
ప్రభుత్వ ఉద్యోగుల కార్లకు ఇక ఎలక్ట్రిక్ వాహనాలే..
కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల అధికారిక కార్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు కూడా ప్రాధాన్యం ఉంది. కానీ ఇకపై దానికి స్వస్తి చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. కేవలం ఈవీ (ఎలక్ట్రానిక్ వాహనాలు)లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 10న జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ శాఖలు కొత్తగా స్టాఫ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం ఒక్కో కారుకు గరిష్ఠ కొనుగోలు ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఈవీ తయారీదారులకు మరింత ఊహించని డిమాండ్ సృష్టిస్తుందని, వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంగా అందరూ భావిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ కార్లు పాతబడిపోయినప్పుడు లేదా వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
పాత వాహనాల స్థానంలో.. ఈవీలు..
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సంప్రదాయ ఇంధన కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అనుమతించింది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ కార్ల కొనుగోలుకు గరిష్ఠ ధర పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఎలక్ట్రిక్ కార్లకు ఈ పరిమితిని రెట్టింపు చేసి రూ.20 లక్షలకు పెంచింది.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ కొనుగోలు ధర ఎక్కువగా ఉండటంతో వాటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10న జారీ చేసిన ఒక కార్యాలయ మెమోరాండంలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న ఐసీఈ సిబ్బంది కార్లు పనికి రాకుండా పోయినప్పుడూ లేదా వాటిని మార్చవలసి ఉన్నప్పుడూ మాత్రమే వీటికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మార్పు వెనుక ప్రధానంగా రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి.. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం. రెండోది.. వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను తగ్గించి పట్టణాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం. ముఖ్యంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ కార్లతో భర్తీ చేయడం వల్ల కాలుష్య ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కూడా కొత్త అవకాశాలను కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు క్రమంగా తమ పాత వాహనాలను మార్చుకోవాల్సి రావడంతో ఎలక్ట్రిక్ కార్లకు స్థిరమైన డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా మార్కెట్లో ముందుగానే కొంత డిమాండ్ ఏర్పడితే వాహన తయారీ సంస్థలకు ఉత్పత్తి, పెట్టుబడుల ప్రణాళికలు రూపొందించుకోవడం సులభమవుతుంది.
అంతేకాదు, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగితే వాటికి అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు, వాహన నిర్వహణ సేవలు, ఫ్లీట్ ఆపరేటింగ్ సంస్థలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యుత్ ధరలు, వినియోగం, నిర్వహణ ఖర్చులను బట్టి దీర్ఘకాలంలో మొత్తం వ్యయం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
అయితే, ఇకపై పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోళ్లను పూర్తిగా నిషేధించినట్లు కాదు. ఏదైనా ప్రభుత్వ శాఖకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు లేదా వినియోగం ఆచరణ సాధ్యం కాదని భావిస్తే, అందుకు సరైన కారణాలను వివరిస్తూ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో పాటు ఆర్థిక సలహాదారు సమ్మతి కూడా తప్పనిసరి. ఆ తర్వాతే ఆర్థిక శాఖ ఆ ప్రతిపాదనను పరిశీలించి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. సంప్రదాయ ఇంధన వాహనాలను అద్దెకు తీసుకోవాల్సిన సందర్భాల్లోనూ ఇదే విధానం వర్తిస్తుంది.
నిజానికి ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నం ఇప్పుడే మొదలుకాలేదు. 2022 సెప్టెంబర్ 1న కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా కొనుగోళ్ల విషయంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆ విధానాన్ని మరింత విస్తరించింది.
అయితే, తాజా ఆదేశాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు కొనాలి, ఎప్పటిలోగా ప్రభుత్వ వాహనాలన్నింటినీ మార్చాలి అనే నిర్దిష్ట లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న కార్లను ఎప్పుడు మార్చాల్సి వస్తుంది, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ మోడళ్లు, ఛార్జింగ్ సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలపై ఈ విధానం అమలు ఆధారపడి ఉంటుంది.
మిగిలిన కొనుగోలు, అద్దె నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2017 నాటి జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారమే కొనుగోళ్లు జరగనున్నాయి. తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
మొత్తంగా చూస్తే, ప్రభుత్వ ఉద్యోగుల అధికారిక కార్ల కొనుగోళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరణకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతుంది, ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.
Next Story
