
తెలంగాణలో ఉచిత హెచ్‌పీవీ టీకా డ్రైవ్ ప్రారంభం
14–15 ఏళ్ల బాలికలకు మూడు నెలల కార్యక్రమం. గర్డాసిల్ టీకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యం.
మహిళల ప్రాణాలను హరిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కింగ్ కోటి ఆసుపత్రిలో ఈ డ్రైవ్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఇది మూడు నెలల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 3.5 నుంచి 4 లక్షల బాలికలకు టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొదటి నెలలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకా అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనుంది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్క డోసుకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చయ్యే ‘గర్డాసిల్’ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 55 వేల నుంచి 60 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 10 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనాలను ప్రస్తావించారు. మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉన్న సర్వైకల్ క్యాన్సర్‌తో ఏటా సుమారు 3,200 మంది మహిళలు ప్రభావితమవుతున్నారని వివరించారు.
ఈ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 99.7 శాతం హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వస్తున్నాయని చెప్పారు. అందుకే వైరస్ నియంత్రణ కోసం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. క్యాన్సర్ వైద్య సేవలను హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ములుగు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.
అర్హులైన బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యం, రాష్ట్ర భవిష్యత్తు రక్షణ లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలల పాటు టీకా కార్యక్రమం నిరంతరంగా కొనసాగనుంది.

