
పీడీఎస్ ఉచిత బియ్యం పంపిణీ
ధనిక జిల్లాల్లోనూ ఉచిత బియ్యం: 98శాతం కుటుంబాలకు కార్డులు!
అర్హత లేకున్నా కార్డులు...బీపీఎల్ కుటుంబాల కంటే ఎక్కువ కార్డులు
పేదల కోసం రూపొందించిన ఉచిత బియ్యం పథకం తెలంగాణలో తన అసలు లక్ష్యాన్ని కోల్పోతుందా? సంపన్న జిల్లాలు, ధనిక గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీ అవుతూ అర్హత లేని వారు కూడా ఉచిత బియ్యం పొందుతున్నట్లు తాజా సర్వేలు బయటపెట్టాయి. దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాల్లో ఒకటైన రంగారెడ్డిలోనే 98 శాతం కుటుంబాలకు ఉచిత బియ్యం అందుతుండటం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని సంపన్న జిల్లాలు, సంపన్న గ్రామాల్లోనూ ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డులు జారీ చేసి వారికి ఉచితంగా బియ్యం అందిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్వేలో వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాల్లో ఒకటిగా నిలిచింది.అలాంటి రంగారెడ్డి జిల్లా జనాభా 24.46 లక్షలు. ఇందులో 42శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 58శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం గృహాల (కుటుంబాల) సంఖ్య 5.63 లక్షలు కాగా ఇందులో పని చేసే జనాభా 10.29 లక్షలు.ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 5,56,854 కుటుంబాలకు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీ చేశారు.రంగారెడ్డి జిల్లాలో 5.63 లక్షల కుటుంబాలకు గాను 5.56 లక్షల కుటుంబాలకు ఉచిత తెల్ల బియ్యం కార్డులు జారీ చేశారు.రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.12 లక్షలు కాగా ఉచిత బియ్యం నిర్దేశించిన ఆదాయం సీలింగు రూ. 2 లక్షలు.
దేశంలో అత్యంత ధనిక జిల్లా అయిన రంగారెడ్డిలోనూ 98.7శాతం ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.
అంకాపూర్ గ్రామంలోనూ అనర్హులకూ ఉచిత బియ్యం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం రాష్ట్రంలోనే అత్యంత సంపన్న గ్రామంగా గుర్తించారు. రైతులు పసుపు వంటి వాణిజ్య పంటలతో పాటు మూడు పంటలు పండిస్తున్నారు.అంకాపూర్ గ్రామంలో 300 నాలుగు చక్రాల వాహనాలు, 800 ద్వి చక్ర వాహనాలు, 30 ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్ ఉన్నాయి.గ్రామంలో ఎక్కువ ఇళ్లు రెండు అంతస్తుల భవనాలుగా ఉన్నాయి. ఆస్తి పన్ను కింద గ్రామస్థులు రూ.24,73,884రూపాయలు పంచాయితీకి చెల్లిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్వేలో తేలింది. మొత్తం 1804 కుటుంబాల్లో 1654 కుటుంబాలకు టీవీ కనెక్షన్లు ఉన్నాయి.సుమారు 326 మంది అమెరికా, యూరప్, గల్ఫ్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో పనిచేస్తూ, తమ తల్లిదండ్రులకు క్రమం తప్పకుండా భారీ మొత్తంగా డబ్బు పంపిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.
అంకాపూర్ గ్రామంలోని 1804 కుటుంబాల్లో 1225 కుటుంబాలు ఉచిత బియ్యం పొందుతున్నాయి.బి.పి.ఎల్. ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తే అంకాపూర్ గ్రామంలో గరిష్టంగా 300 కుటుంబాలకే అర్హత ఉంటుంది.
సంపన్న రాష్ట్రమైనా ఉచితం బియ్యం పంపిణీ
తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటి. కానీ సుమారు 85శాతం జనాభా పేదలుగా పరిగణిస్తూ ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఉచిత బియ్యం పొందుతున్నారని భారత ప్రభుత్వం పలుమార్లు సూచించి, వారిని తొలగించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హత లేని కార్డులను తొలగించే చర్యలు తీసుకోలేదు కానీ పైగా కొత్త కార్డులు నిరంతరం జారీ చేస్తున్నారు. పి.డి.ఎస్. కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
మార్గదర్శకాలకు విరుద్ధంగా...
తెలంగాణ ప్రభుత్వం ఉచిత బియ్యం పొందటానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డుల జారీకి అర్హతలను నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.ఆ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలకు తక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతాలలో రూ. 2 లక్షలకు తక్కువగా ఉండాలి.ఒక కుటుంబానికి 3.5 ఎకరాలకు మించని సాగు భూమి లేదా 7.5 ఎకరాలకు మించని మెట్ట భూమి ఉండాలి.మీడియాలో వస్తున్న అనేక వార్తల ప్రకారం అర్హత ప్రమాణాలు పాటించడం లేదని, ఎన్నికల లాభాల కోసం రాష్ట్రంలోని 85శాతం కుటుంబాలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
బీపీఎల్ జనాభా కంటే అధికంగా కార్డులు
వివిధ సర్వే నివేదికల ప్రకారం తెలంగాణలో దారిద్య్ర రేఖ కింద (బి.పి.ఎల్.) ఉన్న కుటుంబాలు మొత్తం జనాభాలో 20శాతం కన్నా తక్కువగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రభుత్వం 1.2 కోట్లు ప్రజలకు 54.67 లక్షల కార్డుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తోంది. భారత ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం రాష్ట్రంలోని బి.పి.ఎల్. కుటుంబాలందరికీ సరిపోతుంది. అయినప్పటికీ గత ప్రభుత్వం అదనంగా 35.28 లక్షల కార్డులు జారీ చేసింది. మళ్లీ ఈ ప్రభుత్వం 15.12 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసింది. ‘‘ రాష్ట్రంలోని మొత్తం కార్డుల సంఖ్య 105 లక్షలకు పెరిగింది. ప్రతి కుటుంబంలో సగటున నలుగురు జనాభా లెక్క వేసినా 420 లక్షల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ. ఈ విషయంపై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రికి లేఖ రాసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు’’అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి తెల్లరంగు రేషన్ కార్డులపై సమగ్ర దర్యాప్తు చేసి, ప్రజా నిధుల వృథాను నివారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి సీఎంకు లేఖ రాశారు.
పేదల సంక్షేమం కోసం రూపొందించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS)లో ఇలాంటి లోపాలు కొనసాగితే ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్హత లేని కార్డులను గుర్తించి తొలగించడం, పారదర్శకంగా వ్యవస్థను అమలు చేయడం అత్యవసరమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచిస్తోంది. లేదంటే సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన పేదలకు చేరకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Next Story

