ముషీరాబాద్‌లో కల్తీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ సీజ్
x

ముషీరాబాద్‌లో కల్తీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ సీజ్

లైసెన్స్ లేకుండా గడువు ముగిసిన పదార్థాలతో ఐస్ క్రీంల తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు, భారీగా స్వాధీనం.


కాదేదీ కవితకు అనర్హం అని ఆనాడు శ్రీశ్రీ అంటే.. ఇప్పుడు కొందరు నేరస్తులు కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు. కొంత కాలంగా తెలంగాణలో బయటపడుతున్న కల్తీ ఆహార దందాలను చూస్తే ఇది అక్షరసత్యమనిపిస్తోంది. అన్ని రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. కనీస శుభ్రత పరిణామాలు లేకుండా తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కల్తీ దొరలు ఏదో ఒక దొడ్డిదారి వెతుక్కుంటున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తూ అనేక కల్తీ ఆహార సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్‌లు చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, సమోసా, పన్నీర్ ఇలా అనేక ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న ఘటనలు గత కొన్ని నెలల్లోనే వెలుగు చూశాయి. కాగా తాజాగా ముషీరాబాద్‌లో ఐస్ క్రీమ్‌ను కూడా కల్తీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

ముషీరాబాద్‌లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించడంతో భారీ అక్రమ వ్యవహారం బయటపడింది. తాజా పరిణామంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు, హెచ్-ఫాస్ట్ టీమ్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి బాపూజీ నగర్‌లో ఉన్న బ్లూ బెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో ఆ కేంద్రం ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా నడుస్తోందని గుర్తించారు. అక్కడ అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీంల తయారీ జరుగుతోందని అధికారులు తెలిపారు. పట్టాల అశోక్ అనే వ్యక్తి గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలను తయారు చేస్తున్నాడని వెల్లడైంది. నాణ్యమైన ఉత్పత్తులంటూ వినియోగదారులను నమ్మబలుకుతూ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

ఈ ప్రక్రియలో గడువు ముగిసిన రంగులు, ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. తయారీ కేంద్రం, నిల్వ ప్రాంతం కూడా అస్వచ్ఛంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దాడుల్లో మొత్తం రూ.1,75,000 విలువైన 3,759 ఐస్ క్రీం ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వెనీలా, బటర్ స్కాచ్, అమెరికన్ నట్స్, స్ట్రాబెర్రీ, డ్రై ఫ్రూట్, మాంగో, క్రీమ్ అండ్ కుకీస్ వంటి ఫ్లేవర్లు ఉన్నాయి.

అలాగే పెప్సీ ఐస్ క్రీంల ప్యాకెట్లు, ప్రత్యేక ఫ్లేవర్ల ప్యాక్స్, మలై కుల్ఫీ వంటి ఉత్పత్తులను కూడా సీజ్ చేశారు. ఇక తయారీలో వాడుతున్న కృత్రిమ ఆహార రంగులు, టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్, గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారులు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More
Next Story