
కూకట్‌పల్లిలో భారీ ప్రమాదం..
సిలెండర్లు రీఫిల్ చేస్తుండగా జరిగిన మంటలు
కూకట్పల్లి బాలానగర్ వై జంక్షన్ పరిధిలోని ప్రశాంత్ నగర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసు సమీపంలో ఉన్న ఒక గ్యాస్ షాపులో సిలిండర్లు వరుసగా పేలుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్ద గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ ఎక్కించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒకటి తరువాత ఒకటిగా భారీ శబ్దాలతో పేలుళ్లు జరగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
అరగంటకు పైగా పేలుళ్లు కొనసాగుతున్నాయని అక్కడి వారు చెబుతున్నారు. పేలుళ్ల శబ్దాలకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరు ఉన్నారన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. గాయపడిన వారి సంఖ్యపై లేదా ప్రాణనష్టం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కారణంగా జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది.

