హైకోర్టు పేరిట హైడ్రాకు ఫేక్ నోటీసులు: సైబర్ పోలీసుల దర్యాప్తు
x
తెలంగాణ హైకోర్టు భవనం (ఫొటో కర్టసీ: హైకోర్టు వెబ్ సైట్)

హైకోర్టు పేరిట హైడ్రాకు ఫేక్ నోటీసులు: సైబర్ పోలీసుల దర్యాప్తు

కూల్చివేతల మధ్య ఫేక్ నోటీసుల కలకలం..హైడ్రా ఆగ్రహం


హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆక్రమణల తొలగింపు చర్యల మధ్య ఇలాంటి నకిలీ సమన్లు వైరల్ కావడంతో హైడ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ పేర్లతో కూడిన ఈ ఫేక్ నోటీసులపై వెంటనే స్పందించిన హైడ్రా, వాటిని పూర్తిగా ఖండిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ నోటీస్ ఫేక్ అంటూ
హైడ్రా ప్రకటించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. ‘‘కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఏకంగా హై కోర్టు పేరిట ఫేక్ నోటీసులు సృష్టించేస్తున్నారు’’ అని హైడ్రా పేర్కొంది.

సైబర్ పోలీసుల విచారణ

హైకోర్టు పేరుతో ఫేక్ నోటీస్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది.హైడ్రా ఫిర్యాదుపై సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు.మొత్తంగా చూస్తే, హైకోర్టు పేరుతో ఫేక్ నోటీసులు సృష్టించడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో, ఈ నకిలీ నోటీసుల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇకపై సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నిజానిజాలు పరిశీలించి మాత్రమే నమ్మాలని హైడ్రా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు బ్రేక్, ఆంక్షలు జారీ

మరో వైపు ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు చేపట్టరాదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రాకు ఆంక్షలు విధించింది.
ప్రామాణిక కార్యాచరణ విధానం, మార్గదర్శకాలు హైకోర్టుకు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేత డ్రైవ్ లు చేపట్టవద్దని హైడ్రాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సరైన విధానపరమైన మార్గదర్శకాలను రికార్డు చేసే వరకు, అంతర్గత రోడ్లు, ప్రహరీ గోడలు లేదా ప్రైవేట్ కట్టడాలను కూల్చివేయడం వంటి బలవంతపు చర్యలకు హైడ్రా (HYDRAA) దూరంగా ఉండాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే చెరువులు, జలాశయాలు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారులకు సంబంధించిన పునరుద్ధరణ పనులను కొనసాగించడానికి కోర్టు హైడ్రాకు అనుమతి ఇచ్చింది.ఇలాపూర్ గ్రామంలోని వివాదాస్పద భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న ప్రజలు

హైడ్రా ప్ర‌జావాణికి 46 ఫిర్యాదులు

హైడ్రాకు హైకోర్టు ఆంక్షలు విధించినా, మరో వైపు ప్రజల నుంచి ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. హైడ్రా ప్రజావాణికి హైదరాబాద్ నగరంలోని పలు కాల‌నీల నుంచి అధిక‌సంఖ్యలో ఫిర్యాదులు వ‌చ్చాయి.వివిధ ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 46 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆర్.సుద‌ర్శ‌న్ విచారించి, ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.బాగ్ హ‌య‌త్‌న‌గ‌ర్ జ‌గ‌దాంబ కాల‌నీలో విజ‌య‌వాడ హైవే వైపు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి కిరాయిలు వ‌సూలు చేస్తున్నారని, బీడీఎల్ కాల‌నీని క‌లిపే ర‌హ‌దారికి అడ్డంగా గోడ క‌ట్టి తాత్కాలిక షెడ్డులు ఏర్పాటు చేశార‌ని ఫొటోల‌తో స‌హా ఫిర్యాదు చేశారు.
అమీన్‌పూర్ మండ‌లంలోని ఇండ‌స్ట్రియ‌ల్ ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లే ఔట్ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని,ర‌హ‌దారులు, పార్కులు ఆక్ర‌మించి ఇళ్లు క‌ట్టేస్తున్నార‌ని సొసైటీ ప్ర‌తినిధులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు

ఉప్ప‌ల్ ఈస్ట్ క‌ళ్యాణ‌పురిలోని జీహెచ్ ఎంసీ పార్కులో జీ ప్ల‌స్ 2 భ‌వ‌నాన్ని క‌ట్టార‌ని అక్క‌డి సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీ నీలాద్రిన‌గ‌ర్ కాల‌నీ ఫేజ్ -2 లో ర‌హ‌దారులు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌య్యాయ‌ని ఫిర్యాదు చేశారు. కాప్రా విలేజ్‌లోని జై జ‌వాన్ కాల‌నీలో7 చోట్ల ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించిన స్థ‌లాల్లో 6 చోట్ల పార్కులు, ప్ర‌జ‌ల వినియోగంలో ఉన్నా 7వ స్థ‌లంలో ప్లాట్లు మూడు వెలిశాయ‌ని వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని ప్ర‌జావాణి ఫిర్యాదులో విజ్ఞ‌ప్తి చేశారు. మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా, గండిమైసమ్మ–దుండిగల్ మండలం, బౌరంపేట్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు అక్క‌డి స్థానికులు ఫిర్యాదు చేశారు.
Read More
Next Story