తెలంగాణ ప్రభుత్వం ఫొటో చెప్పని ‘గ్యాస్’ కథ
x

తెలంగాణ ప్రభుత్వం ఫొటో చెప్పని ‘గ్యాస్’ కథ

గ్యాస్ కొరత మధ్య ప్రభుత్వం అధిక సరఫరా ప్రకటించింది. నేలస్థాయిలో పరిస్థితులు, అధికారిక లెక్కల మధ్య తేడాపై ప్రశ్నలు.


ఇరాన్ యుద్ధం మంటలు తెలంగాణ వంటగదుల్లో సెగ పుట్టించింది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్, డొమెస్టిక్ అన్న తేడా లేకుండా గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరారు. కానీ గ్యాస్ సరఫరా అంశంపై తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక ఫొటో మాత్రం పూర్తిగా కొత్త కథనే వినిపిస్తోంది. అసలు కొరతే లేదంటోంది. సగటుకన్నా ఎక్కువగానే సప్లై చేశామని చెప్తోంది. కొరత లేకపోతే.. గ్యాస్ సరఫరా సగటు కన్నా ఎక్కువగా జరిగితే హోటళ్లు బంద్ దిశగా అడుగు ఎందుకు వేశాయి? హాస్టళ్లు ఆహారం వండటం ఎందుకు మానుకున్నాయి? ప్రజలు బారులు ఎందుకు దీరారు? అసలు గ్యాస్ బండపై ప్రభుత్వ ఫొటో చెప్పని కథలెన్ని. చెప్తున్న నిజాలేంటి? ఒక్క ఫొటోతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రశ్నలకు తెరలేపింది సర్కార్.

గ్యాస్ సరఫరా సరిగా లేని కారణంగా హైదరాబాద్‌లోని చాలా హోటళ్లు.. కట్టెలపొయ్యి బాట పట్టాయి. హాస్టళ్లు వంట మానేశాయి. హైదరాబాద్‌లోని అనేక హోటళ్లు బంద్ దిశగా కూడా అడుగులు వేశాయి. కొన్ని రోజుల్లో తెలంగాణ అంతటా గ్యాస్ కొరత మంటలు కార్చిచ్చులా అల్లుకున్నాయి. డొమెస్టిక్ సిలెండర్ల సరఫరా విషయంలో కూడా అదే పరిస్థితి. గ్యాస్ బండ కోసం భారీభారీ లైన్లలో ప్రజలు నిల్చుకున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ అంతటా కనిపిస్తున్న దృశ్యాలే ఇవి.

కట్టెల పొయ్యే గతన్న హాస్టళ్లు

గ్యాస్ సరఫరాలో వచ్చిన ఒడిదుడుకుల ప్రభావం హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగస్థులపై భారీగానే పడింది. హాస్టల్ మెనూలో పెను మార్పులకు దారితీసింది. ఆహారం అందిస్తున్నా రాబోయే రోజులు సమస్యలు మరింత కఠినం కావొచ్చని హాస్టల్ యాజమాన్యాలు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే గ్యాస్ ఎక్కువగా అవసరం అయ్యే చపాతీ, పూరీ, దోస లాంటి ఆహార పదార్థాలకు హాస్టళ్లు బ్రేకులు వేశాయని, వాటి స్థానంలో తక్కువ గ్యాస్ ఖర్చుతో అయిపోయే ఉప్మా, పొంగలి, పోహ లాంటి టిఫిన్ అందిస్తున్నారని ప్రెస్టీజ్ కంపెనీ (Prestige Group) లో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కే. వినూత్న చెప్పారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఎప్పటిలానే పెడుతున్నప్పటికీ అందులో వేపుడు ఉండటం లేదని చెప్పారు. “గ్యాస్ కొరత రీత్యా ఇది తప్పనిసరి పరిణామం కాబట్టి మేము హాస్టల్ వారికి సహకరిస్తున్నాము. ప్రొద్దున్నే టిఫిన్ సమాయనికే మధ్యాన భోజనం సిద్దంగా ఉంటుంది కాబట్టి అదే ఆఫీసు కు తీసుకువెళ్తున్నాము. టి, కాఫీ లాంటివి ఆఫీసు లో ఉండే మెషిన్ లో నే తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులు ఎదురు కావటం లేదని,” ఆమె వివరించారు.

తాను ఉంటున్న హాస్టల్ లో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ సమయానికి తమకు ఆహారం అందిస్తున్నారని యాక్సెంచర్‌లో (Accenture) సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎన్. హష్మిత చెప్పారు. ఆఫీసు లో ఇది వరకు ప్రతి ఫ్లోర్ లో ఉండే క్యాంటీన్ సౌకర్యం ప్రస్తుతం ప్రతి రెండు ఫ్లోర్ లకు ఒకటి చొప్పున నడుపుతున్నారని. దీని వలన స్పెషల్ డిష్ లు ఆర్డర్ చేస్తే తినటానికి ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. “మా ఆఫీసుకు దగ్గరలో పెద్ద రెస్టారెంట్స్ ఏమి లేవు. కాబట్టి తప్పని సరిగా హాస్టల్ లో ఇచ్చిన భోజనం తీసుకెళ్ళి తింటున్నాము,” అని ఆమె చెప్పారు.

బేగంపేట దగ్గర ఉన్న శ్రీనివాస జంట్స్ హాస్టల్ యజమాని దయానంద్ మాట్లాడుతూ.. గ్యాస్ లేక తాము కట్టెలు పెట్టి వండి భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఆ కట్టెలు దొరకడం కూడా కష్టమవుతోందని, తమ హాస్టళ్లో ఉన్న వారికి టిఫిన్ పెట్టడం కూడా చాలా కష్టం అవుతుందని అన్నారు. గ్యాస్ దొరకక, కట్టెలు దొరకక తమ పరిస్థి అగమ్యగోచారంగా మారిందని అన్నారు. ఒక రాజకీయ నాయకులు కొరతలేదని చెప్తున్నారే తప్ప.. ప్రజల సమస్యలు తీర్చడానికి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.

ఖాళీ అయిన టిఫిన్ సెంటర్లు..

హాస్టళ్లనే కాదు.. హైదరాబాద్‌లోని అనేక ప్రధాన సెంటర్లలో టిఫిన్ సెంటర్లు ఖాళీ అయ్యాయి. గ్యాస్ లభ్యం పూర్తిగా పడిపోవడంతోనే తాము వ్యాపారం ఆపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని టిఫిన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట సెంటర్లోని అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ ఓనర్ పాతూరి వెంకటేశ్వర్లు తన ఆవేదనను ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. గ్యాస్ ధర గిట్టుబాటు అయ్యేలా లేదని, అలాంటప్పుడు తాము రేట్లు పెంచితే కస్టమర్స్ రానని, అందుకే కొట్టు కట్టేశామని వివరించారు. బ్లాక్‌లో కొనాలని చూసినా కమర్షియల్ గ్యాస్ బండ రూ.4500పైనే చెప్తున్నారని వివరించారు. రూ.1600 ఉండే గ్యాస్ బండ ఇప్పుడు రూ.3500 పలకడం తమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వివరించారు.

హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర టిఫిన్ సెంటర్ నడుపుతున్న నాగరాజు కూడా తీవ్ర ఆవేదన వెళ్లిబుచ్చారు. గ్యాస్ ఏమాత్రం లభించడం లేదని, దాని ప్రభావం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని చెప్పారు. గ్యాస్ దొరకక నాలుగు రోజుల నుంచి తాము తమ టిఫిన్ సెంటర్‌ను కూడా నడిపించే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. ఇదే పరిస్థితి మరో నెల కొనసాగితే తిరిగి సొంతూళ్లకు వెళ్లి ఏదో చిన్నా చితక పని చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యి పెట్టడానికి అక్కడ అనుమతులు లేవని, ఆ అవకాశం ఉంటే అలా అయినా ఏదో ఒక తిప్పలు పడి ఉండేవాళ్లమని వివరించారు.

ప్రభుత్వం మాట వేరేలా..

తెలంగాణ వ్యాప్తంగా హోటళ్లు, చిరు వ్యాపారులు, హాస్టళ్ల వాళ్లంతా కూడా తమకు గ్యాస్ లభ్యం కావడం లేదని మొత్తుకుంటున్నారు. సామాన్యుడు సైతం గ్యాస్ కోసం ఉదయాన్ని బండను నెత్తిన పెట్టుకుని క్యూలో నిల్చుంటున్నారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట ఎన్నో కనిపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం గ్యాస్ సరఫరా విషయంలో తాము బలమైన నెంబర్లను నోట్ చేశామని చెప్తోంది. మార్చి నెల 17వ తేదీ ఒక్కరోజులోనే సగటు కన్నా ఎక్కువ సంఖ్యలో గ్యాస్ సిలెండర్లను సరఫరా చేశామని వెల్లడించింది. రోజుకు సగటున 2,15,151 సిలెండర్లు సరఫరా చేస్తే మంగళవారం ఒక్కరోజే ప్రభుత్వం 2,35,678 సిలెండర్లను సప్లై చేశామని ప్రకటించింది.

వీటిలో ఇండియన్ గ్యాస్ 93,887 సిలెండర్ల అంటే వీటి సప్లై ఒకశాతం పెరిగింది. హిందుస్తాన్ పెట్రోలియం(HP) 84,156 (11.98శాతం పెరుగుదల), భారత్ గ్యాస్ 57,635(22.63శాతం పెరుగుదల)ను రికార్డ్ చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సరఫరా చాలా స్టేబుల్‌గా ఉందని, అన్ని సంస్థల గ్యాస్ సరఫరాలో పెరుగుదల కూడా ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు గ్యాస్ విషయంలో ఆందోళన చెందవద్దని కూడా సూచించింది.

గ్యాస్ అంతా ఏమైంది?

ప్రభుత్వం చేసిన ఈ ఒక్క ప్రకటనతో అనేక ప్రశ్నలు తలెత్తాయి. డిమాండ్‌కు సరిపడేలా ప్రభుత్వం గ్యాస్‌ను సరఫరా చేస్తుంటే ప్రజలు ఎందుకు గ్యాస్ బండతో క్యూలలో నిలబట్టారు. భారత‌దేశ మొత్తం గ్యాస్ వినియోగంలో కేవలం 9శాతమే వినియోగించుకునే కమర్షియల్ వాళ్లు ఎందుకు మూతవేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు? అసలు ప్రభుత్వం సరఫరా చేస్తున్న లక్షల సిలెండర్లు ఎటు వెళ్తున్నాయి? ఇలా అనేక ప్రశ్నలు సమాధానాలు లేకుండా ఉన్నాయి. గ్యాస్ సరఫరాలో యావరేజ్‌ను దాటామంటూ ప్రకటించిన ప్రభుత్వం.. ఇన్నాళ్లూ ప్రజలు, వ్యాపారస్తులు పడుతున్న ఇక్కట్లకు ఎందుకు సమాదానం చెప్పలేదనేది మరో పెద్ద ప్రశ్న.

Read More
Next Story