
పావురానికి మాంజా దారం చుట్టుకున్న చిత్రం
ఆకాశంలో పండుగ కాదు… పక్షులకు ప్రాణసంకటమే
గాలిపటాల వెనుక దాగిన విషాదం… విలవిలలాడిన పక్షులు
సంక్రాంతి సంబరాల మధ్య గాలిపటాల మోజు పక్షులకు మృత్యుపాశంగా మారింది. చైనా మాంజా ఉచ్చులో చిక్కిన అమాయక పక్షులు విలవిలలాడుతుండగా, నగరంలో మానవత్వం చాటుకున్న పక్షిప్రేమికులు గాయపడిన పక్షుల ప్రాణాలు కాపాడారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను మాంజాతో ఎగురవేస్తుండటంతో అవి మనుషులనే కాకుండా పక్షుల పాలిట మృత్యువుగా మారాయి. హైదరాబాద్ నగరంలో మాంజాకు చిక్కి విలవిలలాడిన పక్షులకు కొందరు పక్షిప్రేమికులు కాపాడారు. మాంజా దారం చిక్కుకొని విలవిలలాడుతున్న పక్షులను పట్టుకొని వాటి మాంజాను కత్తిరించి పక్షులకు ప్రాణం పోశారు. నగరంలో పలు చోట్ల పక్షులను మాంజా మృత్యుమార్గం నుంచి కొందరు పక్షిప్రేమికులు కాపాడారు.
చైనా మాంజా వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో పావురాళ్లు, ఇతర పక్షులు తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగుచూశాయి. ప్లాస్టిక్, గాజుపొడి, ఇతర రసాయనాలతో తయారు చేసిన చైనా మాంజా పక్షుల ప్రాణాలను తీస్తున్నాయి. నైలాన్ మాంజా ఉచ్చులో పక్షుల రెక్కలు, కాళ్లు, మెడ ఇరుక్కొవడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి.
బాతును కాపాడిన హైడ్రా
జవహర్ నగర్ లోని యాప్రాల్ చెరువులో ఓ బాతుకు చైనా మాంజా వలలో చిక్కుకొని విలవిలలాడుతుండటం వాకర్లకు కనిపించింది. దీంతో వారు వెంటనే హైడ్రా సిబ్బందికి ఫోన్ చేశారు.దీంతో హైడ్రాకు చెందిన 8మంది సిబ్బంది ఎయిర్ బోట్ తీసుకొని వచ్చి చెరువు లోపలకు వెళ్లి బాతును పట్టుకొని దాని శరీరానికి చుట్టుకున్న మాంజాను తొలగించారు. దీంతో బాతును చెరువులో వదిలివేశారు. నగర శివారు ప్రాంతంలో మాంజా దారం చుట్టుకోవడంతో పావురం రెక్కకు గాయాలై విలవిలలాడింది. ఓ విద్యార్థి దాన్ని గమనించి పావురానికి చుట్టుకున్న మాంజాను తొలగించి, గాయానికి మందు రాసి, ఆహారం అందించి దాన్ని కాపాడాడు.
యనిమల్స్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రదీప్ అనే యువకుడు యనిమల్స్ నర్జర్వేషన్ సొసైటీని ఏర్పాటు చేసి పక్షులు, జంతువులను కాపాడుతున్నాడు. ఈ సంక్రాంతి సందర్భంగా మాంజాకు చిక్కి విలవిలలాడుతున్న 130 పక్షులు, గద్దలను ప్రదీప్ రక్షించారు. అమీన్ పూర్ చెరువులో ఓ హంస నోటికి మాంజా చిక్కుకోవడంతో దాన్ని తొలగించి కాపాడారు. గురువారం హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీసుస్టేషన్ వద్ద ఓ పావురానికి మాంజా చుట్టుముట్టడంతో అల్లాడుతుండగా చూసిన స్థానిక హోంగార్డు దాన్ని పట్టుకొని మాంజాను కట్ చేసి పావురాన్ని కాపాడారు. హైదరాబాద్ నగరంలోని బ్లూ క్రాస్ వాలంటీర్లు కూడా మాంజా చిక్కుల నుంచి పక్షులను కాపాడారు. మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేందుకు వాడిన మాంజా తగిలి పలు పక్షులు గాయపడ్డాయని, వాటికి తమ వాలంటీర్లు మాంజాను తొలగించి, గాయపడిన వాటికి చికిత్స చేసి వాటిని కాపాడుతున్నామని యనిమల్ వారియర్స్ వాలంటీర్లు చెప్పారు. మాంజా తగిలి పక్షులు తీవ్రంగా గాయపడి రక్తం కోల్పోవడం వల్ల మరణించాయని ఓ వాలంటీర్ చెప్పారు. తమకు ఈ ఏడాది గాయపడిన పక్షుల సంఖ్య పెరిగిందని, తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే తమ వాలంటీర్లు వెళ్లి వాటిని కాపాడుతున్నామని యనిమల్ వారియర్స్ సొసైటీ వాలంటీర్ చెప్పారు.
పక్షులను కాపాడండి : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజాతో గాలి పటాలు ఎగురవేసి పక్షుల ప్రాణాలు తీయవద్దని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలను కోరారు. పండుగ సందర్భంగా ఎంపీ కొండా తన ఇంటి పరిసరాల్లో బర్గ్ వాక్ చేశారు. తాను మెర్లిన్ బర్డ్ ఐడి యాప్‌ని ఉపయోగించి పక్షుల శబ్దాలను రికార్డ్ చేశానని, పలు జాతుల పక్షులను చూశానని చెప్పారు. కాలుష్యం, ట్రాఫిక్, ఆవాసాల నష్టం ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇన్ని పక్షులు ఉండటం చూసి తాను ఆనందంతో ఆశ్చర్యపోయానని కొండా ఎక్స్ పోస్టులో తెలిపారు. పావురాలు, డేగలు, చిలుకలు ఆకాశంలో ఎగిరే పక్షులు ఎక్కువగా మాంజా ప్రమాదానికి గురవుతున్నాయని చెప్పారు.
సంక్రాంతి పండుగ ఆనందం మనకే కాదు… ఆకాశంలో ఎగిరే అమాయక పక్షులకు కూడా ఉండాలి. క్షణిక సరదా కోసం వాడే చైనా మాంజా ఎన్నో పక్షుల ప్రాణాలను హరించేస్తోంది. ఇప్పటికైనా నిషేధిత మాంజాను పూర్తిగా వదిలిపెట్టి, పక్షులకు సురక్షితమైన దారంతోనే గాలిపటాలు ఎగురవేస్తేనే మన సంక్రాంతి నిజమైన పండుగగా నిలుస్తుంది.
Next Story

