తెల్లవారుజామున ఘోర ప్రమాదం: హైదరాబాద్–అనంతపూర్ బస్సు బోల్తా
x
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు

తెల్లవారుజామున ఘోర ప్రమాదం: హైదరాబాద్–అనంతపూర్ బస్సు బోల్తా

ఎన్‌హెచ్–44పై మరో ప్రమాదం – 30 మంది ప్రయాణికుల్లో 19 మందికి గాయాలు


తెలంగాణ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళుతున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయ రహదారి 44 వవద్ద బోల్తా పడింది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకువచ్చి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారని, ఇందులో 19మందికి తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



డ్రైవరు నిద్రమత్తు వల్లనే...

44నంబరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వారిలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయ పనులు చేపట్టారు.ఈ బస్సు ప్రమాదం డ్రైవరు నిద్రమత్తు వల్ల జరిగినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.



వరుస రోడ్డు ప్రమాదాలు

జాతీయ రహదారి 44పై వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున జరిగే ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల అలసట, రహదారి పరిస్థితులు వంటి అంశాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని, వేగ నియంత్రణపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, డ్రైవర్లకు సమయానుకూల విశ్రాంతి కల్పించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మరిన్ని అమాయక ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More
Next Story