
తెరుచుకున్న గల్ఫ్ గగనతలం.. ఇండియాకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
ఊపిరి పీల్చుకున్న భారతీయ ప్రయాణికులు
దుబాయ్, అబుదాబి నుంచి భారతదేశానికి విమాన కార్యకలాపాలు సోమవారం రాత్రి (మార్చి 2) తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరుకు సర్వీసులు పున: ప్రారంభమయ్యాయి.
అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానాలు ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరుకు మార్చి 2న చేరుకున్నాయి. ఎమిరేట్స్ విమానయాన సంస్థ మార్చి 2, 3 తేదీల్లో దుబాయ్ నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లకు కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న ప్రయాణీకులను తిరిగి తీసుకురావడానికి అనేక విమానయాన సంస్థలు విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించాయి.
ఉద్రిక్త క్షణాలను గుర్తుచేసుకుంటూ..
మంగళవారం (మార్చి 3) తెల్లవారుజామున దుబాయ్ నుంచి బయలుదేరిన విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు తమ అనుభవాలను పంచుకున్నారు. “ మాకు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రాణాలతో మిగులుతామా? అను అనుమానం కలిగింది. చివరకు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాం” అని పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లో సర్వీసులు నడిపిన ఎతిహాద్ ఎయిర్‌వేస్, భారత ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
చిక్కుకుపోయిన ప్రయాణీకులను తిరిగి తీసుకురావడానికి యుఎఈలోని ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు నాలుగు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పటివరకు మొత్తం 36 బయలుదేరే విమానాలు, 44 రాకపోకల సర్వీసులను రద్దు చేశారు. బెంగళూరులో 44 విమానాలు, కోల్‌కతా విమానాశ్రయంలో 10 విమానాలు రద్దయ్యాయి.

