
సర్పంచ్ ఎన్నికల కోసం కూతురిని చంపిన తండ్రి అరెస్ట్
సర్పంచ్‌గా పోటీ కోసం అనర్హత తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓ తండ్రి ఆరేళ్ల కూతురిని నిజామాబాద్ కెనాల్‌లో తోసి హత్య చేశాడు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఓ తండ్రి చేసిన పనికి నిజామాబాద్ జిల్లా అంతే విస్తుబోయింది. అధికారం ఉంటే బాగుంటుంది కానీ దాని కోసం కన్నబిడ్డలను కడతేర్చుకోవాలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారం వస్తుందో లేదో తెలియదు కానీ.. కన్నకూతురు అయితే ఇక తిరిగి రాదు కదా? అంటూ నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ ఇటీవల మండలంలోని నిజాం సాగర్ కెనాల్‌లో జరిగిన ఆరేళ్ల చిన్నారి హత్య కేసు కారణం.ఈ కేసులో తండ్రితో పాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జనవరి 30న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్ డీ-46 కెనాల్‌లో ఓ బాలిక మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టగా, మృతురాలిని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన ప్రాచి కొండమంగలేగా గుర్తించారు.
విచారణలో బాలిక తండ్రి పాండురంగ కొండమంగలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత అనే నిబంధన ఉందని భావించి, దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్లు వెల్లడైంది.
మొదట పిల్లల్లో ఒకరిని దత్తత ఇవ్వాలని ప్రయత్నించి, బర్త్ సర్టిఫికెట్ మార్పు సాధ్యం కాదని తెలిసిన తర్వాత, పిల్లల్లో ఒకరిని హత్య చేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం వేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో తండ్రి తన పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై తీసుకొచ్చి నిజామాబాద్‌లోని కెనాల్‌లో తోసేశాడని దర్యాప్తులో తేలింది. నీటి ప్రవాహంలో బాలిక మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో పాండురంగతో పాటు ప్రస్తుత సర్పంచ్ గణేశ్ షిండేను కూడా అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. ఘటనకు ఉపయోగించిన బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

