
నకిలీ నగలతో బ్యాంకుకే టోపీ..
నకిలీ ఆభరణాలతో లోన్ మోసం, కుటుంబ సభ్యుల పాత్ర వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న సామెతను ఏన్కూరు గ్రామీణ బ్యాంక్ ఘటన వాస్తవం చేసింది. నకిలీ నగలతో బ్యాంకునే బురిడీ కొట్టించిన ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నగల నాణ్యతను పరిశీలించాల్సిన అప్రైజరే బ్యాంకును బురిడీ కొట్టించాడు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏన్కూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు అప్రైజర్ శ్రీపాది సతీష్‌ను ఏ1గా చేర్చారు. ఆయన తన హోదాను అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కా పథకం ప్రకారం బ్యాంకును మోసం చేశాడు.
ఈ కేసులో సతీష్ భార్య శ్రీపాది మౌనికను ఏ2గా, అత్త రామచంద్రోజు జయమ్మను ఏ3గా, సతీష్ బావమరిది రామచంద్రోజు నరేష్‌ను ఏ4గా పోలీసులు తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో విడతల వారీగా దాదాపు 242.25 గ్రాముల నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టుకు తీసుకొచ్చారు. వాటిని ఏ1 సతీష్.. వాటి నాణ్యతను ధ్రువీకరించి బంగారంగా సర్టిఫై చేశారు. సతీష్ ధ్రువీకరణను అధికారులు ఏమాత్రం అనుమానించకుండా నిందితులకు రూ.9.53 లక్షల గోల్డ్ లోన్‌ను మంజూరు చేశారు.
అయితే రుణం కట్టాల్సిన నిందితులు గడువు ముగిసినా అసలు రుణం కాకుండా, వడ్డీని కూడా పైసా కూడా కట్టలేదు. దీంతో లోన్ అకౌంట్లు అన్నీ ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తులు) గా మారయి. బ్యాంకు నిబంధనల ప్రకారం బకాయిలను వసూలు చేయడం కోసం నిందితులు తాకట్టు పెట్టిన ఆభరణాలను వేలం వేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే మరికొందరు నిపుణుల చేత నగల నాణ్యతను పరిశీలింపజేశారు. అప్పుడు అసలు మోసం బట్టబయలయింది. నిందితులు తాకట్టు పెట్టినవి కేవలం బంగారం పూసిన నకిలీ ఆభరణాలని నిర్ధారవడంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే బ్యాంకును బురిడీ కొట్టించినట్లు నిర్ధారించారు. సతీష్, జయమ్మ, నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సతీష్ భార్య మౌనిక ప్రస్తుతం పరారీలో ఉన్నారు, ఆమె కోసం పోలీసులు గాలింపులు చేస్తున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్‌ఐ సంధ్య వెల్లడించారు.

