
లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత గణపతి..?
మావోయిస్టు నేత గణపతి లొంగుబాటు వార్తల మధ్య సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మావోయిస్టు రహిత భారత్ చర్చలు కీలకం.
మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోయినట్టు వార్తలు రావడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన లొంగిపోయినట్టు సమాచారం బయటకు రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ వార్త మాత్రం వేగంగా వ్యాపించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం.
ఢిల్లీలోనే ఉన్నతాధికారులు
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఐజీ బీ సుమతి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోవడం వాస్తవమే అన్న వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందే మావోయిస్టు పార్టీ కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి వారు లొంగిపోయిన నేపథ్యంలో గణపతిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేసిన చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తోంది.
అమిత్ షాతో చర్చలు
మావోయిస్టుల లొంగుబాటు అంశంపై అమిత్ షాతో చర్చలు జరిగినట్టు సమాచారం. మార్చి 31న జరగనున్న మావోయిస్టు రహిత భారత్ సమావేశంపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. సమావేశం వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. గణపతిని కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం రాష్ట్రానికి చేరిన తర్వాతే సీఎం ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. తెలంగాణ, కేంద్ర ఇంటెలిజెన్స్ కలిసి కొన్ని రోజులుగా ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశాయి. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించినట్టు సమాచారం.
ఆపరేషన్ కగార్ టైమ్‌లో కీలక పరిణామం
ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగియనుంది. ఆ గడువు ముగిసేలోపు గణపతి అదుపులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది యాదృచ్ఛికమా లేక ప్రణాళికలో భాగమా అన్న చర్చ కూడా జరుగుతోంది. పీపుల్స్ వార్ కాలం నుంచే గణపతి పార్టీలో కీలక పాత్ర పోషించారు. 1991లో పార్టీలో సంక్షోభం సమయంలో కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు వచ్చాయి. తర్వాత గణపతి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన కాలంలో పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ విలీనమై సీపీఐ మావోయిస్టుగా మారింది.
అజ్ఞాత జీవితం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన గణపతి 1983లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి కుటుంబంతో సంబంధాలు దాదాపు లేకపోయాయి. స్వగ్రామానికి కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అనారోగ్యం కారణంగా అడవుల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని సమాచారం. దీంతో అర్బన్ ప్రాంతాల్లో ఆశ్రయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
నేపాల్ సహా విదేశాల్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. నిజం ఏదో మాత్రం స్పష్టంగా తెలియదు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేతల సమాచారం ఆధారంగా గణపతి ఆచూకీ దొరికినట్టు తెలుస్తోంది. నేపాల్ నుంచి భారత్‌కు తీసుకువచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి కూడా ఈ పరిణామానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు.
ఏకాకిగా గణపతి
ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో పార్టీలో కీలక నేతలు తగ్గిపోయారు. దీంతో గణపతి ఏకాకిగా మిగిలినట్టు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ బలహీనపడిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గణపతి లొంగుబాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్రం, రాష్ట్రం కలిసి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికైతే అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది.

