‘సోనియాకు, లాలూకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం..’
పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా ర్యాలీలో షా ప్రసంగించారు. పేదలకు మేలు చేసే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, ఆర్‌జెడిపై విరుచుకుపడ్డారు. సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తారని ఆరోపించారు. పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా ర్యాలీలో షా ప్రసంగించారు. పేదలకు మేలు చేసే వ్యక్తి, మంచి చేసే పార్టీ ఏదైనా ఉందా? అంటే అది నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రమే అని అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యం కాగా, తన కొడుకును ముఖ్యమంత్రి చేయడమే లాలూజీ ధ్యేయం అని షా విమర్శణాస్త్రాలు సంధించారు.
భూ మాఫియాపై చర్యలు..
పేదల భూములు లాక్కున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందుకోసం త్వరలో కమిటీ వేయబోతున్నామని చెప్పారు. పేద ప్రజల భూములను ఆక్రమించిన లాలూ ప్రసాద్ యాదవ్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ‘‘బీహార్‌లో మళ్లీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిందని.. ల్యాండ్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తుందని.. ఈ విషయం చెప్పడానికే వచ్చానని ”అని షా అన్నారు.
‘‘కాంగ్రెస్, ఆర్జేడీలు చాలాయేళ్లు అధికారంలో ఉన్నాయి. అయినా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు తగిన గౌరవం ఇవ్వలేదు. కర్పూరీ ఠాకూర్ సేవలను గుర్తించి భారతరత్న ఇచ్చింది ప్రధాని మోదీ’’ అని గుర్తు చేశారు షా.