
తెలంగాణలో గ్యాస్ కనెక్షన్ల బుకింగ్‌కు రెడ్‌సిగ్నల్ ?
సింగిల్ సిలిండర్ నుండి డబల్ కనెక్షన్ కు మారాలని దరఖాస్తులు చేస్తున్న వినయోగదారులకు కూడా కొన్ని రోజులు ఆగాలని డీలర్లు చెబుతున్నట్లు సమాచారం
గల్ఫ్‌దేశాల యుద్ధం కారణంగా తెలంగాణలో గ్యాస్‌కష్టాలు పెరిగిపోతున్నాయి. కొత్త గ్యాస్‌కనెక్షన్లు కావాలని వస్తున్న వినియోగదారులకు గ్యాస్‌డీలర్లు కొద్దిరోజులు ఆగమని చెబుతున్నారు. అలాగే సింగిల్ సిలిండర్ నుండి డబల్ కనెక్షన్ కు మారాలని దరఖాస్తులు చేస్తున్న వినయోగదారులకు కూడా కొన్ని రోజులు ఆగాలని డీలర్లు చెబుతున్నట్లు సమాచారం. యుద్ధం కారణంగా దేశంలో సిలిండర్ల కొరత ప్రభావం తెలంగాణ మీద కూడా గట్టిగానే పడింది. అందుకనే సింగిలి సిలిండర్ల బుకింగ్‌కు 25రోజులు, డబల్ సిలిండర్ల బుకింగ్‌కు 30రోజుల గ్యాప్ ఉండాలని కేంద్రప్రభుత్వమే ఆదేశించింది. ఈఆదేశాలను గ్యాస్‌డీలర్లు పక్కాగా పాటిస్తున్నారు. దీంతో సిలిండర్ల కోసం జనాలు ఎక్కడచూసినా బారులుతీరుతున్నారు.
గ్యాస్‌సిలిండర్ల కొరత డొమెస్టిక్ మీదకన్నా కమర్షియల్ రంగంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. రెస్టారెంట్లు, హోటళ్ళు, మెస్సులు, తోపుడుబండ్లపైన టిఫెన్లు, భోజనాలు అమ్ముకునేవారు, ఫంక్షన్ హాల్ యాజమానులు సిలిండర్ల కొరతతో అల్లాడిపోతున్నారు. బిజినెస్ కోల్పోవటాన్ని ఇష్టపడని వ్యాపారస్తులు చివరకు బ్లాక్‌లో సిలిండర్లను కొంటున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇలాంటి సమయంలో కొత్తకనెక్షన్లు బుక్ చేసుకోవటాన్ని గ్యాస్‌డీలర్లు నిలిపేశారు. కేంద్రప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయా లేకపోతే డీలర్లే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారా అన్నది తెలీటంలేదు. ఈవిషయమై మాట్లాడేందుకు ఏ డీలర్ కూడా సిద్ధంగా లేరు. అందుబాటులోని సమాచారం ప్రకారం రాష్ట్రంలో 1.32 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 71.68 లక్షలుంటే డబుల్ సిలిండర్ల కనెక్షన్లు 60 లక్షలున్నాయి. అంటే మొత్తం కనెక్షన్లలో 50శాతంమందికి పైగా సింగిల్ కనెక్షన్లతోనే నెట్టుకొస్తున్నట్లు అర్ధమవుతోంది. యుద్ధంనేపధ్యంలో సింగిల్‌సిలిండర్ల వినియోగదారుల్లో చాలామంది తమకనెక్షన్లను డబుల్ కనెక్షన్లకు మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గ్యాస్‌డీలర్ల దగ్గరకు వెళ్ళి తమకనెక్షన్లను డబుల్ కనెక్షన్లుగా మార్చాలని దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఇందుకు డీలర్లు అంగీకరించటంలేదు.
యుద్ధంకారణంగా గ్యాస్ దిగుమతి తగ్గిపోయిన కారణంగా అవసరాలకు తగ్గట్లుగా గ్యాస్‌ను సరఫరా చేయలేమని డీలర్లు చేతులెత్తేశారు. ఇందులో భాగంగానే సింగిల్ కనెక్షన్లను డబుల్ కనెక్షన్లకు ఇప్పటికిప్పుడు మార్చలేమని గ్యాస్ డీలర్లు బదులిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే సింగిల్ సిలిండర్ కనెక్షన్లను డబుల్ కనెక్షన్లుగా మార్చగానే వినియోగదారులు వెంటనే రెండో సిలిండర్ బుక్ చేసుకునే ప్రమాదముంది అని డీలర్లు అనుమానిస్తున్నారు. సిలిండర్ ను బుక్ చేసినపుడు డెలవరీ చేయటంలో బాగా ఆలస్యమవుతోంది. ఇపుడున్న వినయోగదారులకే సిలిండర్లను సరఫరా చేయలేకపోతుంటే కొత్తగా వచ్చే వినియోగదారులకు సిలిండర్లను ఎక్కడినుండి తేవాలన్నది గ్యాస్ డీలర్ల ప్రశ్న. అందుకనే సింగిల్ సిలిండర్ కనెక్షన్లను డబుల్ కనెక్షన్లకు మర్చి మరింత భారాన్ని నెత్తకెత్తుకోవటానికి చాలామంది డీలర్లు సిద్ధంగాలేరు. అందుకనే గ్యాస్‌కనెక్షన్ల బుకింగ్ ను డీలర్లు నిలిపేసినట్లు సమాచారం.

