తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు
తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది శాంతి స్వరూప్. చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్, ఇక లేరు.
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రాణాలు విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని డీడీ కాలనీలోని స్వగృహానికి తరలిస్తున్నారు. శాంతి స్వరూప్ కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలుగు భాషలో మొదటి టెలివిజన్ వ్యాఖ్యాత శాంతి స్వరూప్. దూరదర్శన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయనే. పదేళ్ళపాటు టెలీ ప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చదివారాయన. స్పష్టమైన ఉచ్ఛారణ, ఆకట్టుకునే స్వరం శాంతి స్వరూప్ సొంతం.
జీవన, సాహిత్య సారాన్ని అవపోసన పట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.
పేరుకు తగ్గట్టుగా మాటల్లో చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే. వార్తలు సమాచారం జాబులు, జవాబులు, ధర్మ సందేహాలు కార్యక్రమం.. ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర'శాంతం'గా చొచ్చుకుపోయేలా చేశారు.
నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..
బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు ప్రారంభించారు..
తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి.
దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం.
వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్, ఇక లేరు.