వచ్చే రెండేళ్లలో ‘టోల్ బూత్ ఫ్రీ’గా ఇండియా
x

వచ్చే రెండేళ్లలో ‘టోల్ బూత్ ఫ్రీ’గా ఇండియా

రానున్న రోజుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలకు టోల్‌ వసూలు చేయరు. వినియోగదారుల బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ను తీసుకునే కొత్త విధానం అమల్లోకి రానుంది.


రానున్న రోజుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలకు టోల్‌ వసూలు చేయరు. వినియోగదారుల బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ను తీసుకునే కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది కేంద్రం ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త విధానంలో ప్రయానించిన దూరం ఆధారంగా మాత్రమే టోల్‌ వసూలు చేస్తారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

“ఇకపై ఉపగ్రహ ఆధారిత టోల్ కలెక్టింగ్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ అవుతుంది. మీరు ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ ఛార్జీ ఉంటుంది. ఫలితంగా సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. గతంలో ముంబై నుంచి పూణెకు వెళ్లేందుకు 9 గంటల సమయం పట్టేది. ఇప్పుడు దాన్ని 2 గంటలకు తగ్గించాం.’’ అని గడ్కరీ అన్నారు.

అడ్డంకులు లేకుండా టోలింగ్ కోసం GNSS వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సలహాల కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెంట్‌ను నియమించిందని గడ్కరీ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు.

ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా జాతీయ రహదారులలో ఎంపిక చేసిన విభాగాలపై GNSS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 2023లో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మార్చి 2024 నుండి భారతదేశంలో GPS ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేస్తామని గడ్కరీ చెప్పారు.

"దేశంలో టోల్ ప్లాజాల స్థానంలో GPS ఆధారిత టోల్ సిస్టమ్‌తో సహా కొత్త సాంకేతికతలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా కొత్త GPS ఉపగ్రహ ఆధారిత టోల్ సేకరణను ప్రారంభిస్తాం" అని చెప్పారు. దీనివల్ల వచ్చే రెండేళ్లలో భారతదేశం ‘టోల్ బూత్ ఫ్రీ’గా మారుతుందని ఆయన అన్నారు.

Read More
Next Story