
పెళ్లి పేరిట మోసాలు
పెళ్లి పేరుతో మోసాలు : అమ్మాయిలూ జర జాగ్రత్త
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో వరుస పెళ్లి మోసాలపై ఆందోళన, పోలీసులు హెచ్చరిక
పెళ్లి పేరిట కొందరు యువకులు కొత్త మోసాలకు తెర లేపుతున్నారు. ప్రేమిస్తున్నానని నమ్మించి, తర్వాత పెళ్లి కోసం బంగారం, పెద్ద మొత్తపు డబ్బులు, వీసా ఫీజులు వంటి వివిధ కారణాలతో అమ్మాయిల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో యువతులు, వారి కుటుంబాలు పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
పెళ్లి పేరిట ఎన్నెన్నో మోసాలు
- ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పీర్జాదిగూడకు చెందిన ఓ యువతి నుంచి 13.5 గ్రాముల బంగారం తీసుకొని మోసగించిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతితో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గుణాకర్ గౌడ్ మోసగించినా బాగోతం తాజాగా వెలుగుచూసింది.
- సైదాబాద్ వినయ్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళను పెళ్లాడుతానంటూ హిరాద్ అహ్మద్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను యూకేలో డాక్టరునంటూ పరిచయం చేసుకొని, వీసా పంపిస్తానని చెప్పి వీసా ఫీజు, లేట్ చార్జీలు, హోటల్ స్టే అంటూ మహిళ నుంచి రూ.3.38 లక్షలు స్వాహా చేశాడు. మోసపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- కొల్లిపర మండడలం కొత్తూరు లంకకు చెందిన వంశీ మ్యాట్రిమోనీ ద్వారా తెనాలికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనకు టిప్పర్లు, ట్రాక్టర్లు ఉన్నాయని, తాను మైనింగ్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించాడు. టిప్పరు కొంటున్నానని చెప్పి యువతి నుంచి రూ.12.20 లక్షలు తీసుకొని మోసగించాడు.
మోసం జరుగుతున్న తీరు ఇదీ..
కొందరు మోసగాళ్లు ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లే కదా.. ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒత్తిడితో శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు.
పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.
పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలి
‘‘నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలి’’ అని సీపీ సజ్జనార్ కోరారు.
అమ్మాయిలూ.. జాగ్రత్త!
‘‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించండి, ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి.మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి’’అంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించండి
పెళ్లి వంటి వ్యక్తిగత, భావోద్వేగ సంబంధాల్లో నమ్మకానికి పెద్ద స్థానం ఉంటుంది, కానీ ఆధునిక మోసగాళ్ల వ్యూహాలు రోజురోజుకూ మారుతున్నాయి. అందుకే పోలీసుఅధికారులు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story

