Advocate Swapna
x

అడ్వకేట్ స్వప్న హత్య.. అన్న అరెస్ట్

మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. భూమి వివాదమే హత్యకు కారణమని నిర్ధారణ.


మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దారుణ హత్యకు పాల్పడ్డ స్వప్న సొంత అన్నతో పాటు మరో ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి పరిధిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక భూమి వివాదమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు.

సర్వే నంబర్ 339లోని నాలుగు ఎకరాల భూమిపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతోంది. అదే భూమికి సంబంధించి సర్వే ప్రక్రియ కోసం స్వప్న ఘటన జరిగిన రోజు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ముందుగానే పథకం ప్రకారం నిందితులు దాడికి పాల్పడ్డారు.

మొదట స్వప్నను కారుతో ఢీకొన్నారు. అనంతరం రాళ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. చివరగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర గాయాల కారణంగా స్వప్న ఘటన స్థలంలోనే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు ఇన్నోవా కారు, స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

A1 గోటికె రాజు – స్వప్న సొంత అన్న.

A2 ఎర్రోళ్ల సందీప్.

A3 వడ్డె వీరేశం.

A4 కావలి శివలింగం.

దర్యాప్తులో భాగంగా ఇన్నోవా కారు, స్కూటీ, నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా పోలీసులు సీజ్ చేశారు. భూమి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు స్పష్టంచేశారు. కేసుకు సంబంధించిన తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.

Read More
Next Story