
కన్న పిల్లల్ని హత్యచేసిన తండ్రి
ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు పిల్లలను తీసుకుని పట్టణంలోనే ఉన్న చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళి అందులోకి తోసేశాడు
ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసు మిస్టరీ ఆదివారం వీడింది. కామారెడ్డి పట్టణం ఆర్బీనగర్ లో ఇస్మాయిల్, షబీనా దంపతులున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా, షబీనా కూలీపనులకు వెళుతోంది. వీళ్ళకు షీపత్, ఆయత్, మరియం అనే ముగ్గురు కూతుళ్ళున్నారు. రెండురోజుల క్రితం ముగ్గురు కూతుళ్ళు హఠాత్తుగా కనిపించకుండా పోయారని షబీనా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు వెంటనే బృందాలుగా ఏర్పడి వెతుకులాట మొదలుపెట్టారు. భార్య షబీనా, పోలీసులతో పాటు ఇస్మాయిల్ కూడా చాలా చోట్ల వెతికాడు.
వాళ్ళంటున్న ఇంటిచుట్టల వాళ్ళని విచారించటంతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. తమ విచారణలో ఇస్మాయిల్ వైఖరిపైనే పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. దాంతో ఇస్మాయిల్ ను విచారించారు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పిన ఇస్మాయిల్ పైన పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. దాంతో తమదైన శైలిలో పోలీసులు విచారించటంతో అసలు విషయం బయటపడింది.
ఇంతకీ పోలీసుల విచారణలో బయటపడిన విషయం ఏమిటంటే ముగ్గురు కూతుర్లను తండ్రి ఇస్మాయిలే చంపేశాడు. ఎందుకంటే ఇస్మాయిల్ భారీగా అప్పులు చేశాడు. దాదాపు రు. 5 లక్షలవరకు అప్పులున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆటోనడుపుకుంటున్న వ్యక్తి రు. 5 లక్షల అప్పులు ఎందుకు చేశాడో తెలీదు. ఆటోపై సరైన ఆదాయం రాక, అప్పులకు కట్టాల్సిన వడ్డీలు పెరిగిపోయి, ఇచ్చిన అప్పులను తీర్చమని ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ముగ్గురు పిల్లలను పెంచటం ఇస్మాయిల్ వల్ల కాలేదు.
అందుకనే తక్షణభారం దించుకోవాలని అనుకున్నాడు. తాను వెంటనే దించుకోగలిగిన భారం ఏమిటంటే పిల్లలను వదిలించుకోవటమే అని ఇస్మాయిల్ భావించాడు. అందుకనే ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు పిల్లలను తీసుకుని పట్టణంలోనే ఉన్న చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళి అందులోకి తోసేశాడు. కొంతసేపు అక్కడే వెయిట్ చేశాడు. ఎందుకంటే చెరువులోకి తోసేసిన పిల్లలు ముగ్గురు చనిపోయారా లేదా అని నిర్ధారించుకునేందుకు. పిల్లలంతా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఏమీ తెలీనట్లే ఇంటికి వెళ్ళి భార్యతో కలిసి పిల్లలతో కలిసి వెతుకుతున్నట్లు నటిస్తు, ఫిర్యాదు కూడా చేశాడు.
పోలీసుల విచారణలో తానే పిల్లలను చంపినట్లు బయటపెట్టడంతో వెంటనే పోలీసులు చెరువు దగ్గరకు వెళ్ళి పిల్లల మృతదేహాలను బయటకు తీసి కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

