మ్యారెేజ్ రిసెప్షన్లపై గ్యాస్ బండ దెబ్బ
x

మ్యారెేజ్ రిసెప్షన్లపై గ్యాస్ బండ దెబ్బ

ఫిబ్రవరి 18 నుండి మే 17 మధ్యలో మంచి ముహూర్తాలున్న కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల వివాహాలు జరుగుతాయి


గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం తెలంగాణలో వివాహాల మీదపడింది. సమస్య వివాహాలకు కాదు, వివాహాల సందర్భంగా ఏర్పాటుచేసే విందుల మీదనే. వివాహాలంటేనే బంధు, మిత్రులందరినీ పిలిచి అట్టహాసంగా చేసుకునే వేడుక. ఈ సందర్భంగా వందలాదిమందికి విందు ఏర్పాటుచేయటం మామూలే. అయితే ఇపుడు యుద్ధం ప్రభావం వివాహాల విందు మీదపడింది. ఎలాగంటే యుద్ధ ప్రభావం ముందుగా గ్యాస్ సిలిండర్ల మీదపడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో విందు ఏర్పాటు ఎలాగ అన్నది రెండు కుటుంబాలతో పాటు క్యాటరింగ్ సంస్ధలకు పెద్దసమస్యగా మారిపోయింది. ఫిబ్రవరి 18 నుండి మే 17 మధ్యలో మంచి ముహూర్తాలున్న కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల వివాహాలు జరుగుతాయి.

వివాహం అంటేనే కొన్ని నెలలముందు నుండే ప్రిపరేషన్ మొదలైపోతుంది. కల్యాణమండపాల బుకింగ్, క్యాటరింగ్ కాంట్రాక్ట్ తో పాటు ఇతరత్రా అవసరాలన్నింటినీ నెలల ముందే అడ్వాన్సులిచ్చి బుక్ చేసేసుకుంటారని అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి నుండి మే 17వ తేదీలోగా మంచి ముహూర్తాలు ఉన్న కారణంగా వేలాదిమంది 2025, డిసెంబర్ లోనే పైన చెప్పిన అవసరాలకు అడ్వాన్సులిచ్చుకుని బుక్ చేసుకున్నారు. అడ్వాన్సుల రూపంలోనే కోట్లాది రూపాయలు చేతులుమారాయి. అడ్వాన్సులు పుచ్చుకున్నారు కాబట్టి ఎవరి పనులను వాళ్ళు ప్రారంభించేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఫిబ్రవరి 27వ తేదీన ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి.

సడెన్ గా మొదలైన యుద్ధం కారణంగా అనేకదేశాలతో పాటు మనదేశం, తెలంగాణపైన కూడా యుద్ధప్రభావం పెరిగిపోతోంది. మొట్టమొదటగా యుద్ధ ప్రభావం గ్యాస్ బండలపైన పడింది. మనదేశం గ్యాస్ వినియోగంలో అత్యధికం ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల నుండి దిగుమతి అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఊహించని రీతిలో ఇరాన్ గల్ఫ్ లోని దుబాయ్, కువైట్, బహ్రెయిన్, సౌదీఅరేబియా, ఖతార్, ఒమన్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలను యుద్ధంలోకి లాగేసింది. ఇతర దేశాలతో యుద్ధం చేయటానికి ఏమాత్రం సిద్ధంగా లేని గల్ఫ్ లోని చాలా దేశాలు ఇపుడు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద విరుచుకుపడుతుంటే ఇరాన్ ఏమో మిగిలిన గల్ఫ్ దేశాలపైన బాంబులు, మిస్సైళ్ళు ప్రయోగిస్తోంది.

కమర్షియల్ సిలిండర్లకు కొరత

ఇరాన్ దెబ్బకు గల్ఫ్ లోని చాలా దేశాల్లో ఆయిల్ కంపెనీలు దారుణంగా దెబ్బతినేశాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. నిల్వలన్నీ మండిపోతున్నాయి. కోట్లాది బ్యారెళ్ళు మంటలకు ఆహుతి అయిపోతున్నాయి. గ్యాస్, ఆయిల్ తో ప్రయాణిస్తున్న వందలది నౌకలు హర్మోజ్ జలసంధిలో ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దాంతో మనదేశంలో ఇపుడు గ్యాస్ కొరత పెరిగిపోతోంది. గ్యాస్ కొరతను నియంత్రించటానికి కేంద్రప్రభుత్వం ఇళ్ళల్లో వాడే గ్యాస్ కు ఇబ్బందిలేకుండా కమర్షియల్ గ్యాస్ ను కంట్రోల్ చేసింది. ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ పంపిణీ ఆగిపోయిందో దాని ప్రభావం వెంటనే హోటళ్ళు, రెస్టారెంట్లు, మెస్సులు, పీజీ హాస్టళ్ళతో పాటు హాస్టళ్ళపైన పడింది. పైన చెప్పినట్లు గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు, పీజీ హాస్టళ్ళను మూసేస్తున్నారు లేదా మెనూ తగ్గించేస్తున్నారు.

మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ కొరత వచ్చేసిందో వెంటనే దాని ప్రభావం పెళ్ళిళ్ళపైన పడుతోంది. మామూలుగా వివాహాలంటే మనదగ్గర వందలాదిమందిని పిలిచి గ్రాండ్ గా విందుఏర్పాట్లుంటాయి. ఇపుడు వందలమందికి విందు ఏర్పాటుచేయాలంటే వంటవాళ్ళున్నారు కాని వంటలుచేయటానికి అవసరమైనన్ని గ్యాస్ బండలు దొరకటంలేదు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక రెండువైపుల పెద్దలతో పాటు క్యాటరింగ్ సంస్ధల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఫిబ్రవరి-మే17లోపు రాష్ట్రంలో లక్షలాది వివాహాలు జరుగుతాయి. మార్చి మొదటివారంలో జరిగిన పెళ్ళిళ్ళవరకు గ్యాస్ కొరత పెద్దగా ఎదురుకాలేదు. అయితే తర్వాతనుండి యుద్ధం తీవ్రరూపం దాల్చటంతోనే ఇపుడు గ్యాస్ కొరత పెరిగిపోయి క్యాటరర్స్ లో టెన్షన్ పెరిగిపోతోంది.

కరోనా పరిస్ధితులే ఎదురవుతున్నాయా ?

అప్పుడెప్పుడో కరోనా సమయంలో వివాహాలకు రెండువైపులా కలిపి పదిమంది లేదా 20మందికి మాత్రమే పరిమితసంఖ్యలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాలు గుర్తుండే ఉంటుంది. మళ్ళీఇపుడు అలాంటి పరిస్ధితులే ఎదురవుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిన్నా, పెద్ద మ్యారేజి హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, హోటళ్ళు, రిసార్టులు అన్నీకలిపి సుమారు 3 వేల దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐదునెలల ముందే బుక్ అయిపోయాయి. ఫిబ్రవరి మొదటివారం నుండి మార్చి మొదటివారం వరకు సుమారు 5వేల పెళ్ళిళ్ళు జరిగినట్లు అంచనా. జరగబోయే వివాహాలకు విందులు ఎలా ఏర్పాటుచేయాలి, అందుకు గ్యాస్ బండలను ఎలా సమకూర్చుకోవాలో పెళ్ళిపెద్దలకు, క్యాటరింగ్ యాజమాన్యాలకు అర్ధంకావటంలేదు.

గ్యాస్ బండలే పెద్ద సమస్య : సుధి

ప్రముఖ జ్యోతిష్కుడు, వాస్తు నిపుణుడు శ్రీకృష్ణ సుధి తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ లభ్యతే పెద్ద సమస్యగా మారింది’’ అన్నారు. అయితే ‘‘గ్యాస్ సమస్య తొందరలోనే తీరిపోతుంది’’ అనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ‘‘ప్రతి ఏడు ఫిబ్రవరి-మే 17వ తేదీ మధ్యలో సగటున హైదరాబాద్ ప్రాంతంలో 10వేల వివాహాలు జరుగుతాయి’’ అని చెప్పారు. ‘‘వివాహం సందర్భంగా విందు తప్పదు కాబట్టి కొందరు గ్యాస్ కు బదులుగా కట్టెల పొయ్యిల వైపు మళ్ళుతున్నారు’’ అని తెలిపారు. ‘‘గ్యాస్ కొరత కారణంగా వివాహాలు లేదా ఇతరత్రా సుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నట్లు తన దృష్టికి రాలేదు’’ అని చెప్పారు.

కష్టంగానే ఉంది : లక్ష్మీనారాయణ

‘‘యుద్ధ ప్రభావంతో మ్యారేజీల విందులకు గ్యాస్ దొరకటంలేదు’’ అని శ్రీనివాస క్యాటరర్స్ ఓనర్ భాగవతుల లక్ష్మీనారాయణ తెలిపారు. ‘‘రు. 2 వేలుండే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇపుడు రు. 5 వేలు దాటిపోయింది’’ అని చెప్పారు. ‘‘గ్యాస్ కు కట్టెలపొయ్యిలు మాత్రమే ప్రత్యామ్నాయం’’ అనిచెప్పారు. ‘‘రిసార్టుల్లో జరిగే వివాహాలకు కట్టెలపొయ్యిల మీద విందులు ఏర్పాటు జరుగుతున్నా మండపాల్లో జరిగే పెళ్ళిళ్ళకు ఓనర్లు కట్టెలపొయ్యిలను అనుమతించటంలేదు’’ అని చెప్పారు. ‘‘మండపాల్లో కట్టెలపొయ్యిలమీద వంటలు చేయాలంటే వచ్చే పొగ కారణంగా గోడలు, రూఫ్ అంతా మసి అయిపోతుందని ఓవనర్లు అంగీకరించటంలేదు’’ అని చెప్పారు. ‘‘రిసార్టుల్లో ఓపెన్ ప్లేసు ఉంటుంది కాబట్టి కట్టెలపొయ్యిల మీద వంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు’’ అని తెలిపారు.

‘‘ఉప్పల్ ఏరియాలో మాత్రమే సుమారు 200 క్యాటరింగ్ సంస్ధలున్నాయి’’ అని భాగవతుల చెప్పారు. ‘‘అడ్వాన్సులు ముందే తీసేసుకుని కమిట్ అయిపోయిన కారణంగా ఇపుడు వెనక్కుపోతే తమఇమేజ్ దెబ్బతింటుందనే టెన్షన్ పెరిగిపోతోంది’’ అని చెప్పారు. ‘‘హైదరాబాద్ పరిధిలో సుమారు 40 వేల ఫంక్షన్ హాళ్ళున్నాయి’’ అని తెలిపారు. ‘‘తాము రాబోయే 16 రోజుల్లో 3 వివాహాలను ఒప్పుకున్నాము’’ అనిచెప్పారు. ‘‘ఒప్పుకున్న వివాహాలకు విందుఏర్పాటు ఎలా చేయాలన్నదే పెద్ద సమస్యగా మారింది’’ అని భాగవతుల లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నేపధ్యంలో వివాహాల సందర్భంగా ఏర్పాటుచేయాల్సిన విందుపై గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఈ కొరత ఎంతకాలం ఉంటుందో మాత్రం అర్ధం కావటంలేదు.

Read More
Next Story