
పులి సంచారంతో అటవీగ్రామాల్లో భయం (ఫొటో కర్టసీ : అటవీశాఖ కెమెరాట్రాప్ చిత్రం)
అటవీ గ్రామాల్లో ఆందోళన: పులి,చిరుతల సంచారంతో ప్రజల్లో భయాందోళనలు
తెలంగాణ అటవీ గ్రామాల్లో రెడ్ అలర్ట్
తెలంగాణ అటవీ గ్రామాల్లో ఈ వేసవిలో భయ వాతావరణం నెలకొంది. అడవుల నుంచి బయటకు వస్తున్న పులులు, చిరుతలు గ్రామాలకే చేరుకుని పశువులపై దాడులు చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నీటి కొరత, అడవుల తగ్గుదల కారణంగా వన్యప్రాణులు మనుషుల నివాసాల వైపు రావడంతో మనిషి-వన్యప్రాణి మధ్య సంఘర్షణ రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని అటవీ గ్రామాల్లో ఈ వేసవికాలంలో అలజడి ఏర్పడింది. ఒక వైపు పులి అటవీగ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, దూడలను చంపుతోంది. మరో వైపు చిరుతపులులు కూడా అటవీ గ్రామాల్లోకి వచ్చి ఆవులపై దాడులు చేస్తున్నాయి. పులి, చిరుతల సంచారం పెరగడంతో అటవీ గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
పశువులపై చిరుత దాడి
జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బంగారుపల్లి గ్రామంలోని పశువుల కొట్టంపై చిరుతపులి దాడి చేసింది. పశువుల కొట్టంలోని పశువులపై చిరుత దాడి చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిరుతపులి ఓ ఆవును చంపడంతో అటవీశాఖ అధికారులు చిరుతల సంచారాన్ని నివారించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు చిరుత పులుల పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారే కానీ ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదంటూ బంగారుపల్లి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరుతల సంచారంతో ఆందోళన
తెలంగాణలోని అటవీగ్రామాల్లో జనవాసాల సమీపంలో తరచూ చిరుతలు సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతం తగ్గుతుండటంతోపాటు ఈ వేసవిలో అడవిలో తాగేందుకు నీరు లేక చిరుతలు గ్రామాల వైపు తరలివస్తున్నాయి.దీంతో పులులు, చిరుతలు, మనుషుల మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది.తెలంగాణలోని అటవీ ప్రాంతంలో నుంచి వెళుతున్న జాతీయ రహదారులపై దాటుతున్న చిరుతల వీడియోలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తగ్గిపోతున్న అడవులతో వన్యప్రాణులు అటవీ గ్రామాల బాట పడుతున్నాయి. తెలంగాణలోహైవేలు, అటవీ గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల సమీపంలో చిరుతలు, పులులు కనిపించడం సర్వసాధారణమైపోయింది.
జాతీయ రహదారిపై చిరుత ప్రత్యక్షం
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ అర్ధరాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గ ప్రాంతంలో జాతీయ రహదారి-161 హైవేను దాటుతూ ఒక చిరుతపులి కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి ఉలిక్కిపడిన బాటసారులు, ఆ చిరుతను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.కదులుతున్న వాహనం నుంచి చిత్రీకరించిన ఈ ఫుటేజ్‌లో చిరుతపులి రోడ్డు పక్కన ఉన్న కంచెపై నుంచి దూకడం కనిపించింది. కొన్ని క్షణాల్లోనే చిరుతపులి వెనక్కి తిరిగి అడవిలోకి అదృశ్యమైంది. ఇది ఒక్కచోట జరిగిన ఘటన కాదు. తెలంగాణలోని జాతీయ రహదారులు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల సమీపంలో చిరుతపులులు, పులులు కనిపించడం సర్వసాధారణం అయిపోయింది.
75 రోజులుగా పులి సంచారం
మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వలస వచ్చిన పులి 75 రోజులు అయినా వైల్డ్ లైఫ్ అధికారులు దాన్ని పట్టుకోలేక పోయారు. తాడోబా నుంచి కవ్వాలకు వచ్చిన పులి మొదట యాదాద్రి-భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత జనగాం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల మీదుగా ప్రయాణిస్తూ ఆందోళన కలిగిస్తోంది. బోనులు ,ట్రాప్ కెమెరాలను అమర్చినా అటవీ అధికారులు పులిని పట్టుకోలేకపోయారు. తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన అటవీశాఖ అధికారుల బృందాలు,పూణే నుంచి వచ్చిన ఒక ప్రత్యేక బృందంతో సహా హైదరాబాద్ టైగర్ కన్జరేషన్ సొసైటీ వాలంటీర్లు ఈ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఇప్పటికే ఆవులను, దూడలను చంపడంతో గ్రామస్థుల్లో భయం పెరిగింది. పులి కనిపించినా లేదా దాని పాదముద్రలు కనిపించినా వెంటనే అటవీశాఖ తమకు తెలియజేయాలని అధికారులు కోరారు.వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి.
బాన్స్‌వాడ అడవిలో చిరుత మృతి
కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ మండలంలోని హన్మాజీపేట గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం వెలుగుచూసింది.చిరుతను వేటగాళ్లు చంపారని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శివార్లలో చిరుతపులి దాడిలో కుక్క మృతి చెందింది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులి ప్రత్యక్షం
అంతర్జాతీయ అటవీ దినోత్సవం రోజే అమ్రాబాద్ సఫారీ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు పులి కనిపించింది. హైదరాబాద్ నగరం నుంచి కేవలం 3 గంటల దూరంలో ఉన్న పులులు,వన్యప్రాణులతో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు పులి వాగులో నీళ్లు తాగుతూ కనిపించింది. పులి అడవిలో నీళ్లు తాగి కాలిబాటలో కొంత దూరం వెళ్లింది. అమ్రాబాద్ అడవిలో పర్యాటకులకు పులి కనిపించడంతో వారంతా కేరింతలు కొట్టారు.
రూ.875 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక
తెలంగాణలోని కవాల, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.875 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. పులుల పరిరక్షించడంతో పాటు సఫారీ జోన్ల ద్వారా టైగర్ టూరిజాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కవ్వాల పులుల అభయారణ్యం పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 2,015.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో అభయారణ్యం విస్తరించి ఉంది. కవాల అభయారణ్యం పొరుగున ఉన్న మహారాష్ట్ర లోని తాడోబా, అంధేరి టైగర్ రిజర్వులు, ఛత్తీస్ ఘడ్ లోని ఇంద్రావతి అభయారణ్యం పరిధిలోని కారిడార్ లో ఏడు పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరో వైపు నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ అభయారణ్యంలోనూ పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండు అభయారణ్యాల్లోనూ టైగర్ సఫారీలతోపాటు బర్డ్ వాచింగ్ ట్రైల్స్ , వ్యూపాయింట్లను అభివృద్ధి చేయనున్నారు.
అడవులు క్షీణించడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు గ్రామాల బాట పడుతున్న పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.తెలంగాణలో పులి, చిరుతల సంచారం పెరుగుతుండటంతో అటవీ గ్రామాల్లో ప్రజల భయం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, పశువుల రక్షణకు అటవీశాఖ తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం అత్యవసరంగా కనిపిస్తోంది.
Next Story

