
తెలంగాణలో కల్తీ ఆహార ముఠాలు.. వరుసగా బయటపడుతున్న కేసులు
హైదరాబాద్ సహా తెలంగాణలో నూనె, నెయ్యి, టీ, పేస్ట్‌ల కల్తీ కేసులు వరుసగా బయటపడుతున్నాయి. పలు దాడుల్లో భారీగా సరుకులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.
తెలంగాణలో కల్తీ ఆహార పదార్థాల కేసులు వరుగా వెలుగుచూస్తున్నాయి. ఇది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఒకదాని తర్వాత ఒకటిగా కల్తీ ఆహార పదార్థాలల కేసులు బయటపడుతుండటం కీలకంగా మారుతోంది. తాజాగా గచ్చిబౌలిలో కల్తీ వంట నూనె, గోధుమ పిండి తయారీ ముఠా బట్టబయలైంది. సోమవారం మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి తండ్రీ–కొడుకులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో నగరంలో కల్తీ ఆహారంపై మళ్లీ చర్చ మొదలైంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ దుకాణంపై ఎస్వోటీ పోలీసులు రైడ్ నిర్వహించారు. తనిఖీల్లో అక్కడ కల్తీ ఆహార పదార్థాల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు.
5,192 కిలోల గోధుమ పిండి సీజ్
దర్యాప్తులో గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి కొత్త నూనెగా తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఆ నూనెను ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి ‘జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా’ పేరుతో తిరిగి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నట్లు వెల్లడైంది. దాడుల్లో సుమారు 10 లక్షల రూపాయల విలువైన 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, అలాగే 3 లక్షల రూపాయల విలువైన 5,192 కిలోల గోధుమ పిండి స్వాధీనం అయ్యాయి.
వెయిటింగ్ మెషిన్, ఆయిల్ ఫిల్టర్ మెషిన్, గోధుమ ఫిల్టర్ మెషిన్ సహా ఇతర సామాగ్రిని కూడా సీజ్ చేశారు. మొత్తం స్వాధీనం చేసిన వస్తువుల విలువ సుమారు 21 లక్షల రూపాయలుగా అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన భన్వర్ రామ్ జాట్ , అతని కుమారుడు అశోక్ కుమార్‌ను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి యూనిట్
ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం బయటపడింది. ఆ రైడ్‌లో 460 కిలోల కల్తీ నెయ్యితో పాటు భారీగా క్రీమ్ పదార్థాలు స్వాధీనం అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం పామ్ ఆయిల్, వనస్పతి నూనెలు కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ నెయ్యిని హోటళ్లు , ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దాడుల్లో 2,090 కిలోల గేదె క్రీమ్, 1,170 కిలోల ఎద్దు క్రీమ్, వనస్పతి టిన్లు , ప్యాకింగ్ సామాగ్రి కూడా పట్టుబడ్డాయి. స్వాధీనం చేసిన వస్తువుల విలువ సుమారు 18 లక్షల రూపాయలుగా అంచనా వేశారు.
నకిలీ టీ ప్యాకెట్ల ముఠా
సనత్‌నగర్, అఫ్జల్‌గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ టీ ప్యాకెట్ల ముఠా కూడా బయటపడింది. ఈ దాడుల్లో 10,000కు పైగా టీ ప్యాకెట్లు స్వాధీనం అయ్యాయి. తక్కువ నాణ్యత టీ డస్ట్‌తో పాటు కోకోపీట, రంగులు, బెల్లం నీరు కలిపి టీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్యాకెట్లను ప్రసిద్ధ బ్రాండ్ల మాదిరిగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది. బేగం బజార్, లోకల్ రిటైల్ మార్కెట్ల ద్వారా ఈ టీ ప్రధానంగా అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.
జల్పల్లిలో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్
హైదరాబాద్ జల్పల్లి ప్రాంతంలో మరో దాడిలో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ బయటపడింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో సుమారు 10 లక్షల రూపాయల విలువైన పేస్ట్ స్వాధీనం అయ్యింది. నాసిరకం అల్లం పేస్ట్, సింథటిక్ రంగులు ఉపయోగించి అస్వచ్ఛమైన పరిస్థితుల్లో ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పేస్ట్‌ను ఎస్కే రాయల్ ఎంటర్ప్రైెస్, షామి గోల్డ్ పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
నకిలీ డైరీ ఉత్పత్తుల కేసు
హైదరాబాద్‌లో మరో అక్రమ యూనిట్లో కల్తీ నెయ్యి , క్రీమ్ తయారీ కూడా బయటపడింది. ఆ దాడిలో 3,000 కిలోలకుపైగా కల్తీ డైరీ ఉత్పత్తులు స్వాధీనం అయ్యాయి. తక్కువ నాణ్యత పదార్థాలు కలిపి తయారు చేసిన ఈ ఉత్పత్తులను హోటళ్లు , మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 60 కిలోల స్వీట్లు, 40 కిలోల బ్రెడ్ సహా అనేక కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం అయ్యాయి. పాలు ఆధారిత స్వీట్లలో సింథటిక్ రంగులు, నాసిరకం నెయ్యి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పెరుగుతున్న కల్తీ కేసులు
ఇటీవలి నివేదికల ప్రకారం దేశంలోని పెద్ద నగరాల్లో ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని అధికారులు పేర్కొన్నారు. నమోదైన కేసుల్లో పెద్ద భాగం నగర ప్రాంతానికే చెందినవిగా వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కల్తీ ఆహార తయారీపై పోలీసులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దాడులు కొనసాగిస్తున్నారు.

