Nampally Forensic lab fire accident
x

ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం: మంటలు చెలరేగింది అక్కడి నుంచే !

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీజ్డ్ ప్రాపర్టీ గదిలో ఉన్న కీలక ఆధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.


నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సీజ్డ్ ప్రాపర్టీ పూర్తిగా నాశనమైందని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే కీలక ఆధారాల నష్టం తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు. శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ గదిలో మంటలు చెలరేగాయి.

ఆ గదిలో నిల్వ చేసిన వస్తువులన్నీ కాలిపోయినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ వెల్లడించారు. గది పూర్తిగా దగ్ధమై ఏ వస్తువూ రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వివిధ కేసులకు సంబంధించిన భౌతిక ఆధారాలు బూడిదగా మారినట్లు అధికారులు చెప్పారు. అనేక దర్యాప్తులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ అగ్నిప్రమాదంలో నశించాయి.

సుమారు 40 నుంచి 50 వరకు కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. మరో గదిలో ఉంచిన హార్డ్ డిస్కులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులు వేగంగా మండడంతో మంటలు మరింత వ్యాపించినట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ల్యాబ్ సిబ్బంది తొలుత మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, పొగ పెరగడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఈ ఘటన సమయంలో భవనంలో ఉన్న నలుగురు ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి సమాచారం ఇచ్చిన ఆఫీస్ బాయ్ అస్వస్థతకు గురికావడంతో అతన్ని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. మంటలు సీజ్డ్ ప్రాపర్టీ గదికే పరిమితం కావడం పలు ప్రశ్నలకు దారితీసింది.

రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు ఈ గదిలోనే ఉండటంతో నష్టం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా లేదా పాక్షికంగా మిగిలాయా అన్న అంశాన్ని సాంకేతికంగా పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

Read More
Next Story