బీజేపీలోకి కేర‌ళ మాజీ సీఎం కూతురు.. కారణం అదేనా?
x

బీజేపీలోకి కేర‌ళ మాజీ సీఎం కూతురు.. కారణం అదేనా?

కేర‌ళ మాజీ సీఎం కూతురు పద్మజ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు. పార్టీలో తన ప్రాధాన్యాన్ని తగ్గించారని భావించి ఆమె కమలం పార్టీ చెంతకు చేరారా?


లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేరళలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి. తాజాగా దివంగత కాంగ్రెస్ అగ్రనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరుతున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ పార్టీలో చేరనున్నట్లు ఆమె మీడియాతో చెప్పారు.
కారణం అదేనా?
ప్ర‌స్తుతం పద్మజ కేర‌ళ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఆమె త‌ప్పుబడుతున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల ర్యాలీలో ప్రియాంకా గాంధీ వాహ‌నంలోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు. త‌న‌ను ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు భావిస్తున్నపద్మజ బీజేపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. త‌న తండ్రి కే క‌రుణాక‌ర‌న్‌కు స్మార‌కం నిర్మించ‌డంలో కాంగ్రెస్ స‌ర్కార్ జాప్యం చేయడం వల్ల బీజేపీలో చేరుతున్నారన్నది మరో కారణం.
మురళీధరన్ ఏమంటున్నారు?
కాంగ్రెస్ నేతల వైఖరే తనను బిజెపిలో చేరేలా చేసిందని పద్మజ అన్న వ్యాఖ్యలపై ఆమె సోదరుడు కె మురళీధరన్ స్పందించారు. తమ తండ్రి ఆత్మ “ఆమెను ఎప్పటికీ క్షమించదు” అని అన్నారు. "నేను నా సోదరితో అన్ని సంబంధాలను తెంచుకుంటాను. మత రాజకీయాలకు పాల్పడే వారితో తాను ఎలాంటి సంబంధం పెట్టుకోను. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నోటా కంటే వెనుకబడి పోతుంది’’ అని మురళీధరన్ మండిపడ్డారు.
‘‘ఆమెను పార్టీ ఎంతో గౌరవించింది. కాని ఆమె ఇప్పుడు ఎందుకిలా చేస్తుందో తెలియదు. నాతో మాట్లాడటం లేదు, నేను ఫోన్ చేసినా స్పందన లేదు. నా నంబర్‌ను బ్లాక్ చేసినట్లు అనిపిస్తుంది.’’ అన్నారు మురళీధరన్
మురళీధరన్ వ్యాఖ్యలపై పద్మజ స్పందిస్తూ.. తన సోదరుడు తనను ఎందుకు వదులుకోవాలనుకుంటున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నానని అన్నారు. కాంగ్రెస్‌ను వీడినా మురళీధరన్ నాకు సోదరుడే అని అన్నారు.
భర్త ప్రోత్సాహం..
రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా తన మద్దతు పద్మజకు ఉంటుందని భర్త డాక్టర్ వేణుగోపాల్ చెప్పారు. బలమైన నాయకత్వంతో ఉన్న చట్టబద్ధ రాజకీయ పార్టీ బీజేపీలో చేరడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. “ప్రస్తుతానికి ఏ ఆఫర్ కూడా టేబుల్‌పై లేదు. ఆమె ఇప్పుడే పార్టీలో చేరుతోంది” అని కొచ్చికి చెందిన సీనియర్ శిశువైద్యుడు చెప్పారు.
గ‌తంలో రెండుసార్లు పద్మజ త్రిసూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ముకుంద‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట‌మి చెందారు.
Read More
Next Story