
మహారాష్ట్రలో ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు నలుగురు మరణించారు. మృతులను తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. దేవాడ-సోండో సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతిచెందిన నలుగురూ మహిళలే.
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబ సభ్యులు వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.
దేవాడ–సోండో ప్రాంతానికి చేరుకున్న సమయంలో కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్, బంధువులు ఆఫ్జా బేగం, సహారా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చంద్రపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

