రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
x

రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ మెజిస్టీరియల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ(ఎస్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ మెజిస్టీరియల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెషన్స్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేశారు. నాలుగు రోజుల పోలీసు కస్టడీ పూర్తయిన తర్వాత, జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు 66 ఏళ్ల రేవణ్ణను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతనికి మే 14 వరకు ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దాంతో ఆమెను కిడ్నాప్ చేసిన కేసులో రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల ఆరోపణలు అధికార కాంగ్రెస్, బిజెపి-జెడి(ఎస్) మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ కేసు విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జెడి(ఎస్) కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశాయి. ఏప్రిల్ 26న కర్ణాటకలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్‌కు సంబంధించిన అశ్లీల వీడియోలు వైరలయ్యాయి.

కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి అశ్లీల వీడియోలపై విచారణ జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర పోలీసు చీఫ్ అలోక్ మోహన్‌లకు లేఖ రాశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 28న దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.

హాసన్ నుంచి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఏప్రిల్ 27న దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. సిట్‌ ముందు హాజరుకావాలని జారీ చేసిన సమన్లకు ఆయన ఇప్పటిదాకా స్పందించలేదు.

Read More
Next Story