
చౌమహల్లా ప్యాలెస్‌లో 8వ నిజాం ముకర్రం జా జీవితం గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న చేస్తున్న ప్రిన్స్ అజ్మత్ జా, రచయిత్రి అనురాథ
చరిత్ర నుంచి జ్ఞాపకాల వరకు: 8వ నిజాం ముకర్రం జాపై అరుదైన పుస్తకం
చౌమహల్లా ప్యాలెస్‌లో 8వ నిజాం ముకర్రం జా జీవిత గ్రంథావిష్కరణ
హైదరాబాద్ అసఫ్‌జాహీ చరిత్రలో కీలక స్థానాన్ని పొందిన 8వ నిజాం నవాబు మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్ జీవితాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన కొత్త పుస్తకాన్ని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆవిష్కరించారు. అరుదైన, ఇంతకుముందు వెలుగులోకి రాని ఛాయాచిత్రాలు, చారిత్రక పత్రాలు, వ్యక్తిగత జ్ఞాపకాలతో ఈ గ్రంథం అసఫ్ జాహీ వారసత్వాన్ని సజీవంగా నిలిపింది.అసఫ్ జాహీ వంశ చరిత్రలో చివరి అధ్యాయంగా నిలిచిన 8వ నిజాం నవాబు మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్ జీవితం ఇప్పుడు ఒక చారిత్రక గ్రంథంగా రూపుదిద్దుకుంది.
హైదరాబాద్ 8వ నిజాం నవాబు మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్ జీవితంపై కొత్త పుస్తకాన్ని చౌమహల్లా ప్యాలెస్ లో అసఫ జాహీ అధిపతి ప్రిన్స్ అజ్మత్ జా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పురావస్తు ఆర్కిటెక్ట్, రచయిత్రి అనురాధ ఎస్ నాయక్ రాశారు. ఈ పుస్తకంలో 8వ నిజాం నవాబు మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్ జీవితానికి సంబంధించిన అరుదైన, ఇంతకు ముందు చూడని ఛాయాచిత్రాలతోపాటు చారిత్రక పత్రాలు, వ్యక్తిగత జ్ఞాపకాలను పొందుపర్చారు. ఈ పుస్తకంలో ప్రచురించిన అరుదైన చిత్రాలను ముకర్రం జా సన్నిహిత కుటుంబసభ్యులు, చౌమహల్లాప్యాలెస్ నుంచి సేకరించానని అనురాధ ఎస్ నాయక్ చెప్పారు. ఈ పుస్తకంలోని పాత కుటుంబ ఛాయాచిత్రాలను అసఫ్ జాహీ కుటుంబ ప్రస్థుత అధిపతి అయిన ప్రిన్స్ అజ్మత్ జా తీశారని అనురాధ తెలిపారు. ఈ చారిత్రక పుస్తకాన్ని చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్ ప్రచురించింది.
8వ నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ జీవితంపై ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్ 8వ నిజాం నవాబు మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్ జీవితంపై ప్రత్యేక ప్రదర్శనను చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. ఎనిమిదవ నిజాం జయంతి సందర్శంగా ఈ ప్రదర్శనను తాము రూపొందించామని అనురాధ చెప్పారు. ఈ పుస్తకాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో పురానీహవేలీ ప్యాలెస్ లో ఉన్న ముకర్రం జా పాఠశాలలో విద్యార్థుల స్కాలర్ షిప్ స్కీములకు విరాళంగా ఇస్తామని చౌమహల్లా ట్రస్టు అధికారులు చెప్పారు. 1987వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ పాఠశాలలో 3వేలమంది బాల, బాలికలు చదువుతున్నారు.
నిజాం వారసుడిగా ముకర్రం జా ఎంపిక
1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లోని నైస్‌లో జన్మించిన ముకర్రం జా బెరార్ యువరాజు అయిన ప్రిన్స్ అజం జా చివరి ఒట్టోమన్ ఖలీఫా అబ్దుల్ మెజిద్ II కుమార్తె అయిన ప్రిన్సెస్ దుర్రు షెహ్వార్ల పెద్ద కుమారుడు.అతని తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతన్ని వారసుడిగా ఎంపిక చేశారు. ముకర్రంజాను 1967 ఏప్రిల్ 6వతేదీన హైదరాబాద్ నిజాంగా పట్టాభిషేకం చేశారు. 1971లో ప్రైవీ పర్సులు రద్దు చేసే వరకు ఇతను చివరి గుర్తింపు పొందిన నిజాంగా కొనసాగారు.ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ట్రస్టీ నవాబ్ ఎంఏ ఫైజ్ ఖాన్, రచయిత్రి అనురాధ నాయక్ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓయూ ప్రో-ఛాన్సలర్‌గా...
ముకర్రం జా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రో-ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.పురానీ హవేలీలో ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, ముకర్రం జా విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్‌తో సహా అనేక స్వచ్ఛంద సంస్థలను ముకర్రం జా స్థాపించారు.ఇతను 2023 జనవరి 14వతేదీన ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. దీంతో అతని పూర్వీకుల సమాధుల పక్కన మక్కా మసీదులో ముకర్రం జా మృతదేహాన్ని ఖననం చేశారు.
రాజ్యం లేని నిజాంగా చరిత్రలో నిలిచిపోయిన ముకర్రం జా బహదూర్ జీవితం ఈ పుస్తకం ద్వారా మరోసారి ప్రజల ముందుకు వచ్చింది. కాలం మారినా, అధికారాలు పోయినా, అసఫ్ జాహీ వారసత్వం మాత్రం జ్ఞాపకాలుగా, చరిత్రగా, ఈ తరాల మధ్య కొనసాగుతూనే ఉంటుంది.ఈ పుస్తకం ద్వారా 8వ నిజాం ముకర్రం జా బహదూర్ జీవితం, అసఫ్ జాహీ వంశ చరిత్రను కొత్త తరానికి పరిచయం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.చౌమహల్లా గోడల మధ్య నిలిచిన జ్ఞాపకాలు, పుటల రూపంలో మళ్లీ శ్వాస తీసుకుంటున్నాయి. 8వ నిజాం ముకర్రం జా బహదూర్ జీవితం ...ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఒక యుగానికి ముగింపు, మరో జ్ఞాపకానికి ఆరంభం.
Next Story

