
మంటల్లో ఐదుగురు సజీవదహనం, ఫలించని ప్రార్ధనలు
శనివారం మధ్యాహ్నం మంటల్లో చిక్కుకున్న ఐదుగురు ఆదివారం ఉదయానికి కాలిబూడిదగా కనిపించారు
ప్రమాదంలో చిక్కుక్కున్నవాళ్ళంతా క్షేమంగా ఉండాలని ఎంతమంది మొక్కుకున్నారో. మంటల్లో చిక్కుక్కున్న ఐదుగురు ప్రాణాలతో బతికి బయటపడాలని తల్లి, దండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు ఎంత వేడుకున్నా ఉపయోగం కనబడలేదు. శనివారం మధ్యాహ్నం మంటల్లో చిక్కుకున్న ఐదుగురు ఆదివారం ఉదయానికి కాలిబూడిదగా మారిపోయారు. మంటల్లోనే అందరు సజీవదహనమైపోయారు. శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని ఒక ఫర్నీచర్ షాపు కింది అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు నాలుగో అంతస్తువరకు పాకాయి. అలాగే మొదటి అంతస్తుకు కింద ఉన్న రెండు సెల్లార్లలో కూడా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోగానే షాపులో పనిచేస్తున్న 22 మంది బయటకు పరిగిత్తారు. కాసేపటికి సెల్లారులో ఇద్దరు పిల్లలతో పాటు ముగ్గురు పెద్దవాళ్ళుండిపోయారని గుర్తించారు.
మంటలను ఒకవైపు ఆర్పే ప్రయత్నాలు చేసిన ఫైర్ ఫైటర్లు మరోవైపు సెల్లార్లో ఇరుక్కుపోయిన ఐదుగురిని రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ఎంతప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఫైర్ యాక్సిండ్ విషయం తెలియగానే అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బృందాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. పై శాఖల సిబ్బంది దాదాపు 20 గంటలు ప్రయత్నించినా ఉపయోగంలేకపోయింది. మంటలను అయితే ఆర్పగలిగారు కాని పొగను మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు.
ఎందుకంటే సెల్లారులోనే ఫర్నీచర్ గోడౌన్, ఫర్నీచర్ తయారీ, రిపేర్లకు ఉపయోగించే సామగ్రి, రశాయనాలు, వార్నిష్ తదితరాలన్నీ నిల్వ చేశారు. మంటలకు ఇవన్నీ ఒక్కసారిగా అంటుకుని గంటలపాటు మండతునే ఉన్నాయి. అతికష్టంమీద మంటలను ఆర్పగలిగినా పొగను మాత్రం కంట్రోల్ చేయలేకపోవటంతో సెల్లారులో ఎవరు ఎక్కడున్నారో కూడా బయటవాళ్ళు కనిపెట్టలేకపోయారు. చివరకు ఆదివారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పొగను కంట్రోల్లోకి తెచ్చారు. అప్పుడు లోపలకు వెళ్ళి వెతకగా మంటల్లో కాలి బూడిదగా మారిన ఐదు మృతదేహాలు కనిపించాయి. మృతులను వాచ్ మెన్ దంపతుల ఇద్దరు పిల్లలు ప్రణీత్(11), అఖిల్(7), మహ్మద్ ఇంతియాజ్(27), సయ్యద్ హబీబ్(40), బీబీ(55)గా ఫర్నీచర్ షాపులో పనిచేసేవారు గుర్తించారు.
835 ప్రమాదాలు
అగ్నిప్రమాదాలు జరగటం ఇదేమో మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోయారు. అగ్నిప్రమాదం జరిగినపుడల్లా అధికారులు హడావుడి చేయటం, షాపులను, మాల్సును తనిఖీలు చేయటం కొన్నింటికి జరిమానాలు విధించటంతో హడావుడి ముగిసిపోతుంది. తర్వాత మళ్ళీ మామూలే. వ్యాపారసంస్ధలు, మాల్స్, హోటళ్ళ లాంటి వాటిల్లో ప్రమాదాలు జరిగినపుడు తప్పించుకునేందుకు మార్గాలు ఎన్ని ఉండాలనే విషయంలో నిబంధనలను చాలావరకు పాటించటంలేదు. ఆ విషయాలు తెలిసినా అధికారులు కూడా చూసీచూడనట్లు ఉండటంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడచిన ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే సుమారు 835 అగ్ని ప్రమాదాలు జరిగాయి.
గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది సజీవదహనమయ్యారు. టాటానగర్ లోని ప్లాస్టిక్ గోడౌన్లో, కూకట్ పల్లి దుకాణంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 50 మంది చనిపోయారు. మూడేళ్ళ క్రితం బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాము ప్రమాదంలో 9 మంది మరణించారు. నాలుగేళ్ళ క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారు.

