అటు నిరసనలు.. ఇటు సంప్రదింపులు.. ఐదో రోజుకు చేరిన రైతుల ఆందోళన
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఆందోళనను తీవ్రం చేయనున్నారు. ఇటు కేంద్ర మంత్రుల కమిటీ ఆదివారం మరోసారి రైతు నాయకులతో చర్చలు జరపనుంది.
సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపుమేరకు పంజాబ్‌కు చెందిన రైతులు మంగళవారం ఢిల్లీకి పాదయాత్రను ప్రారంభించారు. అయితే పంజాబ్ సరిహద్దులోని శంభు, ఖనౌరీ బార్డర్ల వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు సంఘీభావంగా హర్యానాలో ఉన్న గుర్నామ్ సింగ్ చారుణి నేతృత్వంలోని భారతీయ కిసాన్ యూనియన్ శనివారం ట్రాక్టర్ ర్యాలీని చేపట్టనుంది.
బీజేపీ నివాసాల వద్ద ధర్నా..
భారతి కిసాన్ యూనియన్ శనివారం పంజాబ్‌లోని ముగ్గురు సీనియర్ బిజెపి నాయకుల నివాసాల వద్ద ధర్నా చేయబోతున్నారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, బిజెపి పంజాబ్ యూనిట్ చీఫ్ సునీల్ జాఖర్, సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్ ఇళ్ల వద్ద నిరసన తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలోని టోల్ ప్లాజాల వద్ద నిరసన చేపట్టనున్నారు.
నాలుగో విడత చర్చలు..
కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఆదివారం రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో ఇరుపక్షాల మధ్య జరిగిన చర్ఛలు అసంపూర్తిగా ముగిశాయి.
దాడులకు తెగబడితే ఉపేక్షించం..
రైతుల ముసుగులో కొందరు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. 25 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇందులో హర్యానాకు చెందిన 18 మంది పోలీసులు, ఏడుగురు పారామిలటరీ జవాన్లు ఉన్నారని చెప్పారు.
కాగా హర్యానా భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించడంతో పాటు, రబ్బరు బుల్లెట్లతో కాల్చాడం ద్వారా చాలా మంది రైతులు గాయపడ్డారని "ఢిల్లీ చలో" పిలుపుకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు పేర్కొన్నారు.
గుండెపోటుతో రైతు మృతి..
శంభు సరిహద్దులో నిరసనకారుల మధ్య ఉన్న 63 ఏళ్ల రైతు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జియాన్ సింగ్ ఛాతినొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆయనను తొలుత పంజాబ్‌లోని రాజ్‌పురాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రికి తరలించగా ..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైతులు ఆయనకు నివాళులర్పించారు.
ఓ పోలీసు కూడా..
శంభు సరిహద్దులో విధులు నిర్వహిస్తన్న 52 ఏళ్ల పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ కూడా మరణించినట్లు ఓ అధికారి శుక్రవారం తెలిపారు.
హర్యానా రైల్వే పోలీసులకు అటాచ్ చేసిన హీరాలాల్ శంభు సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా.. ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు.
నిరసనకారుల నోరు మూయించలేరు..
నిరసనకారుల గొంతులను "అణచివేయడానికి" కేంద్రం రైతులు, యూట్యూబర్‌ల సోషల్ మీడియా ఖాతాలు తాత్కాలికంగా పనిచేయకుండా చేయాలని చూస్తోందని వ్యవసాయ నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు.
రైతుల డిమాండ్లు ఇవి..
ఎంఎస్‌పికి చట్టపర హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.