అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
x

అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ

తాము అధికారంలోకి వస్తే SC, ST, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ. 1 లక్ష బదిలీ చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.


కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే SC, ST, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి రూ. 1 లక్ష బదిలీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత మధ్యప్రదేశ్‌లో గిరిజనులను కలిసి మాట్లాడారు.

గ్యారెంటీడ్ అప్రెంటిస్‌షిప్‌..

ఏప్రిల్ 19న మొదటి విడతలో ఓటేయనున్న మండల లోక్‌సభ నియోజకవర్గంలోని సియోని జిల్లాలోని ధనోరాలో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. కేంద్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువకులకు గ్యారెంటీ అప్రెంటిస్‌షిప్‌ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

"దేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ పొందేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తాం. ఆ సమయంలో వారికి భత్యంగా రూ. 1 లక్ష ఇచ్చేలా చూస్తాం." అని కాంగ్రెస్ మాజీ చీఫ్ చెప్పారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తర్వాత వారు మంచి పనితీరు కనబరిచినట్లయితే వారు ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు.

ఆశా (కమ్యూనిటీ హెల్త్ వాలంటీర్లు), అంగన్‌వాడీ (పిల్లల సంరక్షణ కేంద్రం) కార్యకర్తలకు చెల్లిస్తున్న డబ్బును రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందని రాహుల్ చెప్పారు.

భూమిపై ఆదివాసీలకే హక్కు..

కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే ఒక్క ఏడాదిలోగా ఆదివాసీలకు భూమిపై హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌ను గిరిజన రిజర్వ్‌డ్‌ మాండ్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్. బీజేపీ తరుపున సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే తలపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, పంటలకు MSP..

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలుకుతామన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టాన్ని రూపొందిస్తామన్నారు.

ఆదివాసీలు, 'వనవాసీలు' కాదు

ఆదివాసీలను 'ఆదివాసీలు' (అసలు నివాసులు) అని పిలవడానికి బదులుగా 'వనవాసీలు' (అటవీవాసులు) అని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా పిలుస్తోందని, వారి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుందని, అధికారంలోకి రాగానే వారి హక్కులకు భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

"కాంగ్రెస్ మిమ్మల్నందరినీ 'ఆదివాసీ' అని పిలుస్తుంది, కానీ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి మిమ్మల్ని 'వనవాసీ' అని పిలుస్తారు. ఈ రెండు పదాలు భిన్నమైనవి. ఆదివాసీ అంటే భూమిపై యజమాని. భూమి, నీరు, అడవి సంపదకు అసలు యజమానులు. ”అని కాంగ్రెస్ నాయకుడు నొక్కిచెప్పారు.

భూమిపై హక్కు కల్పించిన ఘనత మాదే..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు భూమిపై హక్కు కల్పించిందని రాహుల్ గుర్తు చేశారు. ‘‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు భూమిపై హక్కు కల్పించింది. ఇప్పుడు ఆదివాసీలు ఉపాధి, విద్య, పరిహారం (భూమికి) అడిగితే బీజేపీ వారిని జైల్లో పెడుతుంది’’ అని రాహుల్ ఆరోపించారు.

మూత్ర విసర్జన ఘటన గురించి..

గత సంవత్సరం సిధి జిల్లాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనను రాహుల్ ప్రస్తావించారు. ఈ ఘటన దేశమంతా వైరల్ కావడంతో బాధిత గిరిజనుడిని అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన అధికారిక నివాసానికి పిలిపించి, ప్రాయశ్చిత్త చర్యగా అతని పాదాలను కడిగారని గుర్తు చేశారు. సిద్ధి ఘటనలో నిందితుడు స్థానిక బిజెపి శాసనసభ్యుడితో సంబంధం ఉందని కాంగ్రెస్ గతంలో ఆరోపిస్తే దాన్ని కాషాయ పార్టీ ఖండించింది.

ఒకే ఒక్కడు..

భారతదేశంలోని మొత్తం జనాభాలో గిరిజనులు 8 శాతానికి పైగా ఉన్నారు. అయితే వారిలో ఎవరూ టాప్ 200 కంపెనీల యజమానులు లేదా వారి సీనియర్ మేనేజ్‌మెంట్‌లో భాగం కాదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు. దేశాన్ని నడుపుతున్న 90 మంది ఐఏఎస్ అధికారుల్లో ఒక ఆదివాసీ బ్యూరోక్రాట్ మాత్రమే ఉన్నాడు” అని రాహుల్ అన్నారు.

ఆరో షెడ్యూల్‌ అమలు..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా నిర్ణయాలు తీసుకునేలా ఆరో షెడ్యూల్ (రాజ్యాంగం)ను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఆదివాసీల జనాభా 50 శాతం ఉన్న ప్రాంతాల్లో ఈ షెడ్యూల్‌ను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. కొన్ని గిరిజన ప్రాంతాలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా నిర్వహించుకునే వీలుంటుందని చెప్పారు.

Read More
Next Story