
సోషల్ మీడియా దెబ్బకు పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుతున్న రద్దీ !
సోషల్ మీడియా వదంతులతో హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ. అయితే దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం, ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు కిక్కిరిశాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తల నేపథ్యంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయన్న వార్తలే ఈ రద్దీకి కారణం. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులుతీరారు. రేట్లు భారీగా పెరగనున్నాయని, పెట్రోల్ నిల్వలలు అడుగంటనున్నాయంటూ జరిగిన ప్రచారమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు యుద్ధం కారణంగా హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్ర ఆంక్షలు అమలవుతుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురై.. పెట్రోల్ నిల్వ చేసుకోవాలని భావించి పెట్రోల్ బంకులకు క్యూకట్టారు. అయితే తాజా పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు స్పష్టం చేయడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
రూమర్ల దెబ్బకు పెరిగిన రద్దీ
సోమవారం రాత్రి నుంచి నగరంలోని అనేక పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.109-111 ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం వేరేలెవెల్లో ఉంది. పెట్రోల్ సరఫరా ఆగిపోతుందని, ధరలు లీటరుకు 500 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు సమీప పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల ట్యాంకులు నింపించుకున్నారు. మరికొందరు అదనంగా బాటిళ్లు, వాటర్ క్యాన్లలో కూడా పెట్రోల్ నింపించుకున్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి 1000 లీటర్ల వాటర్ ట్యాంక్‌లో ఫ్యూయల్ నింపించుకుంటున్న వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేసింది. అయితే హైదరాబాద్, తెలంగాణలోని పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ మంగళవారం కూడా కొనసాగింది.
సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత ఉందనే సందేశాలు విస్తరించడంతో అనేక బంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయని పరిశీలకుడు నవీన్ కుమార్ వెల్లడించారు. అదే విధంగా చంచల్‌గూడలోని పెట్రోల్ బంకు దగ్గర అధికారిక జైలు పెట్రోల్ బంకులు సహా డీలర్లు సాధారణంగానే వాహనాలకు ఇంధనం నింపుతున్నారని వినియోగదారుడు షేక్ ముజమ్మిల్ చెప్పారు. అయితే ఈ వదంతులపై అధికారిక ధృవీకరణ లేదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చమురు ధరల ప్రభావం
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యల తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినట్లు సమాచారం. అంతర్జాతీయంగా చమురు ధరలు సుమారు 9 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్లకు చేరగా, అమెరికా క్రూడ్ ధర 72.79 డాలర్ల వరకు పెరిగింది. గత శుక్రవారం ఇది సుమారు 67 డాలర్ల వద్ద ఉండింది. భారతదేశం తన అవసరమైన ముడి చమురులో సుమారు 88 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ ధరల పెరుగుదల దిగుమతి బిల్లుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
ధరలపై అధికారులు క్లారిటీ
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే పెరగే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కంపెనీలు మార్జిన్ పెంచుకునేలా, ధరలు పెరిగినప్పుడు వినియోగదారులపై భారం తగ్గేలా ప్రభుత్వం సమతుల్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి రిటైల్ ఇంధన ధరలు పెద్దగా మారలేదని సమాచారం. ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆయిల్ కంపెనీలు నష్టాలను భరిస్తూ, ధరలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలను పొందుతున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర మంత్రుల భరోసా
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల అంశంపై కొనసాగుతున్న గందరగోళంపై పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. దేశంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. దేశ ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో ఇంధనం అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతోందని ఆయన వివరించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిపారు. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
ఆయిల్ కంపెనీల ప్రకటన
ఇండియన్ ఆయిల్ కంపెనీ సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు అసత్యమని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు సమాచారం. సరఫరా, పంపిణీ వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని కంపెనీ పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలో సుమారు 50 రోజుల ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఇందులో 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల ఇంధన ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపినట్లు పేర్కొన్నారు.
అంతా మామూలుగానే ఉంది..
హైదారాబాద్ అమీర్ పేట సర్కిల్‌లో ఉన్న పెట్రోల్ బంకులో తాము ఎటువంటి రద్దీని చూడలేదని ఉద్యోగస్తులు చెప్పారు. రద్దీ సాధారణంగానే ఉందని, ఒకరిద్దరు అడిగినా ధరలు ఇప్పుడప్పుడే పెరిగే అవకాశం లేదని, తమ దగ్గర పెట్రోల్ నిల్వ ఉందని చెప్పామని ఉద్యోగి రిజ్వాన్ చెప్పారు. అదే విధంగా సోమాజీగూడ ఎర్రమంజిలి దగ్గర ఉన్న పెట్రోల్ బంకులోని ఉద్యోగస్తుల నుంచి ఇటువంటి సమాచారమే వినిపించింది. అయితే ఎర్రగడ్డ సమీపంలో ఉన్న రెండు పెట్రోల్ బంకులు మాత్రం ఒక మోస్తరు రద్దీని చూశామని, కొందరు బాటిళ్లు 25 లీటర్ల క్యాన్‌కు 10-15 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నారని వివరించారు.

