారు చేయలేదన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆయ కోరారు.
కల్వకుర్తి- మాచ్ల, కాచిగూడ- జగ్గయ్యపేట, పటాన్ చెరు-ఆదిలాబాద్ మధ్య రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలిన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి కోరారు.
ధాన్యం రవాణాకు రైల్వే రేక్స్ కేటాయించండి : ఎంపీ డాక్టర్ కడియం కావ్య
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో ఎంపీ కావ్య పాల్గొని తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రస్థావించారు.తెలంగాణలో ధాన్యం పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ ను సమృద్ధిగా కేటాయించాలని వరంగల్ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు.
రైల్వేశాఖ మంత్రికి సీఎం రేవంత్ లేఖ
తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసి లేఖ అందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం సీఎం గుర్తు చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని,కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణా - వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఆదిలాబాద్ రైల్వే పనులు చేపట్టండి : ఎంపీ జి నగేష్
తన నియోజకవర్గ పరిధిలోని రైల్వే పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ డిమాండ్ చేశారు. లోక్ సభలో నగేష్ మాట్లాడుతూ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని కోరారు. ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే మార్గానికి నిధులు కేటాయించాలని, ఆదిలాబాద్-గడ్ దాందూర్ కొత్త రైలు మార్గం నిర్మించాలని, ముత్ ఖేడ్- పిప్పల్ కోటి, కాజీపేట-బలార్షా మార్గాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జీలను నిర్మించాలని, పుణ్యక్షేత్రమైన బాసరలో మరిన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని నగేష్ కోరారు.
రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలైన రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతుండటం తెలంగాణకు దీర్ఘకాలిక నష్టాన్ని మిగులుస్తోంది. సమయానికి నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేస్తే పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు ఊతమిస్తాయి. లేకపోతే ప్రాజెక్టులు కేవలం ప్రకటనలకే పరిమితమై, ప్రజల ఆశలు రైల్వే పట్టాల్లానే నిలిచిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.