ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడు? 10 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్‌మాల్!
x

ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడు? 10 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్‌మాల్!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల పన్ను ఎగవేత!

2) హైదరాబాద్‌లో ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడు? 10 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్‌మాల్!

3) AC చేయాలా? థియేటర్ మూయాలా? GO 77 దెబ్బ!-

1) హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల పన్ను ఎగవేత!

హైదరాబాద్ శివార్లలో ఓ టిన్ షెడ్‌. బయటికి చూస్తే సాధారణ గోదాములా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం భారీగా పాన్ మసాలా, పొగాకు తయారీ! అదీ ఎలాంటి అనుమతులు లేకుండా. అధికారులు దాడి చేస్తే, 40 ప్యాకింగ్ మెషీన్లు.. వేల కిలోల సరుకు.. 56 మంది కార్మికులు! అంతేకాదు, ఈ అక్రమ దందా ద్వారా ఏకంగా రూ.160 కోట్ల పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని దొమ్మ‌ర పోచంప‌ల్లి స‌మీపంలో ఓ నిర్జన ప్రాంతంలో ఈ అక్రమ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద టిన్ షెడ్‌లో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండానే పాన్ మసాలా, సెంటెడ్ జర్దా తయారు చేస్తున్నట్లు సెంట్రల్ జీఎస్టీ హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.

దాడి సమయంలో అక్కడ 56 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసలు ప్లాంట్ స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు. 40 FFS పౌచ్ ప్యాకింగ్ మెషీన్లను సీజ్ చేశారు. అంటే చిన్న స్థాయిలో జరుగుతున్న దందా కాదు. భారీగా ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్న వ్యవహారం.

దాడిలో అధికారులు భారీగా పాన్ మసాలా, పొగాకు నిల్వలను గుర్తించారు. సుమారు 5,500 కిలోల ఫినిష్డ్ స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపు రూ.76 లక్షల విలువైన రెడీ-టు-డిస్పాచ్ సరుకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమం, 810 కిలోల ముడి పొగాకు కూడా పట్టుబడ్డాయి. అంటే తయారు చేసిన సరుకు మాత్రమే కాదు. మరికొంత సరుకు తయారు చేసేందుకు అవసరమైన ముడి పదార్థాలు కూడా అక్కడ భారీగా నిల్వ ఉన్నాయి.

ఇక్కడే ఈ కేసులో అసలు షాకింగ్ విషయం బయటపడింది. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ అక్రమ తయారీ, సరుకు రవాణా ద్వారా GST, సంబంధిత సెస్‌లు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన పన్ను ఎగవేత విలువ సుమారు రూ.160 కోట్లు! అంటే టిన్ షెడ్‌లో జరుగుతున్న అక్రమ తయారీ వెనుక, వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత వ్యవహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సరుకు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను, భారీగా ఉన్న ప్యాకింగ్ మెటీరియల్‌ను, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ తయారీ కేంద్రాన్ని వెనుక నుంచి నడిపిస్తున్నట్లు గుర్తించిన కీలక నిర్వాహకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే ఈ దందా వెనుక ఒక్క వ్యక్తే ఉన్నాడా? లేక మరికొందరు భాగస్వాములు, నిర్వాహకులు ఉన్నారా? అనే కోణంలో కూడా సీజీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ నిర్జన ప్రాంతంలోని టిన్ షెడ్‌...లోపల 40 ప్యాకింగ్ మెషీన్లు.. వేల కిలోల పాన్ మసాలా, పొగాకు.. 56 మంది కార్మికులు. బయటికి సాధారణ యూనిట్‌లా కనిపించినా.. అధికారుల దాడితో రూ.160 కోట్ల పన్ను ఎగవేత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అధికారులు దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరున్నారు? సరుకు ఎక్కడెక్కడికి సరఫరా అయ్యేది? ఈ నెట్‌వర్క్ ఎంతకాలంగా నడుస్తోంది? ఈ ప్రశ్నలకు దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది.


2) హైదరాబాద్‌లో ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడు? 10 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్‌మాల్!

హైదరాబాద్ ఉప్పల్‌లో 10 ఎకరాల భూమి. దాని విలువ వంద కోట్లు. 1962లో ఈ భూమి రాచకొండ కనకయ్య అనే వ్యక్తికి స్వాతంత్య్ర సమరయోధుడిగా కేటాయించినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కనకయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన వివరాలు హోంశాఖ రికార్డుల్లో లేవని అధికారులు గుర్తించారు. దీంతో అసలు రాచకొండ కనకయ్య ఎవరు? ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుడి హోదా ఎలా వచ్చింది? 10 ఎకరాలు ఎలా దక్కాయి? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

1990 నుంచి 2016-17 వరకు పహాణీల్లో కనకయ్య పేరు కొనసాగగా, తర్వాత ఈ సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. అయితే ఈ మిస్టరీ బయటపడేలోపే భూమిలో సుమారు 7 ఎకరాల్లో నిర్మాణాలు జరిగిపోయాయి. దాదాపు 80 నిర్మాణాలు వెలిశాయి! ఈ 10 ఎకరాల వెనుక ఉన్న అసలు మిస్టరీని అధికారులు ఛేదించాల్సి ఉంది! హోంశాఖ రికార్డుల్లో అలాంటి స్వాతంత్య్ర సమరయోధుడే లేరని తేలింది! అయితే అప్పటికే ఏం జరిగింది? భూమిలో ఎక్కువ భాగం చేతులు మారింది. ఏకంగా 80కి పైగా నిర్మాణాలు వెలిశాయి.

హైదరాబాద్ ఉప్పల్ మండలం బండ్లగూడ గ్రామంలోని సర్వే నంబర్ 36/5లో మొత్తం 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అధికారుల వివరాల ప్రకారం, 1962లో ఈ 10 ఎకరాలను కనకయ్య అనే వ్యక్తికి స్వాతంత్య్ర సమరయోధుడిగా పేర్కొంటూ కేటాయించినట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. కనకయ్య, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటంలో పాల్గొన్న వ్యక్తినంటూ పేర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు కొనసాగింది. అంటే, ఒకవైపు ప్రభుత్వ భూమి. మరోవైపు, స్వాతంత్య్ర సమరయోధుడికి కేటాయించిన భూమి అన్న రికార్డు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ వ్యవహారం రికార్డుల్లో కొనసాగింది. 1990 నుంచి 2016-17 వరకు పహాణీల్లో కనకయ్య పేరు కనిపించింది. కానీ ఆ తర్వాత అదే సర్వే నంబర్ మొత్తాన్ని ప్రభుత్వ భూమిగా చూపించారు. దీంతో అధికారులకు అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఈ భూమిని కనకయ్యకు ఎవరు కేటాయించారు? ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుడి గుర్తింపు ఎలా వచ్చింది? ఆయన పేరు రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా వచ్చింది? అసలు కనకయ్య అనే వ్యక్తి నిజంగా స్వాతంత్య్ర సమరయోధుడేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో రికార్డుల తారుమారుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు అధికారులు గుర్తించారు.

భూమిపై వివాదం పెరగడంతో గత ఏడాది నవంబర్‌లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, కనకయ్య స్వాతంత్య్ర సమరయోధుడి హోదాను ధ్రువీకరించాలని హోంశాఖను కోరారు. హోంశాఖ అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. అక్కడే ఈ వ్యవహారంలో కీలకమైన విషయం బయటపడింది. కనకయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన వివరాలు తమ రికార్డుల్లో లేవని హోంశాఖ తేల్చింది. అంటే, భూమి కేటాయింపు రికార్డుల్లో ఒక పేరు ఉంది. కానీ, స్వాతంత్య్ర సమరయోధుడిగా హోంశాఖ రికార్డుల్లో ఆ వ్యక్తి వివరాలు లేవు. దీంతో అసలు ఈ భూమి కేటాయింపు వెనుక ఏం జరిగింది? రికార్డులు ఎవరు మార్చారు? ఎలా మార్చారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి.

ఈ విచారణ జరుగుతున్న సమయానికి 10 ఎకరాల భూమిలో సుమారు 7 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉప్పల్ తహసీల్దార్ RDOకి సమర్పించిన నివేదిక ప్రకారం..39 అపార్ట్‌మెంట్లు, 42 ఇండిపెండెంట్ ఇళ్లు, 16 ఓపెన్ ప్లాట్లు, ఒక శ్మశానవాటిక, రెండు ఆలయాలు, ఒక చర్చి, ఇలా పెద్ద సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన సుమారు 3 ఎకరాల్లో హైరిజ్ ప్రాజెక్టులకు అనుమతులు కూడా మంజూరైనట్లు అధికారులు పేర్కొన్నారు. అంటే, ప్రభుత్వ భూమిపై ఒక్క ఇల్లు కాదు, ఒక చిన్న కాలనీనే ఏర్పడిపోయింది.

ఇక్కడే మరో కీలక ప్రశ్న. ఈ భూమి కొంతకాలంగా సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా నిర్మాణాలు ఎలా జరిగాయి? భవన నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయి? ఓపెన్ ప్లాట్లు ఎలా ఏర్పడ్డాయి? అమ్మకాలు ఎలా జరిగాయి? అత్యంత ముఖ్యంగా ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పుడు.. ఈ నిర్మాణాలను అడ్డుకునే వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు? ఇప్పుడు ఇదే అధికారుల ముందున్న అతిపెద్ద ప్రశ్న.

ఒకప్పుడు రికార్డుల్లో కనిపించిన ఓ పేరు. ఆ పేరుతో దక్కిన 10 ఎకరాల భూమి. 40 ఏళ్ళ తర్వాత, “అసలు ఆ స్వాతంత్య్ర సమరయోధుడి వివరాలు మా రికార్డుల్లో లేవు” అని హోంశాఖ చెబుతోంది. కానీ అప్పటికే, భూమిలో భారీ నిర్మాణాలు వచ్చేశాయి. ఇప్పుడు ప్రశ్న కేవలం కనకయ్య ఎవరు? అన్నది కాదు. రికార్డుల్లో పేరు ఎలా వచ్చింది? ప్రభుత్వ భూమి ప్రైవేట్ చేతుల్లోకి ఎలా వెళ్లింది? 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై నిర్మాణాలు ఎలా జరిగాయి? అనుమతులు ఎవరు ఇచ్చారు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది.ఎందుకంటే.. ఇది కేవలం 10 ఎకరాల భూమి కథ కాదు. ప్రభుత్వ భూమిని కాపాడే వ్యవస్థలో ఉన్న లొసుగుల కథ కూడా!

3) AC చేయాలా? థియేటర్ మూయాలా? GO 77 దెబ్బ!

ఒకప్పుడు సినిమా అంటే పండుగ. గ్రామంలోనైనా, చిన్న పట్టణంలోనైనా, థియేటర్ ముందు భారీ క్యూలు. సినిమా మొదలైతే విజిల్స్. క్లాప్స్. హౌస్‌ఫుల్ బోర్డులు. కానీ ఇప్పుడు అదే సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముందు మరో బోర్డు కనిపించే పరిస్థితి వచ్చిందా? “CLOSED” సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన GO 77 ఇప్పుడు సినీ పరిశ్రమలో కొత్త వివాదానికి కారణమైంది. ప్రభుత్వం చెబుతున్నది.. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరలు, థియేటర్లకు కొత్త వర్గీకరణ.

కానీ ఎగ్జిబిటర్లు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. “టికెట్ రేట్లు పెంచినా.. థియేటర్ నడిపే ఖర్చులు భరించలేకపోతే.. ఈ థియేటర్లు ఎంతకాలం నడుస్తాయి?” ఇదే ఇప్పుడు GO 77 కథ.GO 77లో అసలు ఏముంది?ఆగస్టు 14, 2026న తెలంగాణ ప్రభుత్వం G.O.Ms.No.77 జారీ చేసింది. 2021లోని G.O.Ms.No.120 స్థానంలో కొత్త టికెట్ రేట్లు, థియేటర్ల వర్గీకరణను తీసుకొచ్చింది. కొత్త GO ప్రకారం థియేటర్లను ప్రధానంగా, Non-AC, AC/Air-Cooled, Special Theatres, Multiplexes గా వర్గీకరించారు. టికెట్ ధరలు కూడా కేటగిరీని బట్టి నిర్ణయించారు.

Non-AC థియేటర్లు: Non-Premium – రూ.30 నుంచి రూ.70, Premium – రూ.50 నుంచి రూ.100.

AC / Air-Cooled థియేటర్లు: Non-Premium – రూ.50 నుంచి రూ.150, Premium – రూ.100 నుంచి రూ.2౦౦

Special Theatres: Non-Premium – రూ.100 నుంచి రూ.250, Premium/Recliner – రూ.200 నుంచి రూ.౩౦౦

Multiplexes: Regular – రూ.100 నుంచి రూ.250, Recliner – రూ.200 నుంచి రూ.300.

అంతేకాదు..ప్రతి కేటగిరీ థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లు Non-Premiumగా ఉంచాలని ప్రభుత్వం చెప్పింది. అంటే సామాన్య ప్రేక్షకుడికి కూడా తక్కువ ధరలో సినిమా చూసే అవకాశం ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

వివాదం ఎక్కడ మొదలైంది?

GO 77లో Air-Cooled థియేటర్లను AC కేటగిరీలోకి తీసుకొచ్చారు. వాటిని పూర్తిస్థాయి AC థియేటర్లుగా మార్చుకోవడానికి లేదా Non-AC కేటగిరీలోకి వెళ్లేందుకు రెండేళ్ల గడువు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధన ఎక్కడో కాగితంపై ఒక లైన్ కావచ్చు. కానీ, ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానికి ఇది లక్షల రూపాయల పెట్టుబడి. ఎగ్జిబిటర్ల ప్రకారం టైర్-2, టైర్-3 పట్టణాల్లో 390కి పైగా Air-Cooled థియేటర్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. వాటిపై సుమారు 20 వేల కుటుంబాల జీవనోపాధి ఆధారపడి ఉందని వారు ప్రభుత్వానికి తెలిపారు.

మనకు థియేటర్ అంటే, ఒక బిల్డింగ్. ఒక స్క్రీన్. కొన్ని సీట్లు. ఒక టికెట్ కౌంటర్. కానీ ఆ థియేటర్ వెనుక? టికెట్ కౌంటర్ ఉద్యోగి, గేట్ కీపర్, సెక్యూరిటీ, ప్రొజెక్షన్ సిబ్బంది, క్యాంటీన్, క్లీనింగ్ సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్స్, చిన్నచిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ స్టాల్స్, ఇలా ఒక థియేటర్ చుట్టూ ఎన్నో కుటుంబాల జీవితం తిరుగుతుంది. అందుకే ఎగ్జిబిటర్లు చెబుతున్నది, “ఒక థియేటర్ మూసివేయడం అంటే ఒక షట్టర్ పడటం కాదు, దాని వెనుక ఎన్నో కుటుంబాల ఆదాయం ఆగిపోవడం.” తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ప్రకారం రాష్ట్రంలోని అన్ని థియేటర్లపై సుమారు 20 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.

ఎగ్జిబిటర్ల వాదన ప్రకారం, టైర్-2, టైర్-3 పట్టణాల్లోని Air-Cooled థియేటర్లను AC థియేటర్లుగా మార్చాలంటే ఒక్కో స్క్రీన్‌కు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని ఎగ్జిబిటర్లు ఈ పెట్టుబడి సుమారు రూ.90 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అంటే, ఇప్పటికే మల్టీప్లెక్స్‌లతో పోటీ పడుతున్న ఒక చిన్న పట్టణ సింగిల్ స్క్రీన్ యజమాని ముందు మరో భారీ పెట్టుబడి. AC మార్చాలి, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాలి. విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సిబ్బంది జీతాలు ఇవ్వాలి. ప్రొజెక్టర్, సౌండ్, సీట్లు, భవనం నిర్వహణ ఖర్చులు చూడాలి. ఇవన్నీ చేసిన తర్వాత, రోజుకు ఎన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతాయి? ఇదే ఎగ్జిబిటర్ల అసలు ప్రశ్న.

టికెట్ రేటు పెరిగితే థియేటర్‌కు నిజంగా లాభమా? ఇక్కడ మరో కీలక అంశం ఉంది. GO 77 ప్రకారం నిర్ణయించిన టికెట్ ధరలకు GST అదనం. అదే సమయంలో AC/Air-Cooled థియేటర్లకు ఒక్కో టికెట్‌పై రూ.5 maintenance charge, Non-AC థియేటర్లకు రూ.3 maintenance charge వసూలు చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు కూడా వేరుగా ఉండొచ్చు. అంటే ప్రేక్షకుడికి కనిపించేది, “టికెట్ ధర పెరిగింది”. కానీ ఎగ్జిబిటర్‌కు కనిపించేది “పెరిగిన ఖర్చులు కూడా ఉన్నాయి.” టికెట్ రేటు పెంచితే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్‌కు, థియేటర్ యజమానికి ఆ ఆదాయం ఎలా పంచబడుతుంది? థియేటర్ నిర్వహణ ఖర్చులు ఎంత? కరెంట్ బిల్లు ఎంత? సిబ్బంది ఖర్చు ఎంత? మెయింటెనెన్స్ ఎంత? ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న తర్వాతే సింగిల్ స్క్రీన్‌కు మిగిలేది ఎంత? అనే ప్రశ్నను ఎగ్జిబిటర్లు లేవనెత్తుతున్నారు.

ఎగ్జిబిటర్ల మరో ఆరోపణ. “మాతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు.” ఎగ్జిబిటర్లు, ఫిల్మ్ ఛాంబర్‌ను సంప్రదించకుండా ఏకపక్షంగా GO తీసుకొచ్చారని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కూడా GO 77ను పునఃసమీక్షించాలని కోరింది. ప్రత్యేకంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్లపై ప్రభావాన్ని పరిశీలించాలని కోరింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో స్టేక్‌హోల్డర్ మీటింగ్ నిర్వహించాలని ఛాంబర్ కోరింది. GO 77 ఉద్దేశం ప్రేక్షకుడికి సరసమైన ధరలో మంచి సినిమా అనుభూతి ఇవ్వడమే అయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా బతికేలా నిబంధనలు ఉండాలా? ఎగ్జిబిటర్లు ఇప్పుడు ఇదే కోరుతున్నారు.

Read More
Next Story