
700 కొండలున్న సారంగా కీకారణ్యంలో మావోయిస్టుల కోసం కేంద్రబలగాల వేట
కర్రెగుట్టల నుంచి సారండా దాకా: మావోయిస్టుల కోసం కేంద్రబలగాల కుంబింగ్
‘ఆపరేషన్ కగార్’ వేగం: దండకారణ్యం సారండాలో వేట
- మావోయిస్టు పాలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సునిర్ మాల్, తెలంగాణకు రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ తన దళ సభ్యులతో కలిసి సారండా అడవుల్లో ఉన్నారని అందిన సమాచారంతో సీఆర్ పీఎఫ్, డీఆర్ జీ, కేంద్ర బలగాలు వారి కోసం గాలింపు చేపట్టాయి. అడవిలోని కొండలు, గుట్టలపై కేంద్రబలగాలు కాలినడకన కుంబింగ్ చేస్తున్నాయి.
- దేశంలో మావోయిస్టులను మట్టుపెట్టేందుకు ‘మావోయిస్టు విముక్త్ భారత్’ పేరిట కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. ఈ గడువు మార్చి 31వతేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మావోయిస్టుల కీలక స్థావరమైన దండకారణ్యంలోని అబూజ్‌మడ్. కర్రెగుట్టల నుంచి సారండా అడవుల దాకా గాలింపు చేపట్టాయి. తెలంగాణ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి మావోయిస్టు సభ్యులు మడవి అడిమి అలియాస్ సంగీత, బాడ్సె యంకా, పోడియం లక్ష్మీలు ఇంకా అడవుల్లోని దళంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
మావోయిస్టుల కోసం సారండా అడవుల్లో వేట
నాలుగు దశాబ్దాల తర్వాత కుటుంబాల కలయిక
తెలంగాణలో లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నాయకులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ,బడే చొక్కారావు అలియాస్ జగన్ మరియు నూనె నరసింహ రెడ్డి అలియాస్ గంగన్నలు వారి కుటుంబసభ్యులను కలిశారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందిన దేవ్ జీ 1982వ సంవత్సరం తర్వాత తొలిసారిగా తన కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన తమ్ముడు గంగాధర్, అతని కుమార్తెను కలిసి మాట్లాడారు. ‘‘నా అన్న తిరుపతి కుటుంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉంది, అయితే నలభై ఏళ్ల సమయం గడవడంతో మమ్మల్నిఅన్న గుర్తించలేకపోయాడు’’ అని దేవ్ జీ తమ్ముడు గంగాధర్ చెప్పారు. తన అన్న బంధువులు, పొరుగువారి గురించి ఆరా తీశారని ఆయన తెలిపారు. స్వస్థలంలో కుటుంబాన్ని సందర్శించి తన భవిష్యత్తు జీవితం గురించి చర్చిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. తాను ఆరోగ్య సమస్యల కారణంగా లొంగిపోయానని చట్టపరమైన చట్రంలో తన రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు దేవ్ జీ తెలిపారు.కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి, బడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహ రెడ్డి అలియాస్ గంగన్న కూడా తమ ఆయుధాలను విడిచిపెట్టారు.
‘‘నా అన్నకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆరోగ్యంగా కనిపించాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయనకు ఇప్పటికీ ఆసక్తి ఉంది’’అని గంగాధర్ వివరించారు.
దట్టమైన సారండా అడవి
గణపతి కోసం బంధువుల ఆరాటం
43 సంవత్సరాల నుంచి అజ్హాతంలో ఉన్న మావోయిస్టు అధినేత గణపతి కోసం తాము ఎదురు చూస్తున్నామని అతని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. గణపతి జనజీవన స్రవంతిలో కలిసి తమతో జీవితాంతం గడపాలని అతని సోదరుడు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించి ప్రస్తుతం వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని అతని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.గణపతి తిరిగి వచ్చి తమతో చేరాలని గ్రామం, కుటుంబం మొత్తం ఎదురు చూస్తుందని గణపతి సోదరుడు రామచంద్రరావు చెప్పారు. అదే సమయంలో, గణపతికి హాని కలిగించవద్దని రామచంద్రరావు పోలీసులను కోరారు.
గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు
అన్నా మీరు కూడా లొంగిపోవాలి : గణపతి సోదరుడు రామచంద్రరావు
తన సోదరుడు గణపతి నేపాల్‌లో ఉన్నాడని, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తనకు తెలిసిందని రామచంద్రరావు చెప్పారు. తన స్వస్థలం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని ఆయన సోదరుడు గణపతికి సలహా ఇచ్చాడు.43 సంవత్సరాలుగా ఆయన తిరిగి రావాలని తాము ఎదురుచూస్తున్నామని రామచంద్రారావు చెప్పారు.
“చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మీరు కూడా వచ్చి లొంగిపోవాలి” అని రామచంద్రరావు తన సోదరుడు గణపతికి సలహా ఇచ్చారు.
లొంగిపోయిన మావోయిస్టు నేతలతో డీజీపీ బి శివధర్ రెడ్డి (ఫొటో కర్టసీ : ఎక్స్ పోస్టు, డీజీపీ, తెలంగాణ)
వనాన్ని వీడి జనంలోకి రండి : డీజీపీ
‘‘తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2024వ సంవత్సరం నుంచి 591 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.మావోయిస్ట్ ఉద్యమం ఇక ముగింపు దశకు చేరుకుంది. నేను మరొకసారి పిలుపునిస్తున్నాను...వనాన్ని వీడి జనంలోకి రండి. మీ కుటుంబాలతో కలిసి మీ గ్రామాల్లో హాయిగా జీవించండి’’అంటూ తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
‘‘ఇప్పటికీ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు తలుపులు తెరిచి ఉన్నాయి. మీ కుటుంబాలతో తిరిగి కలవండి. తెలంగాణ పురోగతిలో భాగం అవ్వండి’’అని డీజీపీ కోరారు.
మావోయిజం అంతం కాదు : మాజీ ఎమ్మెల్యే చాడ వ్యాఖ్యలు
మావోయిస్టులను అంతం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కలలు కంటుందని, కానీ ఇది అసాధ్యమని పీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మావోయిస్టుల ఏరియవేతకు గడవు తేదీ పెట్టడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.నియంతృత్వ పాలనతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణచివేస్తుందని ఆయన ఆరోపించారు.
మొత్తానికి దండకారణ్యం కర్రెగుట్టల నుంచి సారండా దాకా సాగుతున్న ఈ కుంబింగ్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు...దశాబ్దాలుగా సాగుతున్న ఒక సిద్ధాంత పోరాటానికి చివరి అధ్యాయమా అన్న ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒకవైపు లొంగుబాట్లతో కుటుంబాలు మళ్లీ కలుస్తుండగా, మరోవైపు అరణ్యంలో ఇంకా మిగిలిన దళాల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. తుపాకీ మార్గమా, ప్రజాస్వామ్య మార్గమా అన్న దారి బాటలో కీలక మలుపు దగ్గర ఈ ఉద్యమం నిలిచినట్టే కనిపిస్తోంది. అరణ్యాల నిశ్శబ్దం శాశ్వతమవుతుందా, లేక మరోసారి ప్రతిధ్వనిస్తుందా అన్నది రాబోయే రోజులు తేల్చనున్నాయి.
Next Story

