కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
x

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

‘మిషన్-2026’లో భాగంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్. కేజీహెచ్-2 వ్యూహాత్మక చర్యగా కొనసాగుతోంది.


ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మృతుల వివరాలను అధికారవర్గాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ‘నక్సల్స్ మిషన్-2026’లో భాగంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు రెండు రోజుల క్రితం ‘కేజీహెచ్-2’ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. కర్రెగుట్టల పరిసరాల్లో 2 వేల మందితో కూడిన బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.

దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా 2024లోనే భారీ స్థాయి ఆపరేషన్‌లను ప్రారంభించింది. గత ఏడాది ఏప్రిల్‌లో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, సీఏఎఫ్ సంయుక్త బలగాలు 21 రోజుల పాటు కర్రెగుట్టల్లో ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే పార్టీ సీనియర్ క్యాడర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తడపల, పామునూరు, మురుమూరు, డోలీ ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ప్రారంభమైన ‘కేజీహెచ్-2’ను కూడా అత్యంత వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితులపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story